పోషణ

నీటిలో కరిగే విటమిన్- ‘ సి ‘ విటమిన్


విటమిన్ సి ని ఆస్కార్బిక్ యాసిడ్ అని కూడా అంటారు. ఒక యాంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. శరీర సాధారణ అభివృద్దికి, పెరుగుదలకు చాలా అవసరం. మిగిలిన సి విటమిన్ ను శరీరం మూత్రం రూపంలో బయటకు విసర్జిస్తుంది.
మానవ శరీరంలో ‘ సి ‘ విటమిన్ నిర్వహించే పాత్ర
విటమిన్ సి రక్తనాళాలను, ఎముకలను, స్నాయువులను బలపరుస్తూ కొల్లాజెన్ సంశ్లేషణలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
అలాగే ఎముకల మరమ్మత్తులు, మృదులాస్థి, పళ్లు సంరక్షణ మరియు గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది.
ఆహారం ద్వారా ఇనుము ఫెర్రిచ్ రూపంలో లభిస్తుంది. శరీరంలో ఇది ఫెర్రస్ రూపంలో శోషించబడడానికి సి విటమిన్ చాలా అవసరం.
ఇది సమర్థవంతమైన యాంటి వైరల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. దంతాలు మరియు చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
రోగ నిరోధక శక్తి అభివృద్ధి మరియు అంటు వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ధమనులు గట్టిపడేలా చేస్తుంది.
లభ్యత
విటమిన్ సి ఎక్కువగా జామ పండుతో పాటు నిమ్మకాయలు, నారింజ, కమల, బత్తాయి వంటి అన్ని పుల్లని పండ్లలో ఉంటుంది. ఇంకా టమాటో, ఆకుకూరలు, ముఖ్యంగా మునగాకు, కరివేపాకు, క్యాబేజి, క్యాప్సికం, మిరియాలు, బ్రోకలి మొదలైన వాటిలో ఉంటుంది.
లోపాలు: విటమిన్ సి లోపం వలన అలసట, చిగుళ్ళ వాపు, శక్తి లేకపోవడం, మరియు ముక్కు రక్తస్రావం, పొడి చర్మం, జుట్టు నష్టం, దీర్ఘకాలిక రక్తహీనత, స్కర్వీ మొదలైనది.
విధులు
విటమిన్ సి ఒక ఆంటీ ఆక్సిడెంట్ లా పనిచేసి ఎన్నో ఆక్సీకరణ పదార్థాల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. అందువల్ల విటమిన్ సి ని తీసుకోవడం చాలా ముఖ్యం.
కొల్లాజెన్ ఏర్పాటుకు
శరీరంలోని కణాలు, కణజాలాల మధ్య బంధాలను ఏర్పరిచే పదార్థం కొల్లాజెన్ అనే మాంసకృత్తులు.ఈ కొల్లాజెన్ దంతాలలో, ఎముకలలో, కార్టిలేజ్ లలో, చర్మంలో, ఇంకా చాలా అవయవాలలో బంధన కణజాలంలా వ్యవహరిస్తుంధి. ఫైబ్రోబ్లాస్టులు అనే కణాలు కొల్లాజెన్ ని ఉత్పత్తి చేయడానికి విటమిన్ సి చాలా ముఖ్యం. ఎముకలు ఏర్పడడానికి విటమిన్ సి సమృద్ధిగా ఉండాలి . అలాగే మన శరీరంలో విటమిన్ సి లోపించినపుడు బలహీనమైన దంతాలు ఏర్పడతాయి. దీనికి కారణం డెంటైన్ అనే పదార్థం ఏర్పడకపోవడం. అందువల్ల దంతాలు త్వరగా విరిగిపోవడం, పాడవడం జరుగుతుంది. చర్మం ఏధైనా గాయాలతో గురైనపుడు ముఖ్యంగా కాలిన గాయాలు అయినపుడు విటమిన్ సి ని తీసుకోవడం వల్ల త్వరగా మానిపోయి, కొత్త కణాలు ఏర్పడతాయి. 
అంతేకాక శరీరంలో "కార్నెటైన్" అనే ఆర్గానిక్ కాంపౌండ్ ఉత్పత్తి అవడానికి విటమిన్ సి అవసరం.
కార్నెటైన్ అనేది నైట్రోజన్ కలిగిన చిన్న పదార్థం . కార్నెటైన్ క్రొవ్వు పదార్థాలను మైటోకాండ్రియాలకి రవాణా చేస్తాయి. అక్కడి క్రొవ్వు ఆక్సీకరణం చెంది శక్తి విడుదల అవుతుంది . ఈ శక్తిని కణాలు జీవక్రియలకు ఉపయోగించుకుంటాయి.  
న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తికి
సెరిటోనిన్ మరియు నారెపినెఫ్రాన్ ఉత్పత్తులలో విటమిన్ సి ముఖ్య పాత్ర వహిస్తుంది. మెదడులో మరియు అడ్రినల్ కణజాలాలలో విటమిన్ సి సమపాళ్ళలో ఉన్నప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పత్తి జరుగుతుంది.
హార్మోన్ల ఉత్ప్రేరణకు దోహదపడతాయి
శరీరంలో హార్మోన్లు మొదటగా ప్రీకర్సర్ల రూపంలో స్రవించబడి కొన్ని రసాయన చర్యల ద్వారా క్రియాత్మక రూపంలోకి మారుతాయి. ఈ చర్యలలో విటమిన్ సి పాల్గొంటుంది. బాంబెసిన్, కాల్సిటోనిన్, గాస్ట్రిన్, ఆక్సిటోసిన్, తైరోట్రోఫిన్, కార్టికోట్రోఫిన్, వాసోప్రెస్సిన్, పెరుగుదల హార్మోన్ మొదలగు హార్మోన్ల ఉత్ప్రేరణకు విటమిన్ సి చాలా అవసరం.
శరీరంలో ఎన్నో విషపదార్థాలను విషరహితంగా మార్చే చర్యలను విటమిన్ సి పర్యవేక్షిస్తుంది. ఈ ప్రక్రియలు కాలేయంలో జరుగుతాయి.
యాంటీ ఆక్సిడెంట్
విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లలో అతి ముఖ్యమైనది. జీవక్రియ చర్యలు నిర్విరామంగా జరుగుతూనే ఉంటాయి. ఈ చర్యల కారణంగా ఆక్సీకరణ పదార్థాలు, విషపదార్థాలు ఎల్లప్పుడు స్రవించబడుతూనే ఉంటాయి.ఈ పదార్థాలు కణాలను దెబ్బతీసి అనారోగ్యానికి కారణం అవుతాయి. అటువంటి పదార్థాలను విటమిన్ సి బంధించి బయటకు పంపివేస్తుంది. అంతేకాక జీవక్రియ చర్యలలో విడుదలైన "ఫ్రీ ఆక్సిజన్ రాడికల్" స్వేచ్చారాశుల కణాల పొరలను నాశనం చేస్తాయి. అటువంటి వాటిని విటమిన్ సి శరీరం నుండి తొలగిస్తాయి. అందువల్ల వీటిని "యాంటీ ఆక్సిడెంట్లు" అని అంటారు. యాంటీ అక్సిడెంట్లు ముదసలి లక్షణాలను త్వరగా దరిచేరనివ్వవు.చర్మం యవ్వనంగా ఉండడానికి సహాయపడుతుంది.

 • కొలెస్ట్రాల్ యొక్క జీవక్రియను విటమిన్ సి అవసరం. అంతేకాక రక్తకణాల రూపం సరైన పరిమాణాలలో ఉండేలా చేసి గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో విటమిన్ సి ది కీలకపాత్ర.
 • శరీరంలో ఇనుము శోషణ సరిగ్గా జరగాలంటే విటమిన్ సి ని తప్పక తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ ఆహారంలోని ఇనుమును ఫెర్రిక్ అయాను నుండి ఫెర్రస్ రూపంలోకి మార్చి శరీరంలో గ్రహించేలా చేస్తుంది. అంతేకాక రక్తప్లాస్మాలోని "ఫెర్రిటిన్" లా మార్చి కాలేయంలోకి రవాణా జరిపి, ఇనుముని నిల్వ చేయడానికి సహాయపడుతుంది.
 • రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేస్తుంది.
 • కాల్షియం మరియు ఫోలిక్ యాసిడ్ యొక్క శోషణకు విటమిన్ సి తప్పనిసరి.

విటమిన్ సి లోపం వల్ల కలిగే అనర్థాలు
విటమిన్ సి లోపం అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. వండుకునే విధానంలో తప్పులు, పండ్లు, కూరగాయలు సరిగ్గా తీసుకోకపోవడం అనేవి అతి ముఖ్య కారణాలు.
విటమిన్ సి లోపం తీవ్రంగా ఉన్నప్పుడు "స్కర్వి" అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి అంత సాధారణం కాదు. చంటి పిల్లలకు స్కర్వి వ్యాధి సోకదు, ఎందుకంటే తల్లిపాలలో బిడ్డకు కావలసిన విటమిన్ సి సమపాళ్ళలో ఉంటుంది. అందువల్ల పిల్లల ఆరోగ్యానికి తల్లిపాలు తప్పనిసరి.
స్కర్వి వ్యాధి లక్షణాలు

 • మొదట లక్షణాలు అంత స్పష్టంగా కనిపించకపోయినప్పటికి లోపం తీవ్రమైన కొద్ది లక్షణాలు కనిపిస్తుంటాయి.
 • బలహీనంగా ఉండడం, ఊపిరి ఆడకపోవడం, కండరాల బలహీనత, కండరాలలో నొప్పి, కీళ్ళ నొప్పి, ఆకలి వేయకపోవడం వంటి లక్షణాలు మొదట కలుగుతాయి.
 • వ్యాధి తీవ్రమైనప్పుడు జెంజివైటిస్ (చిగుర్లలో నుండి రక్తస్రావం), అత్రాల్జియ (కీళ్ళ నొప్పి), పెట్టాచి (చర్మంపై రక్తస్రావ మచ్చలు), మానసిక ఒత్తిడి, అధిక రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్త హీనతకు కూడా గురవుతారు. ఇది మాత్రమే కాకుండా ఇంకా అనేక అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలున్నాయి.
 • ఎముకలు బలహీనపడతాయి ముఖ్యంగా కాలి ఎముకలు.
 • దెబ్బ తగిలినపుడు అవి మానడానికి చాలా సమయం పడుతుంది.
 • విటమిన్ సి తక్కువ ఉన్నవారు ఫ్రాక్చర్లకు గురయ్యే అవకాశాలు ఎక్కువ.
 • చిగుళ్ళ నుండి రక్తస్రావం జరుగుతుంది,
 • రక్తనాళాలు బలహీనపడి, ఒత్తిడికి గురవుతాయి.అందువల్ల శరీరంపై ఎర్రని మచ్చలు రావడం జరుగుతుంది.

శ్వాసకోశ వ్యాధుల నివారణలో
విటమిన్ సి లోపం ఉన్నప్పుడు జలుబు త్వరగా వస్తుంది. తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఊపిరితిత్తులు సరిగ్గా విధులు నిర్వహించాలంటే విటమిన్ సి తప్పకుండా ఉండాలి. ఊపిరితిత్తుల గాలిగొట్టాలలో విటమిన్ సి ఉంటుంది. అది ఆస్తమా మరియు అలర్జీలను నివారించడంలో శరీరానికి సహకరిస్తుంది. అందువల్ల విటమిన్ సి ని ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలి.
క్యాన్సర్
విటమిన్ సి ఒక ఆంటీ ఆక్సిడెంట్. ఇది రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేసి అనేక వ్యాధులను నివారించుకోగలిగిన శక్తిని శరీరానికి ఇస్తుంది. ట్యూమర్ల పెరుగుదలను నివారించే గుణం ఉన్నందువల్ల క్యాన్సర్ నివారణకు విటమిన్ సి చాలా ముఖ్యం. ముఖ్యంగా కడుపు, ఊపిరితిత్తులు, కోలాన్, నోటి క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ నివారణకు విటమిన్ సి తోడ్పడుతుంది.
ఎయిడ్స్

 • విటమిన్ సి తెల్లరక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ యొక్క సమతుల్యతకు ముఖ్యం. అందువల్ల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను ఇన్ ఫెక్షన్ బారి నుండి రక్షిస్తుంది.
 • పిత్తాశయంలో రాళ్ళను నివారించడంలో విటమిన్ సి ముఖ్య పాత్ర వహిస్తుంది.
 • విటమిన్ సి రోజు తీసుకునే వారిలో ఈ సమస్య 37% తక్కువ అని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
 • విటమిన్ సి రోజు తీసుకోవడం వల్ల కంటి శుక్లాల వ్యాధులు వచ్చే అవకాశం తక్కువ. విటమిన్ తీసుకోనివారి కంటే తీసుకునే వారిలో వ్యాధి సంక్రమించే అవకాశం 57% తక్కువ.

గుండె వ్యాధులలో

 • విటమిన్ సి చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. అందువల్ల గుండె జబ్బులు నివారించడంలో సహాయపడుతుంది.
 • మధుమేహ వ్యాధిగ్రస్తులు విటమిన్ సి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.
 • లాభాలు ఎక్కువ ఉన్న కూడా ఏ పోషక పదార్థమైన సిఫారసు చేయబడిన మోతాదు వరకు తీసుకోవడం మంచిది.

సిఫారసు చేయబడ్డ పరిమాణాలు

వర్గం

మోతాదు మిల్లీ గ్రాం/రోజు

పురుషులు

40

స్త్రీలు

40

గర్భిణులు

40

బాలింతలు

80

చంటి బిడ్డలు (0-12నెలలు)

25

1-18 సంవత్సరాల అమ్మాయిలు మరియు అబ్బాయిలు

40


విటమిన్ సి లభించే పదార్థాలు
విటమిన్ సి ఎక్కువగా శాకాహారంలో లభిస్తుంది. ముఖ్యంగా తాజా పండ్లలో మరియు కూరగాయలలో ఉంటుంది. అన్నిటి కంటే ఉసిరి పండ్లలో విటమిన్ అధికంగా లభిస్తుంది. జామపండ్లలో, పుల్లటి పండ్లలో కూడా విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. ఆకుకూరలలో ముఖ్యంగా మునగాకు మరియు అగతిలో ఎక్కువగా ఉంటుంది. పాలు, మాంసం, పప్పులు, ధాన్యాలలో ఇది తక్కువగా లభిస్తుంది. మొలకెత్తిన ధాన్యాలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
 

ఆహారపదార్థం

విటమిన్ సి మిల్లీ గ్రాం/100 గ్రాం

ఉసిరి

600

మునగాకు

220

జామపండు

212

జీడిమామిడిపండు

180

అగతి

129

కాప్సికం

137

క్యాబేజి

124

కాకరకాయ

96

నారింజరసం

30

టమాటాలు

27

విటమిన్ సి కి నీటిలో కరిగే గుణం ఉండడం వల్ల దీన్ని పొందడంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ఆహారపదార్థాల్లో విటమిన్ సి శాతాన్ని పెంచడానికి కొన్ని చిట్కాలు

 • విటమిన్ సి ఉన్న ఆహారపదార్థాలను చల్లని మరియు తేమ సమృద్ధిగా ఉన్న ప్రదేశాలలో నిల్వ చేయాలి.
 • సూర్యకిరణాలకు, గాలికి ఎక్కువగా బహిర్గతమవకుండా జాగ్రత్తపడాలి.
 • ఆహారపదార్థాలను నీటిలో ఎక్కువగా నానపెట్టకూడదు.
 • తక్కువ నీటిలో వండుకోవడం మంచిది.
 • పండ్లను జ్యూస్ లా కాకుండా సాధారణ రూపంలో తినడం శ్రేయస్కరం.
 • ఆకూకూరలను వండిన వెంటనే వేడిగా తినటం మంచిది.
 • పండ్లను ముక్కలుగా కోసిన వెంటనే తినాలి, నిల్వ ఉంచకూడదు.
 • కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసి వండుకోవడం కన్నా పెద్ద పరిమాణంలో ఉంచి వండుకోవాలి.
 • క్యాబేజి, టమాటా మొదలగు కూరగాయలను సలాడ్ల రూపంలో తాజాగా తీసుకోవడం శ్రేయస్కరం.
 • ధాన్యాలను మొలకెత్తించడం ద్వారా విటమిన్ సి శాతాన్ని పెంచుకోవచ్చు.

కుమారి ఐ. ప్రసన్న, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2012/010
సమీక్ష: శ్రీమతి ఎన్.నిర్మలమ్మ, పోషకాహార నిపుణులు.

Download File

Rating :3.07 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4