పర్యావరణం

సహజ రంగుల హోలి

రంగు రంగుల ప్రకృతి మానవుని ఆహ్లాదపరుస్తూనే ఉంది. అందమైన ఇంద్రధనస్సు, రంగులతో కనువిందు చేసే పుష్పాలు, మధురమైన ఫలాలు, పచ్చని పొలాలు, వెండి కొండలను తలపించే మంచుకొండలు, నీలాకాశం, అన్నీ కూడా మనిషిని ఉత్తేజపరిచేవే...! అందువలనే మానవుడు, గెలుపు సందర్భాలను రంగులతో సంబరాలు చేసుకొంటాడు.

   హోలీ, రంగుల పండుగగా అందరికీ తెలుసు. దీనిని మంచికి జయసంకేతంగా జరుపుతారు. వసంత కాలాన్ని రంగులు జల్లుకొని ఆహ్వానిస్తారు. గతంలో ఉత్తర భారత దేశపు పండుగగా ప్రసిద్ధికెక్కినా, క్రమంగా దక్షిణ భారత దేశానికి వ్యాపించి ఎంతో ఆదరణ పొందుతుంది.


    గతంలో ఈ పండుగకు ముందుగా రకరకాల పూలను మట్టి కుండలలో నానబెట్టి, ఆ రంగు నీటిని, పసుపు నీటిని ఉపయోగించి హోలీ ఆడేవారు. శ్రమపడకుండా తేలికగా దొరికే రసాయనిక రంగులు వాడకంలోకి వచ్చాక, ప్రకృతి సిద్ధ రంగులకు గిరాకీ తగ్గింది. రసాయనిక రంగులు కేవలం పెయింట్స్ లో వాడకానికి, బట్టలపై రంగులకు పనికి వస్తాయి. వీటిని శరీరంపై వాడటం వలన ఎన్నో దుష్పలితాలు కలుగుతాయి. ఈ రంగులు అత్యంత ప్రమాదకరమైన రసాయనిక పదార్థాలతో తయారై ఉంటాయి మరియు విషతుల్యమైనవి కాబట్టి చర్మానికి, కళ్ళకు ఎంతో హాని కలిగిస్తాయి. వీటి వాడకం వల్ల ఒక్కొక్కసారి గ్రుడ్డితనం కూడా సంభవిస్తుంది. శరీరం లోపలికి వెళ్తే కాలేయం దెబ్బతింటుంది. శ్వాస కోశ సంబంధిత వ్యాధులు ఎక్కువ సోకుతాయి. ఈ రసాయనాలు నీటిలో కలిసి భూమిలోకి ఇంకి, పర్యావరణాన్ని మరింత కాలుష్యం చేస్తాయి. ఈ ప్రమాదాన్ని నివారించడానికి ఒకేఒక్క పరిష్కారం ప్రకృతి సిద్ధ రంగుల్ని పునరుద్ధీకరించడమే. వీటినే సహజ సిద్ధ రంగులని, ఇకో - రంగులని పర్యావరణ రక్షిత రంగులని కూడా అంటారు. ఈ దిశగా శాస్త్రవేత్తలు, పర్యావరణ మార్గదర్శకులు కొంత మేరకు పురోగతిని సాధించారు.

సహజ సిద్ధ రంగులు ఇంత ప్రాముఖ్యతను పొందడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇవి శరీరానికి హాని చేయవు. పైగా ఎంతో మేలు చేస్తాయి. సూక్ష్మక్రిములు పెరగకుండా సహాయపడతాయి. వీటిలో ఎక్కువ భాగం ఆయుర్వేదమందులుగా వాడతారు. పైగా కొన్నింటికి జీర్ణ శక్తిని పెంచే గుణం ఉన్నది. శ్వాస కోశ సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ఈ రంగులు చర్మంపై ఉండి పోయినా ఎలర్జీ రాదు. వాతావరణ కాలుష్యం ఉండదు. ఈ రంగుల కలయిక ఆహ్లాదంగా ఉంటుంది కూడా!

     కొన్ని చెట్లనుండి లభించే రకరకాల పూలు, బెరళ్ళు, ఆకులు, వేర్లు, పండ్లు, తొక్కలు, గింజలు అన్నీ కూడా రంగు తీయడానికి ఉపయోగపడతాయి. పూలల్లో మోదుగ, బంతి, కుసుమ మొదలగునవి పసుపు పచ్చ రంగునిస్తాయి. గోరింటాకు, గుంటకలగరాకు, ఆకులు, ఆకుపచ్చ రంగునిస్తాయి. జాఫ్రా, ఎర్ర చందనపు పొడి, చావల్ కోడి మొదలగునవి కాషాయం రంగును, ఎరుపు రంగును ఇస్తాయి. చెట్ల బెరళ్ళు మంచి కాఫీ పొడి రంగును ఇస్తాయి. వాడబడిన టీ, కాఫీ పొడి, ఉల్లిపొట్టు వంటి వ్యర్థ పదార్థాలను కూడా రంగుల తయారీలో ఉపయోగించవచ్చు.

  ఈ రంగును తయారు చేయడం చాలా తేలికే! 50 గ్రాముల ముడి పదార్థాన్ని చిన్న ముక్కలుగా చేసి లీటరు నీటిలో వేసి గంట సేపు ఉడికిస్తే రంగు నీరు తయారవుతుంది. రంగులను పొడుల రూపంలో కూడా తయారుచేసుకోవచ్చు.

       పర్యావరణాన్ని కాపాడే ప్రకృతి సిద్ధ రంగుల్నే వాడదాం! ప్రజలందరినీ జాగ్రత్త పరుద్దాం!

                   సహజ రంగుల్నే వాడండి!     పర్యావరణాన్ని కాపాడండి!!

డాక్టర్ ఎ. శారదా దేవి, కంసోర్షియం ప్రిన్సిపాల్ ఇన్వెస్టిగేటర్, జాతీయ వ్యవసాయ నవకల్పన పధకము, గృహ విజ్ఞాన కళాశాల.

Download File

Rating :3.14 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4