పర్యావరణం

ఇంట్లో కూరగాయల పంట

           అనుదిన ఆహారంలో కూరగాయలు, ఆకుకూరల ప్రాముఖ్యత అందరికి తెలిసిన విషయమే. శరీరానికి రక్షణనిచ్చే విటమిన్లు, ఖనిజలవణాలు పుష్కలంగా లభించేది వీటిలోనే. కనుక ఇవి లేనిదే సమతులాహారం లేనట్లే.
            మరోవైపు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. పైగా కొన్న కూరగాయలు త్వరగా కుళ్ళిపోతున్నాయి. విష రసాయనాల అవశేషాలు ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటున్నాయని గగ్గోలు వినిపిస్తోంది. దీని వల్ల ఆరోగ్యం కూడా పాడవుతుంది. మనం పెట్టే కూరగాయల ఖర్చుకు తగిన ఫలితం కూడా దక్కడం లేదు. కాబట్టి ఇంట్లో కూరగాయల మొక్కలు పెంచడం తప్పనిసరి. ఇంటి పట్టున సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కాయగూరలు ఎవరి అవకాశాన్ని బట్టి వారు పెంచుకోవడం ప్రారంభిస్తే ఇంటిల్లిపాదీ సమతుల్యమైన ఆహారం తీసుకోవడం సులభ సాధ్యమవుతుంది. జనంతో కిటకిటలాడే నగరాలు, పట్టణాల్లోనే కాదు మేజర్ పంచాయితీల్లో సైతం అపార్ట్ మెంట్ల సంస్కృతి ప్రబలుతోంది. ఇల్లు, బహుళ అంతస్థుల గ్రూప్ హౌస్ లు లేదా అపార్ట్ మెంట్ల వద్ద ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటుంది. కాని కంటికి మట్టి కనబడకుండా అంతా గచ్చుమయం. ఇటువంటి చోట్ల ఆకుకూరలు, కూరగాయలు పెంచుకోవడం అసాధ్యం అనిపించడం సహజమే! ఆరోగ్యం అనే అవసరం కోసం ఎందరో చేసిన అన్వేషణ, కొందరి సృజనాత్మకత, ఇంటి యజమానులే కాదు, అద్దె ఇంట్లో ఉండే వారు సైతం మొక్కలు పెంచుకోవడానికి కొన్ని మార్గాలను చూపింది.
          ఇంట్లో కూరగాయలను పండించడానికి ముఖ్యంగా కావలసినది మానసిక సంసిద్ధత, ఆ తర్వాత ఆసక్తి. సమయం, శ్రమ, సృజనాత్మకత అనేవి ప్రధాన పెట్టుబడులు. ఇవన్నీ ఉన్నట్లయితే మొక్కలను ఎక్కడెక్కడ పెంచాలో చక్కటి ఆలోచనలు వస్తాయి. ప్లాస్టిక్ ట్రేలు, సిమెంట్ కుండీలు, మట్టి కుండీలు, అడుగు చిల్లు పడిన లేదా పగిలిన బక్కెట్, క్యాన్, ప్లాస్టిక్ జార్లు, కట్ చేసిన కోక్ టిన్లు, డ్రమ్ములు... వేటినైనా కుండీలుగా మార్చి విత్తనాలు వేయొచ్చు.
అపార్టుమెంటులో, అద్దె ఇళ్ళల్లో పెంచడం


          ప్లాస్టిక్ బకెట్టులో                 చెక్కల నడుమ                  ప్లాస్టిక్ డబ్బాలలో


      ప్లాస్టిక్ ట్రేలలో                    టిన్నులలో                          అట్టపెట్టెలో


     చెక్కపెట్టెలో                            గ్రుడ్ల ట్రేలలో                  ఫాయిల్ కంటేనర్లలో


    నీళ్ళ సీసాలలో                  నూనె సీసాలలో                   తట్టలో

స్వంత ఇంటిలో టెర్రస్ మీద

బాల్కనీలలో

ఇంట్లో కూరగాయలు పండించుకోవడానికి కొన్ని చిట్కాలు

 • ప్లాస్టిక్ ట్రేలలో మొదట పాలిథిన్ పేపర్ పరచాలి. అడుగున చిన్న రంధ్రం చేయాలి. నీరు ఎక్కువైతే కిందకు జారిపోయేందుకు ఈ ఏర్పాటు. అడుగున ఒక అంగుళం ఎత్తు మట్టిని ఆపైన రెండంగుళాల మేర వర్మీ కంపోస్టు వేయాలి. తోటకూర, గోంగూర, బచ్చలి కూర, చుక్క కూర, పాలకూర, మెంతికూర ఇలా ఒక్కో రకాన్ని ఒక్కో ట్రేలో ప్రయోగాత్మకంగా వేయాలి. కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు, తోటకూర మొలకలు రెండు మూడు రోజులకే చనిపోతాయి. ఇతర ఆకుకూరలు మాత్రం ఏపుగా పెరుగుతాయి. ఆకుకూరల విత్తనాలు మూడు రోజులకే మొలకలు వస్తాయి. ఈ ట్రేలలో గోధుమ గడ్డిని కూడా పెంచవచ్చు.

 • కట్ చేసిన కోక్ టిన్ లలో కంపోస్టు నింపి మెంతికూర గింజలు వేస్తే పది రోజుల్లో మొలకలు వస్తాయి. నాలుగు టిన్ లలో నాలుగు రోజుల వ్యవధిలో మెంతికూర వేస్తే, వారానికి నాలుగు సార్లు వేర్వేరు కూరల్లో మెంతికూర వాడుకోవచ్చు. కొన్న మెంతికూర కన్నా ఇంటిలో పెరిగే మెంతికూర రుచి, వాసన తేడా ఉంటుంది. స్కూల్ బ్యాగులకు సైతం రెండు రంధ్రాలు చేసి వర్మీ కంపోస్టు వేసి మొక్కలను పెంచవచ్చు. ఐస్ క్రీం డబ్బాలలో కూడా మొక్కలను పెంచవచ్చు.

 • బకెట్లు, డబ్బాలలో మట్టి, కంపోస్టు మిశ్రమం పోసి మొక్కలు పెంచొచ్చు. ఎక్కువైన నీరు బయటకు పోయేలా వీటికి అడుగున రంధ్రం ఉండాలి. ఆ రంధ్రం పూడిపోకుండా కొన్ని పెంకు ముక్కలో, పల్చని రాళ్ల ముక్కలో వేసి, ఆపైన కొన్ని ఎండు ఆకులు వేసి, మట్టి, కంపోస్టు మిశ్రమాన్ని కుండీలో పోయాలి. కుండీలో మట్టి మిశ్రమం నింపిన తర్వాత అది పూర్తిగా కింది వరకూ తడిసేలా నీరు పోయాలి లేదా దానికన్నా పెద్ద బక్కెట్ నీటిలో పెట్టి గాలి అంతాపోయి కుండీలో మట్టి అంతా తడిసే వరకూ కొద్ది నిముషాలు ఉంచి, కుండీని బయటకు తీయాలి. అదనంగా కుండీలో ఉన్న నీరు కుండీ కింది రంధ్రం నుంచి బయటకు వెళ్లిపోతాయి. అలా వెళ్లకపోతే ఆ కుండీ సరిగా లేనట్టే. తగుమాత్రంగా తడిలో మాత్రమే మొక్క ఏపుగా పెరుగుతుంది. ఎక్కువ ఉన్న నీరు బయటకు పోని కుండీలో మొక్కలు ఎన్నాళ్లో బతకవు. కుండీలో మట్టి బాగా తడిగా ఉంటే ఆ రోజుకు నీరు పోయకుండా ఉంటేనే మంచిది. అతి తేమ మొక్కకు హానికరం కూడా.

 • నలుచదరంగా ఇటుకలు పేర్చిన మడుల్లో కూరగాయలు, ఆకుకూరలు పెంచవచ్చు. సాధారణంగా నేలలో పెంచడం కన్నా ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఎర్ర మట్టి, కంపోస్టు మిశ్రమంలో కూరగాయల మొక్కలు చక్కగా పెరుగుతాయి. ఎర్రమట్టి, కంపోస్టు మిశ్రమంలో పెంచుతున్నందున మామూలు కన్నా కనీసం 3 రెట్లు దిగుబడి వస్తుంది. నీటి అవసరం తక్కువ, కలుపు రాదు, శ్రమ తక్కువ. నీరు పరిమితంగా చల్లుతాం కాబట్టి సిమెంటుతోనో, మట్టితోనో మడి చుట్టూ ఇటుకల గోడ కట్టనక్కర్లేదు.

 • మేడపై ఏర్పాటు చేసే మడి కింద (ఎంత స్థలంలో మడిని ఏర్పాటు చేయాలనుకుంటే అంతమేరకు) ప్లాస్టిక్ షీట్ ను మేడపైన పరవాలి. స్లాబ్ నుంచి కిందికి నీటి ఊట ఇంట్లోకి దిగకుండా ఇది అడ్డుకుంటుంది. మడిలో చల్లిన నీటిలో ఎక్కువైన నీరు ఇటుకల కింది నుంచి బయటకు పోతుంది. మేడపై ఏర్పాటు చేసే మడి కిందే కాదు, నేలపై ఏర్పాటు చేసే మడి కింద కుడా ప్లాస్టిక్ షీట్ వేసుకోవాలి. మడి వెడల్పు 4 అడుగులు ఉంటే బాగుంటుంది. పొడవు ఎంత స్థలం ఉంటే అంత పెట్టుకోవచ్చు. మట్టి, కంపోస్టు మిశ్రమాన్ని పోసి విత్తనాలు చల్లాలి. విత్తనాలపై అంగుళం మందాన కంపోస్టు లేదా మట్టి, కంపోస్టు మిశ్రమం చల్లాలి. మొక్కలకు కనీసం 5,6 గంటల పాటు ఎండ తగలడం అవసరం. పురుగులు, చీడపీడలను నివారించడానికి 15 రోజులకొకసారి పంచగవ్య వంటి మిశ్రమాలను చల్లుకోవచ్చు. 5 లీటర్ల నీటిలో అర లీటరు పంచగవ్య మిశ్రమం కలిపి తగుమాత్రంగా పిచికారి చేయాలి. ఏ రెమ్మ మీద పురుగు, తెగులు కనిపించినా దాన్ని తుంచి పారేయడం ఉత్తమం.

 • అన్ని కూరగాయలు, ఆకుకూరలు ఒకే రోజు విత్తుకోకూడదు. ఇప్పుడు గుప్పెడు గింజలు, వారం పది రోజులు గడిచాక మరికొన్ని గింజలు..., అలా విడతల వారీగా చల్లుకోవాలి. ప్రతివారం ఆకుకూరలు, కూరగాయలు అందుబాటులో ఉంచుకోవాలంటే ఇలాంటి ఉపాయం అవసరమే. ఈ విధంగా ఏడాది పొడవునా పుష్కలంగా ఆకుకూరలతో పాటు కూరగాయలు కూడా ప్రణాళిక ప్రకారం పెంచుకోవచ్చు.

 • ఆకుకూరలకు ప్రత్యేక సీజన్ అంటూ ఏమీ లేదు. ఎప్పుడైనా పెరుగుతాయి. పాలకూర, చుక్కకూర, తదితర ఆకుకూరలు మూడు, నాలుగు వారాల్లో కోతకు వస్తాయి. మొక్కలను కత్తిరిస్తే మళ్లీ పిలకలు వస్తాయి. కత్తిరించిన తర్వాత మట్టిని గుల్ల చేసి చారెడు కంపోస్టు చల్లి నీరు పోస్తే చాలు. పిలకలు పెరిగాక కోసుకొని మళ్లీ విత్తనాలు చల్లుకోవాలి. మెంతి మొక్కల్ని మూడు సార్లు వరకూ కత్తిరించుకోవచ్చు. గోంగూర మొక్క నుంచి ఆకుల్ని కోసుకోవాలి. పూత, పిందె వచ్చేంత వరకు కోసుకుంటూ ఉండొచ్చు. బచ్చలి మొక్క మాత్రం 45 రోజులకు కోతకు వస్తుంది.

 • విత్తనాలు నాణ్యమైనవైతే దిగుబడి బాగుంటుంది. టమోటా, వంగ, మిరప, బెంగళూరు మిరప, బెండ, చిక్కుడు, బీర, దోస, ఆనపకాయ తదితరాలను మడుల్లో, కుండీల్లో పండించుకోవచ్చు. ఇప్పటికే మొక్కలు పెంచుతున్న వారి వద్ద నుంచి విత్తనాలు సేకరించవచ్చు లేదా 10 గ్రాముల విత్తన ప్యాకెట్లు కొని చల్లుకోవచ్చు.

 • ధనియాలు బాగా నలిచి బద్ధలుగా పగిలిన తర్వాత రోజంతా నానబెట్టి చల్లితే త్వరగా మొలుస్తాయి. దీంట్లో లోపల చిన్న సైజులో విత్తనం ఉండడమే ఇందుకు కారణం. తోటకూర వంటి విత్తనాలు గసగసాల మాదిరిగా చాలా చిన్నగా ఉంటాయి. ఇసుకలో కలిపి చల్లితే మరీ వత్తుగా పడకుండా ఉంటాయి. ఆకుకూరలు వారం తేడాలో కొంచెం కొంచెం విస్తీర్ణంలో విత్తనాలు చల్లుకుంటే నాలుగు రోజులకొకసారి కూరకు అందివస్తాయి.

 • నాణ్యమైన మట్టి, సేంద్రీయ ఎరువుల మిశ్రమాన్ని వినియోగిస్తే కూరగాయ మొక్కలు పోషకలోపం లేకుండా చక్కగా పెరిగి మంచి దిగుబడినిస్తాయి. కుండీలో మట్టి పిడచగట్టుకు పోకుండా ఉంటే మొక్క చక్కగా పెరుగుతుంది. నల్ల మట్టి గట్టిపడే స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి ఎర్రమట్టిని వినియోగించడం మంచిది. ఎర్రమట్టి బొత్తిగా దొరకనపుడు నల్ల మట్టిని తక్కువ పాళ్ళల్లో వాడుకోవచ్చు. కూరగాయలు, ఆకుకూరల పెంపకానికి సేంద్రీయ ఎరువులు, పురుగు మందుల వాడకం ఉత్తమం. ఎర్రమట్టికి పశువుల ఎరువు, వర్మి కంపోస్టు సమపాళ్ళల్లో కలిపి మొక్కలు పెంచవచ్చు. వేపగింజల పిండి, కానుగ పిండి, సీతాఫల గింజల పిండి కూడా కలిపితే చీడ పీడలను నివారించుకోవచ్చు.

 • రసాయనాలు వాడకుండా పెంచుకున్న కూరగాయలు, ఆకుకూరలే ఆరోగ్యం, కమ్మటి రుచి కూడా. ఖాళీ ఉంది కదా అని గొయ్యి తీసి ఆ మట్టి ఎలా ఉన్నా విత్తనం వేస్తే సరిగ్గా పెరగకపోవచ్చు. అందుకే మట్టి, పశువుల ఎరువు, వర్మి కంపోస్టు లేదా ఇంటి వద్ద తయారు చేసుకున్న ఎరువు (లీఫీ మౌల్డ్ అనగా ఆకు ఎరువు లేదా వర్మి కంపోస్టు) కలిపి ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న మిశ్రమం వాడితే ఫలితం బాగుంటుంది. ఈ మట్టి మిశ్రమంతో కూరగాయలు, ఆకుకూరలు పెంచుకుంటే మాములు కంటే 3-5 రెట్లు అధిక దిగుబడి వస్తుంది.

 • కూరగాయ మొక్కలు, ఆకుకూరలకు చీడ పీడలు రాకుండా ఏదైనా పురుగు సోకినా ఆకుల రసాలనో, కషాయాలనో వాడొచ్చు. వేప నూనెను సైతం వాడొచ్చు. పుల్లమజ్జిగలో దంపుడు పసుపు కలిపి మొక్కలపై చల్లాలి. సాధారణంగా 3G అనే విధానం వాడుకలో ఉంది. 3G అనగా అల్లం(Ginger), వెల్లుల్లి(Garlic), పచ్చి మిర్చి(Green chilli)లను సమపాళ్ళలో తీసుకొని మెత్తగా నూరి నీటితో కలిపి మొక్కలపై చల్లితే చీడపీడల బాధను నివారించవచ్చు. ఈ కషాయాలను ఎవరికి వారు ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు. వేప ఆకులు, సీతాఫల ఆకులు, వావిలి ఆకులను మెత్తగా నూరి, రసం తీసి, వడపోసిన తర్వాత అంతకు 20 రెట్లు నీటిలో కలిపి పెరటి మొక్కలపై చల్లుకోవచ్చు. ఈ ఆకులను ఉడకబెట్టి కషాయాన్నయినా చల్లవచ్చు. ఈ ఆకుల వాసన ఘాటుగా ఉంటుంది. రసం తీసేటపుడు కొంచెం జాగ్రత్త పడితే చాలు. వేపకాయల రసం కూడా వాడచ్చు. పచ్చి మిరపకాయలను గాని లేదా వెల్లుల్లిని గాని దంచి కిరోసిన్ లో ఒక రాత్రి నానబెట్టి తర్వాత నీటిలో కలిపి మొక్కలపై చల్లవచ్చు. చీడ పీడలు ఆశించక ముందే 15 రోజులకొకసారి వీటిని చల్లవచ్చు, పురుగుల గుడ్లు ఉన్నా నశిస్తాయి.

 • ఈ రసాల వాసనకు చీడపీడలు పెరటి తోటల దరిదాపులకు కూడా రావు.

 • కంపోస్ట్ వాడుతున్నందున మొక్కలు వేగంగా పెరుగుతాయి. అపార్ట్ మెంట్లలో ఒక్క పూట ఎండ మాత్రమే మొక్కలకు తగులుతుంది. అయినా అవి బాగానే నిలదొక్కుకుంటాయి. ట్రేలలోనూ, కుండీలలోనూ కంపోస్టు వాడుతున్నందున నీరు రోజూ పోయనవసరం లేదు. కుండీల్లో తడి చూసుకుంటూ రోజు విడిచి రోజు నీరు పోసినా సరిపోతుంది. అందువల్ల నీటి బెంగ అవసరం లేదు.

   ఇంటి దగ్గరే కూరగాయలు పండించుకునే వారు పర్యావరణ పరిరక్షకులు కూడా. సరసమైన ధరకే తాజా కూరగాయలు పొందుతుండడంతో పాటు వాయుకాలుష్యం తగ్గిస్తూ వారు ప్రపంచానికి ఎంతో మేలు చేస్తున్నారు. ఎక్కడో దూరాన ఉన్న పొలాల వద్ద నుంచి మార్కెట్లకు కూరగాయలను రవాణా చేయడానికి చాలా ఇంధనం ఖర్చవుతోంది. మార్కెట్లో కూరగాయలు కొనడం తగ్గించి ఇంటి పట్టునే పంటలు పండించుకుంటున్న వారు ఆ మేరకు ఇంధనాన్ని పొదుపు చేస్తున్నట్టే.

కుమారి పి. రమ్య శ్రీ, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2012/106.
సమీక్ష: డాక్టర్ ఎ. మేరి స్వర్ణలత, ప్రొఫెసర్ & హెడ్, విస్తరణ మరియు ప్రసార నిర్వహణ విభాగము.

Download File

Rating :3.21 1   1   1   1  
M.Nandakumar    2018-08-05 13:55:42
Very good information
...............................................
Anil kona    2018-11-25 13:32:32
It is a nice article and very useful.
...............................................
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4