పర్యావరణం

సూక్ష్మక్రిమి రహిత దుస్తులు

           సూక్ష్మంగా మన కంటికి కనపడకుండా ఉండే జీవుల్ని సూక్ష్మక్రిములు అంటారు. మన చుట్టూ అనేకం ఉంటాయి. వీటిని  మైక్రోస్కొప్ ద్వారానే చూడగలుగుతాం. భూమి మీద ఉన్న జీవులలో ఎక్కువ శాతం సూక్ష్మక్రిములే. ఈ సూక్ష్మక్రిములు ఆహారం, గాలి, నీరు, బట్టలు మొదలైన వాటి ద్వారా, మనిషిని చేరి, శరీరానికి  హాని కలిగిస్తాయి. సూక్ష్మక్రిముల వలన దుర్వాసన అనే చిన్న సమస్య నుండి దురద, ఎలర్జీ, జబ్బులు అనే పెద్ద పెద్ద సమస్యల వరకు మనుషులు ఎదుర్కొంటున్నారు.  జనాభా పెరుగుదల వల్ల ఎక్కువ వ్యాధులు సంక్రమిస్తున్నాయి. యాంటి బయోటిక్ కి కూడా లొంగనంతగ సూక్ష్మజీవులు బలోపేతం అవుతున్నాయి. అందువల్ల ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి.
           బట్టలు, దుస్తుల విషయానికి వస్తే, చెమట, మల మూత్రాలు, తదితర విసర్జితాల ద్వారా కూడా  సూక్ష్మక్రిములు తిరిగి శరీరాన్ని చేరుతాయి. చెమట, జిడ్డు శరీరం  నుండి విడుదల అయినప్పుడు మామూలుగా వాటికి వాసన ఉండదు. కాని వేసుకున్న దుస్తులు వాటిని పీల్చుకున్నపుడు, శరీరంపై సహజంగా ఉండే గ్రాం పాజిటివ్ స్టెఫిలోకోకస్ ఎపిదెర్మిస్ (Gram positive Staphlococcus.epidermidis),  గ్రాం నెగెటివ్ ఎష్క్రీషియా కోలి (Gramnegative Escherichia coli) తో కలసి కుళ్ళడం వలన దుర్వాసనను వెలువరిస్తాయి.  ఆంతే కాదు దుస్తులు, బట్టలు రంగులు కూడా మారిపోతాయి. మన శరీర ఉష్ణోగ్రత కూడా  సూక్ష్మక్రిముల పెరుగుదలకు దోహదపడుతుంది. దుర్వాసన, మరకలు ఏదో మామూలు అనుకొంటే అది పొరపాటే.  సూక్ష్మక్రిములు,  బట్టపైనున్న నూలు పోగుల మధ్య ఒక రసాయనిక బంధం ఏర్పడిన ఫలితమే దుర్వాసన, మరక. దీనిని వదిలేస్తే రసాయనిక బంధం శాశ్వతంగా ఉండి శరీరంపై  దుష్ప్రభావం చూపుతాయి.   

 • ఈ సూక్ష్మ క్రిముల వల్ల దుర్వాసన రావడం, చెమట ఎక్కువ అవడం వంటివి జరిగి బట్టలు త్వరగా పాడవుతుంటాయి. అంతే కాకుండా బట్టల నాణ్యత తగ్గి, బట్టల రంగు వెలుస్తుంది, త్వరగ చిరిగిపోవడం కూడా జరుగుతుంది.

 • అన్నిటికంటే ముఖ్యంగా శరీరం మీద దురద, ఎలర్జీ, దద్దుర్లు నుంచి ఆస్తమా, వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

 • శరీరం నుండి వెలువడే చెమట, ఇతర శరీర విసర్జితాలు,  ఆహారం, మట్టి వంటి పలు పదార్థాలతో కలసి వెగటు వాసన కల ఆమ్లాలు, అమ్మోనియ ఏర్పడతాయి.

 • పిల్లల దుస్తులలో ఈ సూక్ష్మక్రిముల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

           కనుక సూక్ష్మక్రిములను నివారించే వస్త్రాల అవసరం ఎంతగానో ఉంది. ప్రస్తుతం మార్కెట్లలో లభిస్తున్న సూక్ష్మక్రిమి రహిత వస్త్రాలు అప్పటికప్పుడు వాడుకొని పారవేసే విధంగా, వాసనను నివారించే విధంగా ఉన్నాయి. అలాకాకుండా రోజూ వేసుకొనే దుస్తులు, ముఖ్యంగా లో దుస్తులను సూక్ష్మరహితం చేయడం ఎంతో అవసరం. ప్రకృతిలో, మన పరిసరాలలో లభించే మొక్కల ఆకులు, పువ్వుల రసాలతో దుస్తులను సూక్ష్మ క్రిమిరహితం చేయడం పై చేసిన అధ్యయనం  సత్ఫలితాలను ఇచ్చింది. ఆ వివరాలు ఇక్కడ పొందుపరచబడ్డాయి.  
పరిశోధనకు వాడిన సూక్ష్మక్రిమి వినాశక మొక్కలు

సూక్ష్మక్రిమి వినాశక మొక్కల ఆకుల, పువ్వుల ఔషద గుణాలు

జామ ఆకు:  శాస్త్రీయ నామం- సిడియం


ఔషధ గుణాలు:  జామ ఆకులకు యాంటి మైక్రోబియల్ లక్షణాన్ని కలిగి ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమయ్యే "కొల్లాజిన్" ని ఉత్పత్తి చేస్తుంది.

సీతాఫలం ఆకు: శాస్త్రీయ నామం- అనోనా రెటిక్యులేటా


ఔషద గుణాలు:   ఆకుల్లో హైడ్రోసైనిక్ ఆమ్లం   చర్మ సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది.

తమల పాకు: శాస్త్రీయ నామం -  పైపర్ బిటల్ 


ఔషద గుణాలు: తమలపాకు బ్యాక్టీరియా పెరుగుదలను తగ్గిస్తుంది. దీనిలో ఉండే ఆవశ్యక ఆయిల్ ఫంగస్ మీద వ్యతిరేకంగా పని చేసి, అదుపులో పెడుతుంది.

ఆశోక ఆకు: శాస్త్రీయ నామం -పోలియాల్తిమా లాంగిఫోలి


ఔషద గుణాలు: ఆకుల్లో ఉండే ఎథినాల్ యాంటి బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఈ ఆకులు చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతాయి.

మునగ ఆకు: శాస్త్రీయ నామం - మొరింగా ఓలిఫెరా


ఔషద గుణాలు:  బాక్టీరియా, శిలీంధ్ర, కీటక సంహారిగా దీనిని ఉపయోగిస్తారు.

తంగేడు ఆకు: శాస్త్రీయ నామం- కేషియా ఆరిక్యులేటా 


ఔషద గుణాలు: తంగేడులో చర్మ, క్రిమి, నేత్ర జబ్బులను తగ్గించే ఔషద గుణాలున్నాయి. బ్యాక్టీరియాని నశింపజేసే గుణం ఉంది.

దానిమ్మ పువ్వు: శాస్త్రీయనామం : పునిక గ్రనేటం


ఔషద గుణాలు: దానిమ్మలో ఉండే " ఇల్లాజిక్ యాసిడ్ " కు చర్మంపై ఉన్న సూక్ష్మజీవులను నశింపజేసే గుణం ఉంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలున్నాయి.

బిళ్ళగన్నేరు పువ్వు: శాస్త్రీయనామం- క్వాతరాంతస్ రోసియా


ఔషద గుణాలు: మధుమేహం, క్యాన్సర్ వ్యాధుల ఔషధాలలో ప్రముఖం వాడే  బిళ్ళగన్నేరు పువ్వు ఆకులలో సూక్ష్మక్రిమి రహితం చేయడానికి అవసరమైన ఫినాలిక్ కాంపౌండ్లు అధికంగా ఉంటాయి.
బట్టలకు వాడే విధానం

 • రెండు గుప్పిళ్ళు ఆకులను, పువ్వులను చెట్టు నుండి కోసి నీటిలో శుభ్రంగా కడగాలి. 

 • కడిగిన ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చేతితో తుంచి మిక్సిలో లేదా రోలులో వేసి మెత్తగా రుబ్బాలి. అవసరమైతే మధ్యలో కొన్ని నీళ్ళు పోసి రుబ్బాలి.

 • రుబ్బి పెట్టుకున్న ఆకు ముద్దను బట్టలో వేసి రసాన్ని ఒక గిన్నెలోకి వడకట్టాలి.  ఒక బకెట్టులో లీటరు నీళ్ళు వేసి 100 గ్రా. లేదా 200 గ్రా. రసాన్ని బకెట్టులోని నీటిలో కలపాలి.

 • ఉతికి, జాడించిన బట్టలను చివరగా పైన కలిపిన నీటిలో 15 నిమిషాల పాటు నానబెట్టలి. తర్వాత బట్టను పిండి నీడలో ఆరవేయాలి.

ఉపయోగాలు

 • చెమట మరియు దుర్వాసన నుంచి ఉపశమనం పొందవచ్చు.

 • ఎలర్జీ, దురద, దద్దుర్లు వంటివి రావు.

 • అమ్మవారు, తట్టు, పొంగు వంటివి త్వరగా నయం అవటానికి దోహదపడుతాయి. 

 • తక్కువ శ్రమతో, పరిసర ప్రాంతాలలో లభ్యమయ్యే మొక్కలతో వీటిని తయారుచేసుకోవచ్చు.

 • 2-3 రోజుల పాటు ఆకు నుండి పిండిన రసాన్ని నిల్వ చేసుకునే అవకాశం ఉంది.

డాక్టర్ డి. అనిత, ప్రొఫెసర్ & హెడ్, వస్త్రాలు మరియు దుస్తులు విభాగము.

Download File

Rating :3.35 1   1   1   1  
Dhanalakshmi    2017-12-23 00:32:59
Vayasu OKa 40 years naku skin allergi undhi fish thintu untey next day ollu antha dhaddurulu dhurdha vasthunayi mandhulu Vadina thaggatam ledu .home remidys cheppandi
...............................................
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4