పర్యావరణం

పెరటి ఔషధ మొక్కలు

‘’ఆరోగ్యమే మహాభాగ్యం’’ అన్నది నానుడి. అందువల్ల మానవునికి అన్నటికంటే తానూ ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. పూర్వం వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేవి కావు . అంతే కాక ఆది నుండి గ్రామీణ ప్రధాన దేశం కనుక ప్రజలు ఎక్కువగా తమ ఆరోగ్య రక్షణకై పరిసరాలలో ప్రకృతి సిద్దంగా లభించే మొక్కలపై ఆధారపడేవారు .

మన దేశంలో వేలల్లో ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళకు ఈ మొక్కల గురించిన పరిజ్ఞానము , వంటింటి చిట్కాలతో చేసే గృహ వైద్యము తెలిసి ఉండేది. నిత్య జీవితంలో సంభవించే ప్రాధమిక ఆరోగ్య సమస్యలను ఇంటి వద్దనే పరిష్కరించుకునేవారు . ప్రస్తుతం పల్లెలు , పట్టణాల్లోనే కాకుండా నగరాల్లోనూ ఆయుర్వేదం , సిద్ధ , యునానీ వైద్యులు 90 శాతం ఔషధ మొక్కలపైన ఆధార పడుతున్నారు . అల్లోపతి, హోమియో వైద్యంలోనూ ఎక్కువగా ఔషధ మొక్కలను వినియోగిస్తున్నారు. ఆధునిక ఔషధాలు, సౌందర్య సాధనాలు, ఆరోగ్య అనుబంధాలలో రసాయనాలు, సింథటిక్స్‌ను వినియోగిస్తుండడం వల్ల కలుగుతున్న దుష్ర్పభావాలను గ్రహించి పాశ్చాత్య దేశీయులు కూడా ఔషధ మొక్కల ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో అందుబాటులో ఉండే మొక్కలను, సముచిత రీతిలో వినియోగించుకుంటే సాధారణ ఆరోగ్య సమస్యల్లో 90 శాతం మేరకు రాకుండా చూసుకోవచ్చు. మొక్కల వివిధ భాగాలను అంటే వేరు ,బెరడు ఆకు, పువ్వు, గింజలను కషాయం, రసం, చూర్ణం, తైలం మొదలైన రూపాలలో తయారు చేసి ఔషధంగా తీసుకుంటారు . ఈ విధంగా తయారు చేసేప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి.

 • ఔషధానికి ఉపయోగించే భాగాన్ని మంచి నీటితో శుభ్రంగా కడగాలి
 • కషాయం చేసేప్పుడు 60 గ్రా ఔషధ భాగానికి రెండు గ్లాసుల నీరు కలిపి, అది పావు భాగం వచ్చేంత వరకు మరిగించాలి . కషాయాన్ని నిల్వ చేయకుండా ఎప్పటికప్పుడు తాజాగా వాడాలి.
 • ఆకులు, బెరడుతో రసం తీసేప్పుడు వాటిని శుభ్రంగా దంచి నీళ్ళలో కలిపి, పిండి వడ కట్టాలి .
 • చూర్ణంగా వాడేప్పుడు మెత్తగా దంచి జల్లెడ లేదా పలుచని బట్టలో వేసి జల్లించి , గాలి చొరబడని సీసాలో పోసి మూత పెట్టాలి . చూర్ణాన్ని తేనే/ నెయ్యి/పాలతో తీసుకోవాలి .
 • తైలాన్ని తయారు చేసేప్పుడు ఆయా రసాలను సమ పాళ్ళలో తైలాలతో, కలిపి నీరు ఇంకేంత వరకు మరగబెట్టాలి .

ఔషధ మొక్కలు పెరటి మొక్కలు గా పెంచడంవల్ల వాతావరణ కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు. పెరట్లో పెంచగలిగే ఔషధ మొక్కలను, వాటి ప్రత్యేకతలను తెలుసుకుందాం .

తులసి

 • తులసి కుండీలలోనైన సులువుగా పెంచగలిగే మొక్క . సర్వ రోగ నివారిణి అని పేరుంది.తులసి ఆకులు సువాసన కలిగి రుచికి చేదుగా, వగరుగా ఉంటాయి. కానీ ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి .
 • 6 లేదా 7 తులసి ఆకులను అల్లం ముక్కతో కలిపి ముద్దగా నూరాలి. ఆ ముద్ద నుండి రసం వడగట్టి అర స్పూన్ తేనెతో కలిపి రోజులో రెండు సార్లు 3- 4 చుక్కలుగా తీసుకోవాలి. గొంతు గరగరను తగ్గించి మృదువుగా చేస్తుంది, కఫాన్ని వదిలేస్తుంది .
 • జలుబు, దగ్గు ఉన్నప్పుడు రెండు చెంచాల తులసి రసాన్ని తీసుకుని తగినంతగా తేనె చేర్చి 2,3 సార్లు తాగితే తగ్గుతుంది.

 • తులసి ఆకులను పరగడపున కొన్నిరోజుల పాటు 2 - 3 ఆకులను నమిలినట్లైతే ముక్కు దిబ్బడ వంటి శ్వాస లోపాలు సవరించబడతాయి, గుండెకు బలాన్నిస్తుంది, వ్యాధి నిరోధక శక్తి కలుగుతుంది.

 • సుగంధభరితమైన తులసి ఆకు చుట్టూ ఉన్న గాలిని శుద్ధిపరుస్తుంది, క్రిమికీటకాలను, రోగాణువులను అరికడుతుంది.
 • ఇంటిచుట్టూ తులసి మొక్కలు ఉంటే దోమల బాధ ఉండదు.

   

కలబంద(అలో వెర )


కలబంద ఎన్నో ఔషధ గుణాలు కలిగిన గుబురుగా పెరిగే మొక్క .కుండీల్లోను, నేలపైన పెంచుకోవచ్చు . కలబంధ ఆకులలో 94 శాతం నీరు ఉంటుంది, గుజ్జులో సుమారు 20 రకాల ఆమోనీ ఆసిడ్లు, కార్భోహైడ్రేడ్లు మరియు ఇతర రసాయ బార్భలోయిన్‌ అనే గ్లూకో సైడులు ఉంటాయి. పెక్కు ఉపయోగాలు ఉండటం వలన ఎక్కువ విస్తీర్ణంలో వాణిజ్య పంటగా కూడా వేస్తున్నారు.

 • కలబంద ఆకులను మెత్తగా నూరి రసం తీసి దానిని పుండ్లు ,కురుపులపై లేపనంగా వాడచ్చు.

 • కలబంద అంతగా ముదరని ఆకులను తీసి వాటిని చీల్చి గుజ్జు లాంటి పదార్థానికి చిటికెడు ఉప్పు , పసుపు కలిపి 15 రోజుల పాటు ఒక్కసారి చొప్పున తీసుకుంటే
 • జీర్ణ కోశంలోని సూక్ష్మ క్రిములను చంపేస్తుంది
 • జీర్ణ శక్తిని పెంపొందిస్తుంది
 • క్లోమ గ్రంధిని శుద్ధి చేస్తుంది
 • కాలేయ విధులను సక్రమం చేస్తుంది
 • రక్తాన్ని శుద్ధి చేస్తుంది
 • వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది
 • నేత్ర రోగాలలో, కాలిన గాయాలు దీర్ఘకాలిక పుండ్ల నివారణకు, ప్లీహము, కాలేయం మూత్ర కోశ సంబంధ వ్యాధులలోనూ, గర్భాశయ రుతు సంబంధ చికిత్సలకు ఉపయోగపడుతుంది.
 • ఆకులనుండి తీసిన 'ఆలోయిన్‌'ను ఎండబెడితే ముసాంబ్రం అనే నల్లని పదార్థం తయారవుతుంది. ఇది నొప్పులను, వాపులను తగ్గిస్తుంది.


 

పుదీనా

పుదీనా కుండిలలోను, నేల పైన అల్లుకొని పెరుగుతుంది.

 • 10-15 ఆకులను ఒక గ్లాసు నీటిలో ఉడికికించి, వడగట్టి, చల్లార్చి, దానికి చిటికెడు ఉప్పు ,మిరియాల పొడి కలిపి రోజు ఒకసారి తీసుకోవాలి . కడుపు ఉబ్బరం, నొప్పి, వాంతులు తగ్గుతాయి. కాలేయం, క్లోమ గ్రంధులను శుద్ధి చేస్తుంది.
 • పుదీనా రసాన్ని దగ్గు, తుమ్ము, ఆయాసం కలవారికి వాడితే ఉపశమనం కలుగుతుంది.
 • నోటి దుర్వాసన గలవారు పుదీనా రసాన్ని నీటిలో కలిపి పుక్కిలించడం ద్వారా క్రిములను దూరంగా ఉంచి దుర్వాసనను పోగొట్టవచ్చు.
 • పుదీనా రసం పరకడుపున తీసుకోవడం ద్వారా కడుపులో బద్దె పురుగులు, ఏలికపాము వంటివి మలము ద్వారా బయట పడిపోతాయి.
 • ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే మజ్జిగలో పుదీనా ఆకులను కలిపి తాగాలి.
 • పుదీన ఆకులను బాగా నలిపి, ఆ ఆకుల వాసనను గట్టిగా పీలుస్తూ ఉంటే తలనొప్పి తల తిరుగుడు ఇబ్బందులు తగ్గిపోతాయి.
 • శ్వాసక్రియ ఇబ్బందులకు పుదీన విడుదల చేసే ఘాటు వాసన పని చేస్తుంది. ఆస్త్మా రోగులు క్రమం తప్పకుండా వాడితే ఇబ్బందిని తగ్గించి, ఉపశమనం కలిగిస్తుంది.
 • పుదీనా పసరును శరీరం మీద రాసుకుంటే చర్మం మెరుగ్గా కనిపిస్తుంది.
 • దంత సంరక్షణ గుణం పుదీనాలో వుంది. పుదీనాకున్న సూక్ష్మజీవ సంహార గుణం వల్ల దంతాలను ఆశించే బ్యాక్టీరియా నుండి రక్షణ కలుగుతుంది.

కర్పూరవల్లి

 • ఆకులను ముక్కు, గొంతు సమస్యలకు చికిత్సకు ఉపయోగిస్తారు .
 • చర్మ వ్యాధులు, ఆస్తమా వంటి సమస్యలకు మంచి ఔషధం.

మందార

మందార కుండిలలోను, నేల పైన పెరుగుతుంది. మందార పువ్వులు, ఆకులు వేర్ల లో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి

 • వీటి కాషాయం తాగితే ఋతు చక్రం, రక్త సరఫరా కూడా క్రమ పద్దతిలో జరుగుతుంది .
 • కాలేయ సమస్యల నుండి ఉపశమనం కొరకు రక్త పోటు తగ్గించడానికి ఉపయోగిస్తారు .
 • ఆకులు, పువ్వుల తో తలపై మర్దన చేసుకుంటే ఒత్తిడి వల్ల వచ్చే తల నొప్పి తగ్గుతుంది .
 • కీళ్ళ నొప్పులు, వాపులకు చికిత్స గ ఉపయోగించుకోవచ్చు .
 • మందార ఆకులతో తయారు చేసిన టీ లో విటమిన్ సి అధికంగా లబిస్తుంది .
 • మందార పువ్వులను నూనెలో మరిగించి, వడ గట్టి, ఆ నూనె జుట్టుకి రాయడం వలన జుట్టు నిగనిగలాడుతుంది.

కాకర

కాకర తీగను సులువుగా నేలపైన , కుండీలలోను పెంచవచ్చు. దీని అకులలోను, కాయలోను ఔషధ గుణాలు ఉంటాయి .రుచికి చేదుగా ఉన్నప్పటికీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.

 • ఆరు లేదా ఏడు కాకర ఆకులను ముద్దగా నూరి రసం తీయాలి .ఒక టీ స్పూన్ రసంలో మరో టీ స్పూన్ నీరు లేదా పాలు కలిపి వారం రోజులు పాటు తీసుకోవాలి . జీర్ణ శక్తిని పెంచుతుంది.
 • వాంతి కలిగించే లక్షణం కలిగి ఉండటం వల్ల వాంతి ద్వార తెమడను బయటకు పంపిస్తుంది . జ్వరాన్నితగ్గిస్తుంది.
 • కాకర రసం వేడిని జనింప చేసి శరీర ఉష్ణోగ్రతను పెంపొందిస్తుంది.
 • కాకరకాయను మెత్తగానూరి రసం తీసి అర గ్లాసు రసానికి ఒక చెంచా మిరియాల పొడి కలిపి రోజుకు 3 -4 సార్లు దంతాలపై మీద రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
 • అలాగే ఒక కప్పు కాకర రసానికి ఒక టీ స్పూన్ నిమ్మ రసం కలిపి 3 -4 రోజులు పరగడపున తాగితే జీర్ణకోశంలోని సూక్ష్మ క్రిముల వ్యాధుల అరికట్టబడుతాయి.
 • మధుమేహగలవారు ప్రతి రోజు కాకరరసం తాగడం వలన రక్తంలోని గ్లూకోజు శాతాన్ని అదుపులోఉంచుకోవచ్చు.

గోరింట

 

గోరింట గుబురుగా తక్కువ స్థలంలోనే సులువుగా పెరిగే మొక్క

 • గోరింటాకు లేపనం కీళ్ళ నొప్పులు , వాతాలను నివారిస్తుంది.
 • బెరడుతో కాచిన కషాయం రక్త విరోచనాలకు మంచి మందుగా పనిచేస్తుంది.
 • పువ్వులను నూరి వెనిగరుతో కలిపి తలకు పట్టిస్తే తల నొప్పి తగ్గుతుంది.
 • గాయాలు, పుండ్లు, గజ్జి, తామర మొదలైన చర్మ వ్యాధులకు గోరింటాకు ముద్ద లేపనంగా పని చేస్తుంది .
 • ఆవ నూనెలో గోరింటాకులు వేసి కాచి అది తలకు రాసుకుంటే వెంట్రుకలు మృదువుగా ఉంటాయి, పెరుగుతాయి .
 • గోరింటాకు ముద్దను వేలికి తొడిగితే గోరు చుట్టు బాధ నుండి ఉపశమనం కలుగుతుంది.
 • జుట్టుకి బలాన్ని అందించే పొషక పదార్దాలను ఇచ్చి ఎంతో అందంగా, మృదువుగా,మెరిసేలా చేస్తుంది, చుండ్రును నివారిస్తుంది.
 • అంతేకాకుండా తలలో నేచురల్ యాసిడ్ ఆల్కలైన్ ను సమతుల్యం చేస్తుంది తలనొప్పి మరియు నిద్రలేమిని నయం చేస్తుంది

బొప్పాయి

పెరట్లో సర్వసాధారణంగా పెరిగే పండ్ల మొక్క. కాయలను కూరకు కూడా వాడుకోవచ్చు

 • బొప్పాయిలో అధిక పీచు ఉండటం వలన కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది.
 • ఇందులో కొవ్వును దగ్ధము చేయగల ఎంజైములు ఉండటం వలన గుండె పోటు రాకుండా చేస్తుంది .
 • బొప్పాయిలోని ఆంటి యాసిడ్లు చిన్న వయస్సులో వృద్ధాప్య చిహ్నాలు రాకుండా కాపాడుతాయి .
 • బొప్పాయి విత్తనాలను తీసుకోవడం వలన జీర్ణ కోశం లోని పురుగులు నశిస్తాయి . మలబద్దకం తగ్గించి జీర్ణక్రియను సక్రమంగా చేస్తుంది . బొప్పాయి రసం పెద్ద పేగులోని, ముఖ్యంగా కోలన్ ద్వార ఏర్పడిన చీము, జిగరును తొలగించి శుద్ధి చేస్తుంది, కాలేయ వ్యాధులను అదుపులో ఉంచుతుంది.

 • బొప్పాయి లో తక్కువ శక్తి ,ఇతర విటమిన్లు అధికంగా ఉండటం వలన శరీర బరువును తగ్గిస్తుంది ‘ఎ’ , ‘సి’ విటమిన్లు అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది .
 • బొప్పాయి తో తయారు చేసిన షాంపూ జుట్టులోని చుండ్రును అదుపులో ఉంచుతుంది .

పొడపత్రి

పొడపత్రి తీగజాతికి చెందిన బహువార్షిక మొక్క. ఇది ప్రకృతి సిద్ధంగా మన రాష్ట్రంలోని అరణ్యాలలోను, పంట పొలాలలోను పెరిగి పొదలపైకి బాకి కనిపిస్తుంది. చిన్న పసుపుపచ్చని పుష్పాలు గుత్తులుగా పూస్తాయి. కాయలు 5 నుండి 7 సెం. మీ. పొడవు గల్గి ఒకే చోట రెండు జంటగా మేక కొమ్ముల మాదిరిగా అమరి వుంటాయి. మామూలుగా దీని ఆకులు చాలా చేదుగా వుంటాయి. నమిలిన 3-4 గంటల వరకు కూడా చేదు అలాగే వుంటుంది. అయితే మధుమేహం గల వారికి మాత్రమే చేదు రుచి తెలుస్తుంది. ఉన్నవారికి చప్పగా అనిపిస్తాయి ఉన్నతమైన ఔషధ గుణాలు కలిగిన పొడపత్రి మధుమేహులకు పరమ ఔషదం .ఆకులను నమలవచ్చు లేదా కషాయంగా చేసుకొని తాగవచ్చు .

 • ప్రతి రోజు పొడపత్రి కషాయం తీసుకుంటే మధుమేహులు రక్తంలో గ్లూకోస్ ను అదుపులో ఉంచుకోవచ్చు.
 • రక్త ప్రసరణ వ్యవస్థను గర్భాశయాన్ని స్థిర పరుస్తుంది .రక్తంలో కొలెస్ట్రరాలు స్థాయిని సమతులం చేసి, గుండె సంబందిత వ్యాధులను అరికట్టడంలో తోడ్పడుతుంది .
 • ఆస్తమా, చర్మ సంబందిత వ్యాధులకు కూడా దీనితో చికిత్స చేయవచ్చు .మల బద్ధకం, కాలేయ సంబంధిత సమస్యలను పరిష్కరించే శక్తి ఉంది .

కరివేపాకు

కరివేప బహువార్షిక చెట్టు. సాధారణంగా సువాసన కోసం ఆహరంలో కరివేపకు ఉపయోగించబడినప్పటికి, దీనిలో ఔషద గుణాలు చాలా అధికం.

 • ఊబకాయులు రోజు పది కరివేపాకులు నమిలితే బరువు తగ్గవచ్చు.
 • కరివేపాకు రసంలో ఒక నిమ్మకాయ చిటికెడు చక్కెర వేసుకొని తాగితే అజీర్తి సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది .

 • ప్రతి దినం కరివేపాకు పొడి తీసుకోవడం వలన కంటి శుక్లాల సమస్య ను దూరం చేసుకోవచ్చు.

 • వేవిళ్ళ తో బాధపడుతున్న గర్భవతులు పరగడపున ఒక కప్పు కరివేపాకు రసానికి రెండు స్పూన్ ల నిమ్మ రసం ఒక స్పూన్ చక్కెర కలుపుకొని తాగితే వాంతులు, వికారం నుండి ఉపశమనం పొందవచ్చు
 • ఆపరేషన్ లో ఎక్కువ రక్తం పోయిన వారికి కరివేపాకు ముద్దతో కూరలు వండి పెట్టడం వలన ఇనుము అధికంగా లభించి కొత్త రక్తం ఏర్పడుతుంది.
 • కరివేపను కొబ్బరినూనెలో మరిగించి, వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.

 • కరివేప, వేప కలిపి ముద్దగా నూరి ఒక స్పూను ముద్దను అరకప్పు మజ్జిగలో కలిపి పరగడుపున తీసుకుంటే చర్మసమస్యలు తగ్గిపోతాయి.

 • బ్లడ్‌షుగర్ ఉన్నవారు ప్రతిరోజూ కరివేపను విరివిగా వాడటం వల్ల ఆ వ్యాధి అదుపులోకి వస్తుంది.
 • కరివేపను మెత్తగా నూరి నెయ్యి లేదా వెన్నతో కలిపి కాలిన గాయాలపై రాస్తుంటే మచ్చలు పడకుండా త్వరగానూ మానుతాయి.
 • ఒళ్లంతా దురదలతో బాధపడేవారు కరివేప, పసుపు సమానంగా తీసుకుని పొడిగొట్టుకుని రోజూ ఒక స్పూను మోతాదులో నెలరోజులపాటు తీసుకుంటే దురదలు తగ్గుతాయి.
 • కరివేప రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి కళ్లకింద పూస్తుంటే కంటికింది వలయాలు మాయమవుతాయి.
 • నీళ్లవిరేచనాలతో బాధపడేవారు గుప్పెడు కరివేపాకును ముద్దగా చేసి ఒకటి రెండు స్పూన్ల మోతాదులో అరకప్పు మజ్జిగలో కలిపి రోజుకు మూడు నాలుగు సార్లు సేవిస్తే వెంటనే తగ్గుతాయి.
 • తేనెటీగ, తుమ్మెద వంటి కీటకాలు కుడితే కరివేపాకు రసాన్ని నిమ్మరసంతో కలిపి అవి కుట్టిన ప్రదేశంలో రాస్తే బాధ నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది

మునగ

మునగ కూడా చాలా సులువుగా పెంచుకోగలిగే మొక్క. ఆకులు, కాయలను కూరగా వాడతారు. రుచితో పాటు వీటిలో ఔషధ గుణాలు కూడా ఎక్కువ.

 • మునగలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన మునగ ఆకుల రసం ఎదిగే పిల్లలకి టానిక్ లాగా ఉపయోగపడుతుంది .
 • మునగ రసం పాలతో కలిపి తాగితే ఎముకలు ధృడంగా అవుతాయి . గర్బీణీలు ఈ టానిక్ తాగడం వలన కాల్షియమ్ ,ఐరన్ విటమిన్స్ లభిస్తాయి . సుఖ ప్రసవం జరగడానికి తోడ్పడుతుంది .
 • మునగ ఆకులకు నీరు,ఉప్పు జోడించి ఉడికించిన పదార్థం ఆస్తమా, క్షయ వంటి సమస్యలకు మంచి మందుగా పని చేస్తుంది .
 • మునగలో యాంటి బాక్టీరియా గుణాలు కలిగి ఉండటం వల్ల, దాని సూప్ దగ్గు మరియు చర్మ సమస్యలను నివారిస్తుంది ఇంకా జీర్ణ వ్యవస్థ సమస్యల్లో కూడా ఉపయోగపడుతుంది .

 • కలరా, కామెర్లు వంటి వ్యాధులు సోకినప్పుడు మునగ ఆకుల రసం కొంచెం తేనెతో కలిపి కొబ్బరి నీరు తో రోజులో రెండు సార్లు తాగాలి .
 • మధుమేహులు ఒక టీ స్పూన్ మునగ రసం లో 10 గ్రా ల లావు ఉప్పు కలిపి రోజుకి ఒకసారి తాగడం వల్ల అతి మూత్ర సమస్య తగ్గుతుంది.
 • ఆకుల రసం మొటిమల ఫై రాయడం వలన మొటిమలు తగ్గిస్తుంది, మొహానికి కాంతినిస్తుంది .
 • మునగాకును మెత్తగా నూరి, మరుగుతున్న నీటిలో వేసి, మూత పెట్టి ఇదు నిమిషాలు తర్వాత దింపేయాలి. కాస్త చల్లారక వడకట్టి ఉప్పు , మిరియాల పొడి చేర్చి, సూపు లాగ తీసుకోచ్చు.
 • మునగాకు రసం , తేనె, కొబ్బరినీరు, కలిపి చిన్న కప్పు చొప్పున రోజు రెండు , మూడు సార్లు తీసుకుంటే నీళ్ళ విరేచనాలు , రక్త విరేచనాలు, కాలేయ సమస్యలు తగ్గుతాయి.
 • కామెర్లు ఉన్నవారు చెంచా మునగాకు రసాన్ని, రెండు చెంచాల కొబ్బరినీటిలో కలిపి ఓ వారం పాటు క్రమం తప్పకుండ తీసుకుంటే త్వరగా కోలుకుంటారు.
 • మునగాకు రసంలో చిటికెడు ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం వేసి పరగడుపున పుచ్చుకుంటే బడలిక , జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతాయి.
 • మూత్రంలో మంట , ఉష్ణ తత్వం ఉన్నవారు మునగాకు, క్యారెట్, దోసకాయల రసాలను జత చేసి రోజు ఓ గ్లాసు తీసుకుంటే ఫలితం ఉంటుంది.
 • అధిక బరువు, మధుమేహం ఉన్నవారు ఎండబెట్టిన మునగాకుపొడిని తేనెతో కలిపి చెంచా చొప్పున రోజూ భోజనానికి ముందు తీసుకోవాలి.

నిమ్మ

 

నిమ్మ పుల్లని పండ్ల జాతికి చెందిన మొక్క. తక్కువ స్థలంలోనే సులువుగా పెరట్లో పెంచుకోవచ్చు.

 • నిమ్మలో కాల్షియమ్ ఉండటం వలన బహిష్టు ఆగిపోయిన మహిళలకు నిమ్మ రసం ఎంతో మేలు చేస్తుంది.

 • సూర్య కిరణాలలోని అతినీలలోహిత కిరణాలు చర్మాన్ని తాకినప్పుడు శరీరం లోని మెలనిన్ మచ్చలను ఏర్పరుస్తుంది. నిమ్మ తొక్కలో దీనిని ఆపగలగిన పదార్థాలు ఉంటాయి. నిమ్మ తొక్కలను నూరి లేపనంగా రాసుకుంటే మచ్చలు రాకుండ అరికట్టవచ్చు.

 • కాన్సర్ నివారించగల శక్తి నిమ్మకు ఉంది. నిమ్మలో యాంటి ఆక్సిడెంటు లెమనాయిడ్స్ , కాన్సర్ కారక కణజాలాలను నశింప చేస్తాయి .
 • నిమ్మలో ప్లేవనాయిడ్స్ కొలెస్ట్రరాలు, ట్రైగ్గిసరైడ్స్ తగ్గించగల గుణం ఉంది. కొలెస్ట్రరాలు ,ట్రైగ్గిసరైడ్స్ గలవారు ఉదయం నిమ్మ రసం తీసుకోవడం మంచిది.
 • అజీర్ణంతో బాధపడేవారెవరైనసరే, కాస్త నిమ్మరసం, గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే అజీర్తి నుంచి ఉపశమనం పొందవచ్చు.
 • గుండెల్లో మంట, డయేరియా, బద్ధకంగా ఉండడం వంటివాటికి నిమ్మరసం దివ్యౌషధం,
 • నిమ్మకాయ సహజ సిద్ధమైన యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. నిమ్మరసాన్ని శరీరానికి పట్టించి, కాస్సేపటి తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే, శరీరంలో నిగారింపు వస్తుంది.
 • వయసు మీద పడుతుండడం వల్లే వచ్చే చర్మ ముడతపడి పోవడాన్ని నిమ్మకాయ రసం కొంత వరకు నిరోధిస్తుంది. బ్లాక్‌ హెడ్స్‌ వంటి వాటిని నిమ్మరసం నివారిస్తుంది.
 • పన్ను నొప్పితో బాధ పడుతుంటే, కాస్త నిమ్మరసాన్ని నొప్పిపుట్టిన చోట పెడితే వారికి ఉపశమనం లభిస్తుంది. పళ్ల నుంచి రక్తం కారుతున్న, నోటినుంచి దుర్వా సన వస్తున్నా నిమ్మకాయ రసం వాటిని దూరం చేస్తుంది.
 • గొంతులో తరచూ తలెత్తే ఇబ్బందుల నుంచి నిమ్మరసంతో విముక్తి పొందవచ్చు. నిమ్మరసం, నీరు కలిపి పుక్కిస్తుంటే గొంతు నొప్పి, గొంతులో గరగర వంటివి ఇబ్బంది పెట్టవు.
 • నిమ్మరసంతో చేసే నింబూ పానీలో ఎక్కువగా వుండే పొటాషియం రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. నీరసం, మగతగా వుండడం, ఒత్తిడికి నింబు పానీ మంచి చికిత్స.

జామ

 

పెరటిలో నేల మీద పెంచగలిగిన దీర్ఘ కాలిక వృక్షం. దీని ఆకులలో ఔషధ గుణాలు, పండులో పోషకాలు ఎక్కువగా ఉంటాయిఉంటాయి.

 • 5-6 తాజా ఆకులను అర లీటరు నీటిలో 5 నిముషాలు ఉడికించి వడగట్టి రోజుకు మూడు సార్లు పుక్కలి పట్టాలి. లేదా 4-5 తాజా ఆకులను కొద్దికొద్దిగా నీరు పోస్తూ మెత్తగా నూరి దానిని నొప్పిని కలిగిస్తున్న దంతాలపై రోజుకు రెండు సార్లు చొప్పున మూడు రోజులు ఆ విధంగా చేయాలి. పంటి నొప్పి, చిగుర్ల వ్యాధి తగ్గుతాయి.

 • 2,3 ఆకులను నమిలితే దంతాలు శుభ్రపడతాయి. దృఢత్వం కూడా చేకూరుతుంది.
 • చెట్టు బెరడు నుండి తీసిన కషాయం సూక్ష్మజీవులను నశింపజేస్తుంది. 5,6 ఆకులను నీటిలో మరగ కాచిన కషాయం వాడితే దగ్గు, జలుబు పోతుంది.
 • ఆకుల నుండి లభించే తైలం యాంటి ఆక్సిడెంట్ల చర్యలను వేగవంతం చేస్తుంది. ఆకులతో తయారైన మందులు డయేరియా, డిసెంట్రీలకు మంచి ఫలితాన్నిస్తాయి.
 • బాగా మాగిన పండును రోజూ తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో వుంటుంది. ఎసిడిటి కలవారు కూడా రోజుకో పండును వాడితే మంచిది.

 • పచ్చి కూరగాయ ముక్కలతో పాటు జామకాయ ముక్కలను కలిపి వాడితే ఊపిరితిత్తుల వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి దోహదం చేస్తుంది.
 • ఇందులోని కెరొటినాయిడ్స్‌, ఐసోఫావో నాయిడ్స్‌, పాలిఫినాల్స్‌ మెదడు కణాలు చురుకుగా పనిచేయడానికి తోడ్పడతాయి.
 • కాలిన గాయాలకు గుజ్జును రాస్తే తొందరగా ఉపశమనం దొరుకుతుంది. డైటింగ్‌ చేసేవారికి జామపండు బలవర్ధక ఆహారం.

దానిమ్మ

దానిమ్మ దీర్ఘకాలిక వృక్షం. దీని ఆకులు, బెరడు, పండుపై ఉన్న తొక్క ఔషధ గుణాలు కలిగి ఉన్న భాగాలు.

 • దానిమ్మ ఆకులను మెత్తగా నూరి, ఆ ముద్దగా పరగడపున తీసుకుంటే విరోచనాలు తగ్గుతాయి .

 • దానిమ్మ బెరడు ,తొక్కను నీటిలో ఉడికించి వడగట్టగా వచ్చిన కషాయంను తాగిన కూడా విరోచనాల నుండి ఉపశమనం లభిస్తుంది .
 • కడుపు నొప్పి, ఉబ్బరం తగ్గి జీర్ణాశయం శుద్ధి అవుతుంది. మధుమేహులు దానిమ్మ పండు తినేటప్పుడు గింజల మధ్య ఉండే సన్నటి చిరుచేదు కలిగిన పొరతో సహా తింటే రక్తంలో గ్లూకోజు శాతం అదుపులో ఉంటుంది.

 • సూర్యకిరణాల తాకిడివల్ల చర్మం లోని కొలాజెన్‌ తగ్గిపోతుంది . దీని ఫలితంగా చర్మం ముందే వార్ధక్యా నికి లోనై ముడతలు పడుతుంది. దానిమ్మ పండులోని " ఇల్లాజిక్ యాసిడ్ " ను చర్మం పై రాస్తే సూర్యకిరణాల తాలూకు ప్రభావము నుంచి రక్షిస్తుంది..
 • దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే గుండె భద్రంగా ఉంటుంది.
 • నీళ్లవిరేచనాలతో బాధపడేవారికి దానిమ్మ రసం మంచి మందు.
 • రుతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు విరుగుడు దానిమ్మ రసం.


డాక్టర్ ఎ.మేరి స్వర్ణలత, ప్రొఫెసర్, విస్తరణ & ప్రసార నిర్వహణ విభాగం
కుమారి బి.అర్చన, విద్యార్ధి, ఐ.డి.నెం.హెచ్.హెచ్.2009/007.

Download File

Rating :2.75 1   1   1   1  
somasekhar    2015-11-29 10:09:11
This is good information to all
...............................................
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4