Warning: mysql_fetch_array() expects parameter 1 to be resource, boolean given in /home/vigyanas/public_html/abhivruddhi.php on line 17

అభివృద్ధి పథకాలు

వినియోగదారుల విద్య

సమాజంలో ప్రతి వ్యక్తి వినియోగదారుడే. ప్రతిరోజు ఎన్నో వస్తువులు కొంటాం, సేవలు పొందుతుంటాం. మనం పొందేవన్ని మేలుచేసేవిగా వుండాలి. మేలుచేసేవి పొందడం అందరి హక్కు. అందుకుగాను ప్రభుత్వం వినియోగదారులకు రక్షణను కల్పిస్తుంది. దాని పట్ల అవగాహన పెంచుకుని సవ్యంగా వాడుకోగలగాలి.

వినియోగదారుడు : పూర్తి డబ్బు చెల్లించి వస్తు, సేవలను కొనుగోలు చేసే వ్యక్తులను; వస్తు, సేవల వెలలో కొంత మొతాన్ని చెల్లించి, మిగిలినది తర్వాత చెల్లించేందుకు వాగ్ధానం చేసే వ్యక్తులను వినియోగదారులంటారు. వస్తు సామాగ్రిని వ్యాపార నిమిత్తం తిరిగి అమ్ముకునేందుకు కొనుగోలు చేసిన వ్యక్తి వినియోగదారుడు కాదు.

వినియోగదారులు సాధారణంగా మోసపోయే సందర్భాలు/అంశాలు:

  • కనీస ప్రమాణాలు లేని నాసిరకం వస్తు సామాగ్రి.
  • నకిలీ వస్తువులు, ఔషధాలు.
  • కల్తీ ఆహార పదార్ధాలు.
  • మోసపూరిత తూనికలు, కొలతలు.
  • మోసపూరిత ప్రకటనలు.

మోసగించబడిన వినియోగదారుడికి ప్రభుత్వం తరుపున రక్షణ ఉంది. దానినే వినియోగదారుల రక్షణ చట్టం అంటారు. ఈ చట్టం ద్వారా వినియోగదారునికి హక్కులు కల్పించబడ్డాయి- అవి

  • భద్రత హక్కు.
  • సమాచారం పొందే హక్కు.
  • ఎంపిక చేసుకునే హక్కు.
  • విన్నవించుకునే హక్కు.
  • నష్ట పరిహారం పొందే హక్కు.
  • వినియోగదారుల విద్యను పొందే హక్కు.
  • ప్రాధమిక అవసరాలను పొందే హక్కు.
  • ఆరోగ్యకరమైన పరిసరాలను పొందే హక్కు.

భద్రత హక్కు

  • ఆరోగ్యకరమైన జీవితానికి, హానికరమైన వస్తువులు, ఉత్పత్తులు, ఉత్పత్తి ప్రక్రియలు, సేవల నుండి రక్షణ పొందే హక్కు.
  • వినియోగదారుని ఆస్తికి రక్షణ పొందే హక్కు.
  • కొనుగోలు చేసిన సాధనం లేక ఉపకారం విఫలం కావడం వల్ల వినియోగదారునికి ఇబ్బంది, నష్టం, భంగం వాటిల్లకుండా రక్షణ.
  • ఏ వస్తువు వలన ఎటువంటి ఇబ్బంది కలగకుండా రక్షణ.

భద్రత ఎవరు కల్పించాలి?

ప్రభుత్వం, వర్తకుడు, ఉత్పత్తిదారులతో పాటు వినియోగదారుడు కూడా వినియోగదారునికి భద్రత కల్పించాలి.

సమాచారం హక్కులోని అంశాలు

  • ప్రభుత్వం, వ్యాపారుల నుండి, వస్తు, సేవలకు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారుడు అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు.
  • వినియోగదారుడు వస్తువును కొనుగోలు చేసే సమయంలో వస్తువును ఎవరు, ఎక్కడ, దేనితో తయారు చేశారు, దానిని వినియోగించే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గూర్చిన సమాచారం అందజేయడం వర్తకుని బాధ్యత.
  • వినియోగదారుడు వస్తు, సేవల గురించి అవసరమైన సమాచారాన్ని తప్పకుండ పొందగల వీలును కల్పిస్తూ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని (సమాచార హక్కు చట్టం (సహ చట్టం), Right to Information Act (RTA) ) అమలులోకి తెచ్చింది
  • తగిన సమాచారం పొందడం కోసం దరఖాస్తును తయారు చేసుకుని సంబంధిత అధికారి పేరు మీద తీసుకున్న రూ10 (పది రూపాయల) డిమాండు డ్రాఫ్టును దానికి జతచేసి పంపాలి. నెలరోజులలోపు సమాధానం రాకపోతే జిల్లా ఫోరంను ఆశ్రయించాలి.

సమాచారం వలన వినియోగదారునికి ఎలా ఉపయోగాలు?

  • నాణ్యత, పరిమాణం, శక్తి, పరిశుద్ధత, కలయికలు, ధరలను తెలుసుకొని నాణ్యమైన వస్తువును కొనవచ్చు.
  • అసమగ్ర ప్రచారం వల్ల తప్పుదారి పట్టకుండా ఉండవచ్చు.
  • ఉత్పత్తుల దుష్ప్రభావాలు ఏవైనా ఉంటే వాటి గురించి తెలుసుకోవచ్చు.
  • వినియోగదారుల జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసే అంశాలను గూర్చి తెలుసుకోవచ్చు.
  • ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించి, వాటి అమలు, ప్రయోజనం గురించి తెలుసుకోవచ్చు.

వినియోగదారునికి సమాచారం అందించే సాధకాలు

  • వస్తువులపై ఉండే లేబుల్సు, ప్రకటనలు, పత్రికలు, ఎలక్ట్రానిక్ సాధనాలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల అధికారిక రికార్డులు, పౌర సేవ పత్రాలు.
  • టి.వి. కార్యక్రమాలు, వార్త పత్రికలు, పుస్తకాలు, వార్షిక నివేదికలు, అంతర్జాలం మరియు బ్లాగులు.

ఎంపిక చేసుకునే హక్కులోని అంశాలు

  • వినియోగదారునికి తనకు ఇష్టమైన వస్తువును కొనుగోలు చేసే హక్కు ఉంది. అందుకుగాను వర్తకుడు దుకాణంలో పలురకాల వస్తువులను వినియోగదారునికి అందుబాటులో ఉంచాలి.
  • అందుబాటులో ఉన్న వస్తువు నుంచి వినియోగదారుడు తనకు ఇష్టమైన ఉత్పత్తిని ఎంపిక చేసుకొనే అవకాశాన్ని వినియోగదారునికి కల్పించాలి.
  • వర్తకుడు నిర్భంధ వ్యాపార విధానాన్ని అవలంబించకూడదు. ఈ వస్తువు కొంటేనే ఈ వస్తువు అనే షరతులు విధించకూడదు

విన్నవించుకునే హక్కులో అంశాలు

  • వినియోగదారునికి వారి ప్రయోజనాల కోసం వాదించే హక్కు ఉంది.
  • తమ అభిప్రాయాలను వాదనలను వినిపించే హక్కు ఉంది.
  • వినియోగదారులకు వస్తు, సేవలు అందించే సంస్థలు వినియోగదారుల ఫిర్యాదులను విని పరిష్కరించేందుకు ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలి.
  • ప్రభుత్వ స్థాయిలో ముఖ్యమైన అంశాలపై తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం వినియోగదారులకు ఉండాలి.

వినియోగదారునికి విన్నవించుకోవడానికి అందుబాటులో ఉన్న వేదికలు

  • వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రాలు.
  • జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వినియోగదారుల రక్షణ మండళ్ళు.
  • జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి సలహా సంఘాలు.
  • వినియోగదారుల సంరక్షణ కేంద్రాలు.

నష్టపరిహారం పొందే హక్కులో అంశాలు

లోపం కలిగిన వస్తువులకు, సేవలకు నష్ట పరిహారాన్ని పొందే హక్కు వినియోగదారుని సొంతం.

  • నష్ట పరిహారం కోసం జిల్లా ఫోరం, రాష్ట్ర కమీషన్ ,జాతీయ కమీషన్ ని ఆశ్రయించాలి

వినియోగదారుల విద్యను పొందే హక్కు

పరిజ్ఞానవంతుడైన వినియోగదారునిగా రాణించడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పొందే హక్కు వినియోగదారునికి ఉంది.

ప్రాథమిక అవసరాలను పొందే హక్కులో అంశాలు

  • తగినంత ఆహారం, వస్త్రాలు, వసతి, ఆరోగ్య సంరక్షణ, త్రాగు నీరు, నిత్య పారిశుధ్యం, విద్యుచ్ఛక్తి, రవాణా మొదలైన ప్రాథమిక అవసరాలను పొందే హక్కు వినియోగదారునికి ఉంది.

ఆరోగ్యకరమైన పరిసరాలను పొందే హక్కులో అంశాలు

  • జీవననాణ్యతను పెంపొందించగల భౌతిక పరిసరాలను కలిగి ఉండే హక్కు వినియోగదారునికి ఉంది.
  • భయం, ప్రమాదం కాకుండా క్షేమంగా, గౌరవంగా జీవించడానికి వీలు కల్పించే పరిసరాలలో నివసించి, పని చేసే హక్కు వినియోగదారునికి ఉంది.

భద్రతా ప్రమాణాలు

  • ఉత్పత్తులపై వేసిన సర్టిఫికేషన్ గుర్తు వాటి వాడకం సురక్షితమైనదని స్పష్టీకరిస్తుంది.
  • ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్, టెక్స్ టైల్స్, కెమికల్స్, క్రిమిసంహారకాలు, సిమెంట్- కాంక్రీట్ ఉత్పత్తులు, ఆప్టికల్ సామగ్రి, ఆటోమొబైల్ భాగాలు, ఆహార పానీయాలు వగైరా ఉత్పతుల పైన "ఐ.ఎస్.ఐ బ్యూరో ఆప్ ఇండియన్ స్టాండర్డ్స్(బి.ఐ.ఎస్)" సర్టిఫికేషన్ గుర్తు చూసి కొనాలి.
  • జాములు, పండ్ల రసాలు, స్క్వాష్ లు, బాటిళ్ళు, క్యాన్లు, కూరగాయలు, పచ్చళ్ళు, సూపులు, నీరు నిర్జలీకరణ చేసిన కూరగాయలు కొనేటప్పుడు వాటిపైన "ఎఫ్. పి. ఓ” గుర్తును చూడండి.
  • కూరగాయలు, నూనె, నెయ్యి, మీగడ, వెన్న, బెల్లం, వేరు శెనగకాయలు, పండ్లు,మసాలాలు, పప్పులు, అటవీ ఉత్పత్తులు మీద "ఆగ్ మార్క్" గుర్తు గమనించి కొనండి.
  • సబ్బులు, డిటర్జెంట్లు, కాగితం, కొవ్వును కలిగిన నూనె, ప్యాకింగ్ వస్తువులు, పౌడరు, కోటింగ్ బాటరీలు, ఆహార అడిటివ్ లు, వస్త్రాలు, అగ్నిమాపక పరికరాలు, చర్మ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు కొనేట్టపుడు "ఎకో మార్క్ (ఎకో లేబిలింగ్ ) చూసి కొనండి.
  • మాంసం, మేక మాంసం, టిన్ లలో భధ్రపరచబడిన సాసేజ్ లు, హ్యామ్ మొదలైన ఉత్పతులపై "ఎం.పి. ఓ. మాంస ఉత్పత్తుల ఉత్తర్వు గమనించండి.
  • ఉన్ని వస్త్రాలు, దుస్తులు కొనేటప్పుడు "ఉన్ని మార్కు" చూసి కొనండి.
  • బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు కొనేటప్పుడు " హాల్ మార్కు హెచ్. ఎ. సి.సి.పి." గుర్తు గమనించి కొనండి.

ఫిర్యాదులు ఎక్కడ, ఎలా చేయాలి?

  • వినియోగదారుల చట్టం 1986 క్రింద వినియోగదారుని హక్కులకు భంగం వాటిల్లినపుడు జిల్లా ఫోరం, స్టేట్ కమీషన్, నేషనల్ కమీషనులలో ఫిర్యాదు చేయవచ్చు.
  • వ్రాత పూర్వకంగా ఫిర్యాదు చేసేటప్పుడు తగిన సాక్షాలుగా బిల్/వోచర్/రశీదు జిరాక్సు కాపీలను జత చేయండి. ఒరిజినల్స్ ఎప్పుడూ జత చేయవద్దు. ఫిర్యాదు కాపీ ఒకదానిని మీతో తప్పక ఉంచండి.
  • ఫిర్యాదు సూటిగాను, స్పష్టంగాను, సులభంగా అర్ధమయ్యేలా మర్యాద పూర్వకమైన బాషలో వ్రాయాలి. అసభ్యకరమైన పదాలు, తిట్లు, అనవసర అభియోగాలు ఉండకూడదు.
  • వ్యాపారి బిల్/వోచర్ ఇచ్చేందుకు తిరస్కరిస్తే, బయటకు వచ్చేసి, జరిగింది విపులంగా వ్రాసి సాక్ష్యంగా మీతో వచ్చిన లేదా మరో వ్యక్తి సంతకం తీసుకోండి.
  • స్వయంగా ఫిర్యాదును ఇస్తున్నపుడు ఫిర్యాదు అందినట్లు రశీదు తీసుకోండి. పోస్టు ద్వారా పంపినట్లుయితే రిజిస్టర్డ్ డ్యూ పోస్టు ద్వారా పంపండి.
  • ప్రస్తుతం వార్తా పత్రికలలో వినియోగదారుల ఫిర్యాదులను ప్రచురించేందుకు ప్రత్యేకమైన శీర్షికలను ప్రారంభించారు. దానిని సద్వినియోగం చేసుకోండి. అలా వ్రాయడం వల్ల సంబంధిత అధికారులు సత్వరమే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది.
  • స్థానిక వినియోగదారుల సంఘాలకు ఫిర్యాదు చేసి పరిష్కారము పొందేందుకు ప్రయత్నించవచ్చు. ఆఖరి ప్రయత్నంగా మాత్రమే జిల్లా ఫోరం/ స్టేట్ కమీషన్ / నేషనల్ కమీషనులలో ఫిర్యాదు చేయండి.

తూనికలు, కొలతల విషయంలో వినియోగదారులు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్య విషయాలు

  • ప్యాకేజిపై ముద్రించబడిన వస్తువు నికర బరువు ప్రకారం ఉందా లేదా అని వర్తకుని వద్దగల ఎలక్ట్రానిక్ కాటా మీద సరిచూచుకొనవలసిన బాధ్యత వినియోగాదారునిపై ఉంది.
  • ప్రతి తూనిక రాయి యొక్క అడుగు భాగాన ముద్రించబడిన ధృవీకరణ ముద్రతో పాటు, ముద్రించబడిన సంవత్సరము, విభాగము మరియు ఇన్స్పెక్టర్ వారీ సంఖ్య తప్పకుండా ఉండాలి. ఈ వివరాలు లేనట్లయితే అవి నకిలీ తూనికలుగా పరిగణించాలి.
  • ప్రతి స్థూపాకారపు కొలత మరియు త్రికోణ కొలత పైభాగo అంచు వద్ద పరిశీలకుని ధృవీకరణ ముద్ర, ముద్రించిన సంవత్సరము, విభాగము మరియు ఇన్స్పెక్టర్ వారీ సంఖ్య ఉంటుంది.
  • త్రాసును కొక్కానికి గాని స్టాండునకు గాని వ్రేలాడదీయాలి. ఒకవేళ చేతితో పట్టుకొనిన్నట్లయితే మోసానికి గురికాకుండా జాగ్రత్త పడాలి. ఏ వైపు సరుకులుంచారో ఆ వైపు చేయితో అదుముతుంటారు. అలా తూకాని కంటే తక్కువ బరువుగల సరుకునిస్తుంటారు.
  • కొలత పాత్రలతో ద్రవ పదార్ధములను కొనుగోలు చేస్తున్నప్పుడు, ఆ పాత్రలకు ఎటువంటి చొట్టలు లేకుండా ఉండేట్లుగా గమనించాలి.
  • తూనిక యంత్రాల ద్వారా తూకం జరుగుచున్నప్పుడు, స్టీల్ యార్డ్ సమాంతరముగా ఉన్నది లేనిది గుర్తించాలి. ఆ యంత్రానికి ఎటువంటి అదనపు అమరికలు లేకుండా ఉండేట్లుగా చూసుకోవాలి.
  • పెట్రోల్ మరియు డీజిల్ తేసుకొనేప్పుడు కొలత యంత్రం “0”లో మొదలగునట్లు చూసుకోవాలి.
  • ఆటో రిక్షాలో వినియోగదారులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆటో మీటరకు వేయబడిన సీలు సరిగా ఉన్నది లేనిదీ గమనించాలి.
  • నాన్ స్టాండర్డ్ తూనికలు, కొలతలు మరియు తూనిక పరికరములు అంటే పౌనులు, తులాలు, తవ్వ, కుంచం, కర్ర కాటాలు ఉపయోగించి వస్తువులను విక్రయించే వర్తకుల వద్ద కొనుగోలు చేయవద్దు.
  • వినియోగదారుడు వస్తువులను కొనుగోలు చేస్తునప్పుడు వర్తకులు ఉపయోగించే తూనికలు, కొలతలు మరియు తూనిక పరికరములు, తూనికలు, కొలతలు శాఖ వారిచే సరిచూచి ముద్రచేయ బడినదో లేదో పరిశీలించాలి.
  • మెట్రిక్ పద్ధతిలోనున్న తూనిక రాళ్ళను, కొలతలను అంటే గ్రాములు, కేజీలు, లీటర్లు మొదలగునవి ఉపయోగించి వర్తకులు తూకము చేయునప్పుడు మాత్రమే వస్తువులను కొనుగోలు చేయండి.
  • వంపున్న మరియు చివరల కత్తిరించబడిన కొలత బద్దలను వ్యాపారస్తులు ఉపయోగించి ఏదైనా వస్తువులను కొలచి ఇచ్చినప్పుడు అట్టి వస్తువులను కొనుగోలు చేయవద్దు.

ప్యాకేజిలో గల వస్తువులను కొనేటప్పుడు గమనించవలసిన అంశములు:

ఏదైనా వస్తువులను అమ్మకం కొరకు ఏదైనా ప్యాకేజీలో నిర్దిష్ట పరిమాణంలో ప్యాక్ చేయబడినప్పుడు దానిని ప్యాకేజీ కమోడిటి అంటారు.

  • ప్రతి ప్యాకేజీపైన ప్యాక్ చేసిన వారి పూర్తి చిరునామా, ప్యాకేజీలో యున్న వస్తువు పేరు, వస్తువు యొక్క నికర కొలత లేదా సంఖ్య, వస్తువుయొక్క గరిష్ట చిల్లర ధర, తయారు చేయబడిన నెల మరియు సంవత్సరం, తయారుదారుల యొక్క టెలిఫోన్ నెం. మరియు ఇ- మెయిల్ అడ్రస్ తప్పని సరిగా ప్యాకేజీ పైన ముద్రించి ఉండవలెను.
  • దానిపై ముద్రించిన ధరను మాత్రమే చెల్లించటం, రశీదును పొందటం మరచిపోకూడదు.
  • ప్యాకేజీలపై తయారుదారుడు ముద్రించిన ధరకు అదనంగా ధర పెంచుతూ అతికించబడిన స్టికర్లు ఉన్నట్లు అయితే ఆ విషయాన్ని తూనికలు, కొలతలు అధికార్ల దృష్టికి తీసుకొనిరావటం.
  • వినియోగదారులు హెల్ప్ లైన్ నెం:1860-425-3333 ద్వారా లీగల్ మెట్రోలజీ శాఖకు అక్రమ విక్రయదారుల సమాచారాన్ని అందించవచ్చు.
  • మనం ఒక వస్తువుని కొనేటప్పుడు దానికి సంబంధించిన రశీదును తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే మనం తొందరలో నచ్చింది కదా అని ఏమి ఆలోచించకుండా తీసుకుంటాం. తరువాత ఇంటికి వెళ్ళి చూస్తే అది మంచిది కాదు అని తెలుస్తుంది. మళ్ళీ దాని తిరిగి మార్చుకోవాలంటే రశీదు తప్పనిసరిగా ఉండాలి.
  • వినియోగదారులు ప్రాధాన్యతనిచ్చే బ్రాండ్లను అనుకరిస్తూ క్రొత్త, క్రొత్త కంపెనీలు చాల పుట్టుకొస్తున్నాయి. ఉదాహరణకు అమృతాంజన్ కు అమరాంజన్ పుట్టుకొచ్చింది. అలానే నోకియాకు నొకై రావడం జరుగుతున్నాయి. కాబట్టి వినియోగదారుడు గమనించి అప్రమత్తంగా వస్తువులను తీసుకోవాలి.
  • ప్యాకీజి ఆకర్షణీయంగా ఉందని కోనేయకండి. ఎందుకంటే కొనుగోలు చేసిన తర్వాత చూస్తే, అందులో నాణ్యత కలిగినది కాకుండా నాసిరకం వస్తువులు ఉండడం జరుగుతుంది. కాబట్టి దానిని గుర్తించి పూర్తిగా తెలుసుకొని కొనండి.
  • టీవీల్లో వ్యాపార ప్రకటనలలో ఉన్నవి, లేనివి చెప్పి ఊదరగొట్టేస్తున్నారు. మనం చూసే ఓ లైవ్ కార్యక్రమమైనా, సీరియలైనా, సినిమా అయిన మధ్యలో దూరి రకరకాల మ్యూజిక్ తో, చమత్కారాలతో, కాసింత నిజాలతో ఆకర్షణీయంగా ప్రకటనలను మలుస్తున్నారు. వినియోగాదారులు వీటన్నింటిని చూసి మోసపోవద్దు.
  • హానికరమైన వస్తువులను తయారు చేయడం మానుకోకుండా, బదులు ఇంకా ఎక్కువగా కొనుగోలు అయ్యేలా ఆకర్షణీయమైన వ్యాపార ప్రకటనలతో మోసం చేస్తున్నారు. ఇలాంటి ప్రకటనల మోజులో పడి వస్తువు యొక్క నాణ్యత గురించి జాగ్రతపడటం మర్చిపోయి, వినియోగదారులు మోసపోతున్నారు.
  • తమ హెయిర్ ఆయిల్ వాడినట్లయితే బట్టతల మీద కూడా జుట్టు వస్తుందని చెప్పడం వంటి ప్రకటనలలో డిమాండ్ లేని వస్తువుని డిమాండ్ ఉన్న వస్తువులతో జతచేసి అమ్ముతున్నారు. వినియోగాదారుల ఆరోగ్యానికి హాని కల్గించే వస్తు సేవల నుంచి రక్షణ హక్కును వినియోగించుకుని రక్షణ పొందాలి.
  • కొందరు వ్యాపారస్తులు కొటేషన్ స్లిప్ మీద సరుకు పేరు, ధర రాసి ఇస్తుంటారు. దానిని అంగీకరించకండి. రశీదు/ RECIEPT, క్యాష్ మెమో/ CASH MEMO అని ముద్రించబదినదే తీసుకోండి. అదే అసలైన బిల్లు.
  • ఔషధాలు, ప్యాక్డు తినుబండారాలు కొనేటప్పుడు దాని కాలపరిమితి చూసి కొనడం మరిచిపోకండి. ఎందుకంటే దాని వల్ల ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. MFD అనగా తయారు చేసిన తేదీ, సంవత్సరం; EXP అంటే కాలం చెల్లే గడువు తేదీ, సంవత్సరం తప్పకుండా చూసుకోవాలి.
  • వ్యాపారదారులు మిల్లుల నుండి సాధారణ విత్తనాలను కొనుగోలు చేసి అందమైన ప్యాకింగుల్లో లేక కాలం చెల్లిన విత్తనాలను కొత్త సంచుల్లో పోసి అమ్ముతున్నారు. కాబట్టి సంచుల ముద్రించిన నాణ్యత ప్రమాణాన్ని, స్వచ్ఛతను, సూచనలు చూసి కొనుగోలు చేయాలి.
  • కొనుగోలు చేసే సరుకు యొక్క ధరల్లో వ్యత్యాసాన్ని ముందుగ తెలుసుకొని, సరసమైన ధరలకు విక్రయించే షాపులోనే కొనుగోలు చేయాలి.
  • లోపం కలిగిన వస్తువులకు, సేవలకు నష్టపరిహారం పొందడానికి జిల్లా ఫోరం, రాష్ట్ర కమీషన్ లేక జాతీయ కమీషన్ ను ఆశ్రయించాలి.

    డాక్టర్.టి.నీరజ, ప్రొఫెసర్, వనరుల నిర్వహణ & వినియోగదారుల శాస్త్ర విభాగం
    కుమారి. సి.హెచ్.సింధు, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్.2010/073.

Download File

Rating :1.99 1   1   1   1  
karunakar    2015-02-14 05:11:11
Good
...............................................
sathya    2017-03-20 15:01:11
please provide phone numbers or address to file complaints
...............................................
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4