అభ్యుదయం

సామాజిక స్పృహ దినోత్సవాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం: మార్చి 8  


అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. పదిగంటల పనిదినాల కోసం, పురుషులతో సమానమైన వేతనాల కోసం పశ్చిమ పెన్సిల్వేనియాలోని ఒక బట్టల మిల్లులో మహిళలు సమ్మె ప్రారంభించారు. ఇందులో 5000 మంది పాల్గొన్నారు. ఇది ఇతర ప్రాంతాలకూ విస్తరించింది. చివరకు 1857 మార్చి 8వ తేదీన ఈ సమ్మె విజయవంతమైంది. అందుకే ఆరోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు.
ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరు వేరు తేదీలలో ఆచరించబడింది. సోషలిస్ట్ పార్టీ మొట్ట మొదటి సారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది. 1909 ఫిబ్రవరి 28 న అమెరికాలో మహిళల దినోత్సవం జరిగింది. అమెరికా మహిళా కార్మికులు దీనికి హాజరు అయ్యారు. 1910 ఆగష్టులో కోపెన్ హగ్ లో అంతర్జాతీయ మహిళా సదస్సు జరిగింది. అమెరికా సోషలిస్టులను స్పూర్తిగా తీసుకొని జర్మన్ సోషలిస్ట్ పార్టీ ఏటా మహిళా దినోత్సవం జరపాలని నిర్ణయించింది. జర్మనీ లో జరిగిన మహిళా సదస్సుకు 17 దేశాల నుండి 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సమాన హక్కుల గురించి ఉద్యమించాలని తీర్మానించారు. 1911 మార్చి 18 న ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ లో తొలిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అంతర్జాతీయ మహిళల దినోత్సవం సంధర్భంగా రష్యాలో జరిగిన ప్రదర్శనలు 1917 రష్యా విప్లవానికి దారి తీసాయి. 1913 నుంచి రష్యన్ మహిళా ఉద్యమం చేపట్టారు. చైనాలో 1922 నుంచి ఈ దినాన్ని పాటించడం మొదలైనది. 1965 నుంచి సోవియెట్ యూనియన్ లో మహిళా దినోత్సవం రోజు సెలవు ఇవ్వడం మొదలు పెట్టారు. పాశ్చాత్య దేశాలలో 1977 నుంచి ఐరాస ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఐక్యరాజ్యసమితి మార్చి 8 ని మహిళా దినోత్సవంగా గుర్తించింది. ప్రతి సంవత్సరం ఒక్కో అంశం మీద జరుకుంటారు. ఈ రోజున వంగపండు రంగు రిబ్బన్ ధరించి మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని, వారి హక్కులను కాపాడాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం మార్చి 8 న జరుపుకుంటున్నారు.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం: మే 1


చికాగోలో ఉన్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మిక వర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి ఈ చాకిరీ మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం త్యాగం చేయటం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి (రెస్టు), ఇంకా ఎనిమిది గంటలు రిక్రియేషన్‌ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. మన దేశంలో మొదటిసారి 1923 లో 'మే డే'ను పాటించడం జరిగింది. 1920 లో ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పడటం మూలంగా అప్పటినుంచే కార్మికవర్గంలో చైతన్యం పెరగడం మొదలైంది. అప్పటినుండి 'మే డే'ను పాటించడం జరుగుతుంది.
ప్రపంచ రెడ్ క్రాస్ సొసైటీ దినోత్సవం: మే 8


యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకుని వారికి ఆసరాగా నిలవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థే "రెడ్‌క్రాస్ సొసైటీ". ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సేవా సంస్థలన్నింటిలోకీ అతి పెద్దది .
1895వ సంవత్సరంలో ఫ్రాంకో-సార్డియన్ కూటమికి, ఆస్ట్రియా సామ్రాజ్యవాద సైనిక దళాలకు మధ్య జరిగిన యుద్ధంలో దాదాపు 40 వేలమంది సైనికులు మరణించారు, వేలాది మంది గాయపడ్డారు. ఈ యుద్ధంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆదుకుని, వారికి సేవలందించేందుకు అప్పట్లో స్విట్జర్లాండ్‌కు చెందిన హెన్రీ డునాంట్ అనే వ్యక్తి ముందుకొచ్చాడు. ఆ సంఘటన తరువాత తానే ఇలాంటి వారికోసం ఓ సేవాసంస్థను ఎందుకు స్థాపించకూడదని ఆలోచించాడు. దాని ఫలితంగా ఏర్పడిన సంస్థే ఈ రెడ్‌క్రాస్ ఇంటర్నేషనల్ సౌసైటీ. ఈ రెడ్ క్రాస్ సంస్థను జెనీవా నగరంలో స్థాపించాడు. స్విట్జర్లాండ్‌ దేశపు జాతీయ జెండాలోని ఎర్రని బ్యాక్‌గ్రౌండ్‌లో తెల్లని క్రాస్‌ ఉంటుంది. దానిని తారుమారు చేసి తెల్లని బ్యాగ్‌డ్రాప్‌లో ఎర్రని క్రాస్‌ను లోగోగా ఏర్పరిచాడు. 8-5-1812న జన్మించిన హెన్రీ డునాంట్ గౌరవార్థం ప్రతి సంవత్సరం మే 8 న ప్రపంచవ్యాప్తంగా రెడ్‌ క్రాస్‌ దినోత్సవం జరపాలని 1938 సంవత్సరంలో నిర్ణయించారు. కాని మొదటి సారిగా రెడ్ క్రాస్ దినోత్సవాన్ని 1948 లో జరుపుకున్నారు.అంతర్జాతీయ స్థాయిలో మే 8 న ఏర్పాటైన ఈ రెడ్ క్రాస్ సంస్థ ఇప్పుడు దాదాపు అన్నిరకాల సేవా కార్యకలాపాలను నిర్వహిస్తోంది
బాల కార్మిక వ్యతిరేక దినం: జూన్ 12
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 2002లో ప్రారంభించారు. బాల కార్మిక దుస్థితిని వెలుగులోకి తెచ్చారు. బాలలను బాల కార్మిక వ్యవస్థకు దూరంగా వుంచేందుకు, వారిని దానినుండి బయటకు తెచ్చేందుకు, సామాజిక భద్రత పాత్రపట్ల అందరి దృష్టీ కేంద్రీకరింప చేయడానికి ఈ దినోత్సవాన్ని జరుపుతారు. బాల కార్మిక వ్యవస్థ అంటే ఆర్థిక కార్యకలాపాల్లో బాలలను పార్ట్‌టైం లేదా ఫుల్‌ టైం పనులకు పంపడం, బలవంతంగా బాలలని ఎక్కువగా పనులలో ప్రవేశపెట్టడం లాంటివి. దీని వల్ల వయోజనుల వేతనాలు తగ్గడం, బాలలకు విద్యను దూరంచేయడం జరుగుతుంది. భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థను ఒక తీవ్రమైన, అపరిమితమైన సంక్లిష్ట సామాజిక సమస్యగా గుర్తిస్తున్నారు. జనాభా లెక్కల ప్రకారం 1991లో 1 కోటి 13 లక్షలు ఉన్న బాలకార్మికుల సంఖ్య 2001 నాటికి 1 కోటి 27 లక్షలకు పెరిగింది. ప్రమాదకరమైన వాతావరణాల్లో పనిచేయడం, బానిసలుగా లేదా బలవంతపు చాకిరీ చేయడం, ద్రవ్యాల అక్రమ రవాణాకి, వ్యభిచారం వంటి చట్ట విరుద్ధమైన పనులలో నియమించబడటం లాంటివి నుండి రక్షించేందుకు ఈ దినోత్సవాన్ని గుర్తుగా జరుపుకుంటారు.
బాలికల దినోత్సవం: అక్టోబర్ 11
డిసెంబర్ 19 2011 న ఐక్యరాజ్యసమితి వారు అంతర్జాతీయ దినోత్సవాన్ని అక్టోబర్ 11 2012 న జరుపుకోవాలని తీర్మానించారు. బాలికల మీద జరుగుతున్నఅత్యాచారాలను, అనర్థాలను ఆపేందుకు, బాలికల హక్కులను తెలియజేసేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అబ్బాయిలతో పోలిస్తే ఆడపిల్లలు తక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిసినా కూడా, కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే పురిట్లోనే చంపేస్తున్నారు. భవిష్యత్తులో అమ్మాయిలు అబ్బాయిలతో సమాన స్థాయిలో రావాలంటే భ్రూణహత్యలను అరికట్టాలని తెలియజేస్తారు. బాలికలకు ప్రపంచవ్యాప్తంగా మరింత అవకాశాలు, వారు ఎదుర్కొంటున్న లింగ అసమానత మీద అవగాహనను పెంచుతుంది.
మానవ హక్కుల దినోత్సవం: డిసెంబరు 10
ప్రతి మనిషి మనిషిగా జీవించడానికి కొన్ని హక్కులు ఉండాలి. ఇందులో జాతి, భాష, కుల, మతాలకతీతంగా మనిషిగా జీవించే హక్కు కలిగి ఉండడమే అంతర్జాతీయ హక్కుల దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యం. క్రీ.శ.1215 లో ఇంగ్లండ్ అప్పటి రాజు జాన్ విడుదల చేసిన 'మాగ్నా కార్టా' మొట్ట మొదట మానవ హక్కుల ప్రకటనగా భావించవచ్చు."న్యాయబద్దమైన తీర్పు ద్వారా తప్ప మరేవిదమైన పద్దతులలోనూ పౌరుల స్వేచ్చను బందీ చేయడం బహిష్కరించడం నిషేదం" అంటూ మాగ్నా కార్టా స్పష్టం చేసింది. ప్రపంచ విప్లవాలకు ఇది నాంది ప్రస్థావనగా భావించవచ్చు.
అలాంటి మానవ హక్కుల దినాన్ని 10.12.1948 న ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అప్పటినుండి ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 10వ తేదీ ని అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మన దేశంలో 1993 లో రూపొందిన మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1994 జనవరి 8 నుండి అమలులోకి వచ్చింది. భారత రాజ్యంగం లోని హక్కులన్నీ దీని నుంచే వచ్చినవి. వివక్షత లేనటువంటి మానవ సమాజ నిర్మాణమే ఈ అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ లక్ష్యం.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం: ఫిబ్రవరి 21
శాంతి, బహుభాషా సంస్కృతిని ప్రోత్సహించడానికి 2000 వ సంవత్సరము నుండి మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1952 వ సంవత్సరంలో ఇదే రోజున ఢాకా విశ్వవిద్యాలయం, ఢాకా వైద్య కళాశాల విద్యార్థులు బంగ్లా భాషను పశ్చిమ పాకిస్తాన్ జాతీయ భాషగా గుర్తించాలని చేసిన పోరాటంపై పోలీసు కాల్చిన కాల్పుల్లో ఢాకా హైకోర్టు సమీపాన రక్తార్పణం చేశారు. నవంబర్ 1999 సంవత్సరంలో UNESCO జనరల్ కాన్ఫరెన్స్ ఈ రోజును అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. 2009, మే 16 వ తేదీని భాషల అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటిస్తూ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రపంచంలో ప్రజలు ఎన్ని భాషలలో మాట్లాడుతున్నారో అన్ని భాషలను రక్షించాలి, భద్రపరచాలని తీర్మానం చేసింది.
మాతృమూర్తి దినోత్సవం :
ఈ సృష్టిలో అమ్మ కన్నా గొప్పది ఇంకేమి లేదు. అసలు అమ్మ అనేవారు లేకపోతే ఈ సృష్టే లేదు.

మదర్స్ డే (మాతృమూర్తి దినోత్సవం) అనేది సాధారణంగా మాతృత్వం మరియు వివాహ బంధాలకు గుర్తుగా మరియు తల్లులు సమాజానికి చేసిన ప్రత్యక్ష సేవలను గుర్తించేందుకు జరుపుకుంటారు. మదర్ ఆఫ్ ద గాడ్స్ రియాకు నివాళులర్పించే కార్యక్రమానికి మొదటసారిగా గ్రీసు దేశస్తులు శ్రీకారం చుట్టారు. ఇంగ్లాండులో తల్లుల గౌరవార్థం 'మదరింగ్ సండే' ని నిర్వహించేవారు. యు.ఎస్. లో మదర్స్ డే వ్యవస్థాపకురాలిగా " అన్నా జార్విస్ " ను గుర్తించారు . తల్లులందరి గౌరవార్ధం కోసం కస్టపడి పనిచేసిన వనితగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె తన తల్లి "అన్నా మేరీ రీవేస్ జార్విస్ " నుంచి తన బాల్యంలోనే మదర్స్ డే సెలబ్రేషన్ స్పూర్తి పొందారు. ఆ తల్లికి కుమార్తె గా అన్నా జార్విస్ అమ్మ మాటల్ని ఏనాడూ విస్మరించలేదు . 1905 లో తన తల్లి మరణించినప్పుడు మదర్స్ డే నిర్వహించాలన్న తన తల్లి కోరికను నెరవేర్చాలని తీర్మానించుకున్నారు. ఆ విధంగా ఈమె ఎన్నోవిధాలుగా మదర్స్ డే కోసం కష్టపడ్డారు. 1910 లో జర్విస్ జ్ఞాపకార్థం యు ఎన్ ఏ లోని వర్జీనియా రాష్టం మదర్స్ డే ని గుర్తించింది. జార్విస్ కుమార్తె దీనికోసం బాగా ప్రచారం చేశారు. 1914 లో మదర్స్ డే ని అధికారంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా మదర్స్ డే ను మే రెండో ఆదివారం జరుపుకొంటున్నారు. ఇప్పుడు ఈ మదర్స్ డే ని అమెరికాతో పాటు ఇండియా, ఇంగ్లండ్, డెన్మార్క్, ఫిన్ల్యాండ్, ఇటలీ, టర్కీ, ఆస్ట్రేలియా, మెక్షికో, కెనడా, చైనా, జపాన్, బెల్జియం , వంటి అనేక దేశాలు జరుపుకుంటున్నాయి.
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం: మార్చి 15


ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 15 న జరుపుకుంటారు. మార్చి 15,1962 లో అధ్యక్షుడు జాన్. ఎఫ్ కెన్నడి వినియోగదారుల సమస్యను గుర్తించి, ఉద్యమం చేపట్టిన తొలి నాయకుడిగా నిలిచారు. కెన్నడి ఉద్దేశాన్ని పరిగణనలో తీసుకొని వినియోగదారుల హక్కుల బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతి యేటా మార్చి 15 న వినియోగదారుల హక్కుల గురించి అవగాహన పెంచడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. వినియోగదారులు మోసపోకుండా ఉండడానికి అందరిలో చైతన్యం కలిగించడానికి ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం ద్వారా వినియోగదారులను ఎలా రక్షించాలో, రక్షణను ఎలా పొందాలో తెలుస్తుంది. ఈ చట్టం అమలు కోసం మూడు వ్యవస్థలు ఏర్పాటు చేసారు. ఒకటి జిల్లా ఫోరం, రెండోది రాష్ట కమిషన్, మూడోది కేంద్ర కమిషన్. వినియోగదారులకు నష్టం కలిగిందని భావిస్తే వీరికి ఫిర్యాదు చేయాలి. ఇలాంటి అంశాలపై వినియోగదారుల దినోత్సవం రోజున అవగాహన పెంచుతారు.

కుమారి ఎ. ప్రశాంతి, విద్యార్ధి, ఐ.డి.నెం: హెచ్.హెచ్.2012/047
సమీక్ష: డాక్టర్ ఎ. మేరి స్వర్ణలత, ప్రొఫెసర్ & హెడ్, విస్తరణ మరియు ప్రసార నిర్వహణ విభాగము.

Download File

Rating :2.91 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4