అభ్యుదయం

ఉపాధ్యాయ దినోత్సవం

భారత ద్వితీయ రాష్టపతిగా అద్వితీయంగా పదవీ బాధ్యతలను నిర్వహించిన డాక్టర్ సర్వేపల్లి రాధా క్రిష్ణన్ జన్మ దినం అయిన సెప్టెంబరు 5 వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని భారతదేశంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. 1962 నుండి 1967 వరకు దేశాధ్యక్షుడిగా పని చేసిన  ఆయన ప్రారంభంలో ఉపాధ్యాయుడు. స్వయంగా ఉపాధ్యాయుడైన ఆయన విద్య మీద అపార నమ్మకం గలవాడు, విద్యాధికులు మాత్రమే దేశ సౌభాగ్యానికి చుక్కానులని ఆయన విశ్వసించేవారు. వాస్తవానికి ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5న జరపవలసిందిగా కోరింది ఆయనే. తన పుట్టిన రోజునాడు తనని అభినందించడానికి వచ్చిన తన అభిమానులను ఆయన ఈ రోజు నన్ను అభినందించడంకంటే ఉపాధ్యాయులను అభినందించడం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందనడంతో ఆ రోజు నుంచి ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాధాకృష్ణన్ పుట్టిన రోజునాడు నిర్వహించడం జరుగుతున్నది.

పాఠశాలలు యధావిధంగా తెరచి ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ రోజున ఉపాధ్యాయులకు జాతీయ రాష్ట్రీయ మరియు జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి. పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమో గానీ ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండదు. ఉపాధ్యాయుడంటే పాఠశాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వ్యక్తే కానక్కర్లేదు బ్రతుకుతెరపు కోసం పాఠాలు చెప్పుకునే ప్రతివ్యక్తి ఉపాధ్యాయుడే, బ్రతుకు మార్గాన్ని విద్యా బోధన ద్వారా చూపించే ఉద్యోగస్తుడు కూడా ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు ఎక్కడివాడైనా ఆయన స్థానం అత్యుత్తమమైనది. అదృష్టవశాత్తూ సంప్రదాయాలకు పెద్ద పీట వేసే దేశంలో ఉపాధ్యాయుడికి ఉన్నత స్థానమే ఉంది.  ప్రపంచవ్యాప్తంగా గొప్పవారైన వారిలో అనేకమంది తమ గొప్పతనాన్ని తమ గురువులకు ఆపాదించడం మనం చూస్తూనే ఉన్నాం.

"మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ" అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. "గురువు" అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. "గు" అంటే చీకటి, "రు" అంటే తొలగించు అని అర్ధం. అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. "గు" అంటే గుప్తమైనది, తెలియనిది అని, "రు" అంటే దానిని రుచ్యము చేసేది-అంటే రహస్యమైన దానిని తెలియపరిచేది అనికూడా అర్థం. ప్రేమ, ఆప్యాయతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్ధుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం. విద్యార్ధి చేసే ప్రతి ప్రయత్నానికీ గురువు ఆశీస్సులు ఉంటాయి, ఉత్సాహ ప్రోత్సాహాలుంటాయి. గురువు నుంచి వాటిని పొందడం ముందుగా విద్యార్ధి కర్తవ్యం. అది అతని బాధ్యత కూడా. ఈ వాస్తవాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పడం వారి బాధ్యత. ఒక కుటుంబంలాంటి సమాజంలో ఎవరు ఏ బాధ్యతను నిర్వహిస్తున్నా గురువు నిర్వహించే బాధ్యత సాటిలేనిది. దేనితోనూ పోల్చడానికి వీలులేనిది. ఎందుకంటే గురువు జీవితాన్నిమారుస్తాడు. ఒక తల్లి లేదా తండ్రి తమ తమ కుటుంబాలపై ప్రభావం చూపవచ్చు. కాని ఒక గురువు బాధ్యత ఆ సమాజం పైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గురువు జాతీయ నిర్మాణకర్త కాబట్టి కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటాడు.

కుమారి బి.పావని, విద్యార్థి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2013/041.

Download File

Rating :2.43 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4