అభ్యుదయం

ప్రపంచ మధుమేహ దినం (నవంబర్ 14)

1922లో ఇన్సులిన్ హార్మోన్‌ను కనుగొన్న ఫ్రెడరిక్ బేంటింగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న మధుమేహ దినంగా పాటిస్తున్నారు. 2006 డిసెంబర్ 20న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం ప్రకారం మధుమేహ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఆందోళనకర దీర్ఘకాలిక వ్యాధి కాబట్టి 2007నుండి మధుమేహదినాన్ని ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచే కార్యక్రమాలతో సభ్యదేశాలన్నీ అధికారికంగా జరపాలని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది. డయాబెటీస్ ఎలా వస్తుంది, దానివలన వచ్చే ముప్పు ఏమిటి, రాకుండా ఏమి చేయాలి, వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను ప్రచారము చేసే ప్రయత్నమే ఈ డయాబెటిక్ డే ముఖ్య ఉద్దేశo.
అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య ఈ వ్యాధికి సంబంధించి 2009 నుండి 2013వరకూ ఐదేళ్ల కాలానికి 'మధుమేహ విద్య -నివారణ' అన్న అంశాన్ని ప్రకటించింది. అందులో భాగంగా 'ఈ క్షణమే మనం మధుమేహాన్ని నియంత్రించుకుందాం' అన్న ప్రచార నినాదాన్ని ప్రకటించింది.

ప్రపంచ మధుమేహ రాజధానిగా భారత్ మారిపోయింది. భారత్‌లోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఈ వ్యాధి మరింత అధికంగా ఉంది. మధుమేహం కారణంగా ప్రతీ నిమిషానికి ఆరుగురు మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 20 మరణాల్లో ఒకటి మధుమేహం కారణంగానే చోటు చేసుకుంటున్నది.

తీసుకోవలసిన జాగ్రత్తలు
చక్కెర వ్యాధిగ్రస్తులు ఆ జబ్బు గురించి అవగాహన పెంచుకోవాలి. ఇతర రోగులతో కలిసి తమకు తెలిసిన విషయాలను మిగిలిన వారితో పంచుకోవాలి. పాదాలు, మూత్ర పిండాలు, గుండె, నరాలు మొదలైన అవయవాలపై ఈవ్యాధి ప్రభావం ఎలా ఉంటుందో వీరు తెలుసుకోవాలి.

 • రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. తద్వారా శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి.
 • భోజనానికి అరగంట ముందు మాత్రలు వేసుకోవాలి. వాటిని ప్రతిరోజూ సరియైన సమయంలోనే వేసుకోవాలి. సమయపాలన లేకపోతే మందులు వేసుకుంటున్నా శరీరంలో ఒక అపసవ్య స్థితి ఏర్పడుతుంది.
 • ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి.
 • ఇన్సులిన్ వేసుకోవడంలోనూ కాలనియమాన్ని పాటించాలి.
 • మధుమేహంలో కాళ్లల్లో స్పర్శజ్ఞానం పోయిందన్న విషయం చాలాకాలం వరకు తెలియదు. అందుకే వారు ఏటా ఒకసారి పాదాల్లో స్పర్శ ఎలా ఉందో తెలుసుకోవాలి. స్పర్శ లేకపోతే ప్రతి ఆరుమాసాలకు వీలైతే మూడు మాసాలకు ఒకసారి పరీక్ష చేయించాలి.
 • పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, ఆనెలు ఏమైనా ఉన్నాయేమో గమనించాలి. డాక్టర్ సమక్షంలో అవసరమైన చికిత్స తీసుకోవాలి.
 • గోళ్లు తీసే సమయంలో ఎక్కడా గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను ప్రతి రోజూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
 • ఇన్‌ఫెక్షన్లతో కాళ్లకు చీము పడితే చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. డాక్టర్ సలహాతో యాంటీబయాటిక్స్, అవసరమైతే ఇన్సులిన్ తీసుకోవాలి.
 • అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పరీక్షలు, అలాగే కళ్లు, కిడ్నీ పరీక్షలు కూడా డాక్టర్ సలహా మేరకు చేయించుకోవాలి.
 • మధుమేహం ఉన్న వారికి మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల మూత్రంలో ఆల్బుమిన్ అనే ప్రొటీన్ విసర్జించబడుతుంది. అంతిమంగా ఇది కిడ్నీ దెబ్బతినడానికి దారి తీస్తుంది. అందుకే ప్రతి మూడు మాసాలకు, ఆరు మాసాలకు పరీక్ష చేసి మూత్రంలో ఆల్బుమిన్ ఉందా లేదా కనుగొనాలి.
 • మధుమేహం ఉన్న వారిలో గుండె కండరాలకు రక్తాన్ని తీసుకొనిపోయే కరొనరీ రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే గుండె నొప్పి ఉన్నా లేకపోయినా ప్రతి ఏటా ఇసిజి, ట్రెడ్‌మిల్ పరీక్షలు చేయించుకోవడం అవసరం. అలాగే కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తెలిపే లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించాలి.
 • ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.

మానుకోవలసిన అలవాట్లు

 • తీపి పదార్థాలు, ఐస్‌క్రీములు మానుకోవాలి. అతి పరిమితంగా తీసుకున్నప్పుడు అయితే, ఆరోజు మామూలుగా తీసుకునే ఆహార పదార్థాల మోతాదును బాగా తగ్గించాలి. అలాగే నూనె పదార్థాలు కూడా బాగా తగ్గించాలి.
 • కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శరీరంలో చక్కెర శాతం హఠాత్తుగా పెరిగిపోవచ్చు. అప్పుడు మాత్రలు ఆ స్థితిని అదుపు చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు డాక్టర్ సూచిస్తే ఇన్సులిన్ తీసుకోవాలి. ఆ తరువాత చక్కెర అదుపులోకి వచ్చాక మళ్లీ మాత్రలకే పరిమితం కావచ్చు. ఒకసారి ఇన్సులిన్ తీసుకుంటే జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవలసి వస్తుందన్నది సరికాదు. ఆ కారణంగా ఇన్సులిన్ తీసుకోవడానికి వెనుకాడకూడదు.
 • పాదరక్షలు లేకుండా నడవకూడదు.
 • పొగతాగడం పూర్తిగా మానుకోవాలి.
 • మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి.

కుమారి బి. సుభాషిని, విద్యార్థి, ఐ.డి.నెం: హెచ్.హెచ్. 2013/127.
 

Download File

Rating :3.23 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4