బాలలు అభివృద్ధి

ప్రవర్తనా లోపాలు

సాధారణంగా పిల్లల్లో కనిపించే  ప్రవర్తనా లోపాలు :
పిల్లలు మామూలుగా ప్రవర్తించే తీరుకు విరుద్ధముగా ప్రవతించడమును ప్రవర్తనలోపం/ఇబ్బందికరమైన ప్రవర్తన అంటారు. ఇలాంటి ప్రవర్తనా లోపాలవల్ల తమకు మరియు ఇతరులకు(తల్లిదండ్రులకు) ఇబ్బంది కలుగుతుంది. సాధారణంగా కొన్ని ప్రవర్తనాలోపాలు చిన్న వయస్సులో ఉండి వయసు పెరిగేకొద్దీ తగ్గిపోతాయి. ఉదాహరణకు పక్కతడపడం(bedwetting), వేళ్ళు నోట్లో పెట్టుకోవడం(thumb sucking).
పిల్లల్లో ప్రవర్తన లోపాలకు గల కారణాలు :
1. తల్లిదండ్రుల తీరు, ప్రవర్తన:
తల్లిదండ్రులు పిల్లలను ద్వేషించినట్లు ప్రవర్తించడం, గొడవపడటం, తిరస్కరించడం, అతిగా డిమాండ్ చేయడం, పిల్లల మధ్య భేదం చూపించడం, అతిజాగ్రత్తగా ఉండటం, అతి ప్రేమ చూపడం వల్ల ఇవన్నీ పిల్లల్లో ప్రవర్తనాలోపాలకు దారితీస్తాయి. మరియు పిల్లలకు సంబంధించిన విషయాల్లో తల్లిదడ్రులు తరచూ గొడవపడటం, పిల్లలముందే గొడవపడటం వల్ల పిల్లల్లోఆతురత(anxiety), పక్కతడపడం(bedwetting) వంటి ప్రవర్తన లోపాలు కనిపిస్తాయి.

2. శారీరక సంబంధమైన లోపాలు: (physiological causes)
శారీరక సంబంధమైన లోపాలు చెవులు వినబడకపోవడం(deaf), చాలా పొడవుగా ఉండటం, మొర్రి పెదవి, తొర్రి ఉండటం. ఇటువంటి పిల్లలు అధికంగా మాట్లాడటం, పొగరుబోతుతనం, పనులు ఆలస్యంగా చేయడం, అతిగా భయపడటం, దొంగిలించడం వంటి పనులు చేస్తూ ఇతరుల శ్రద్ధ తమపై ఉండాలని ప్రవర్తిస్తారు. ఈ శారీరక సంబంధమైన లోపాలు పిల్లల్ని మామూలు పిల్లల్లాగా ఆడుకోవటానికి ఆటంకపరుస్తాయి. అందువల్ల పిల్లలు తల్లిదండ్రులు/ఇతర కుటుంబ సభ్యులను బెదిరించడం, తొదరపెట్టడం, హింసించడం వంటివి చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో పోషకాహారలోపం వల్ల రక్తంలో కొన్ని రసాయనాల వల్ల పిల్లలు చికాకుగా, కోపంగా ప్రవర్తిస్తారు.
3. అభద్రతా భావంతో ఉండటం:
తల్లిదండ్రులు పిల్లలపై తగినంత ప్రేమ చూపకపోవడం వల్ల, తరచు శిక్షించడం(దండించడం) వంటి ప్రవర్తన వల్ల పిల్లల్లో అభద్రతా భావం కలుగుతుంది. ఇలాంటి పిల్లలు దొంగిలించడం, కోపంగా ప్రవర్తించడం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ తల్లిదండ్రులపైన ఇతర కుటుంబ సభ్యులపైన ప్రతీకారం తీర్చుకుంటారు. మరియు కొన్ని సంధర్భాల్లో వేళ్ళు నోట్లో పెట్టుకోవడం, గోళ్ళు కొరకడం వంటివి చేస్తుంటారు. తల్లిదండ్రులు తరచూ పిల్లల ముందు గొడవ పెట్టుకోవడం వల్ల వారిలో అబధ్రతాభావం పెరుగుతుంది. 
4. మార్గదర్శకత సరిగా లేకపోవడం:
పిల్లలు తరచు తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యులను అనుకరిస్తూ ఉంటారు. ఏవైనా ప్రవర్తనాలోపాలను తల్లిదండ్రులుగాని ఇతర కుటుంబసభ్యులుగాని కనబరిచినప్పుడు పిల్లలు కూడా అలా ప్రవర్తిస్తారు.
5. పూర్వ అనుభవాలు:
ఫ్రాయిడ్(Freud) అనే మనస్తత్వ శాస్త్రవేత్త  ప్రకారం కొన్ని ప్రవర్తన లోపాలు అంటే భయపడటం, ప్రక్కతడపటం వంటి ప్రవర్తనలు చిన్న వయస్సులో కొన్ని సంఘటనల వల్ల పూర్వ అనుభవాలవల్ల జరుగుతాయి.
పిల్లల్లో సాధారణంగా కనిపించే ప్రవర్తన లోపాలు, ఇబ్బందికరమైన ప్రవర్తనలు, తీసుకోవలసిన జాగ్రత్తలు

ప్రవర్తన లోపాలు/ఇబ్బందికరమైన ప్రవర్తనలు

పిల్లలు ప్రవర్తించే తీరుకు అర్ధం

చేయకూడనివి

చేయవలసినవి

1. ఇతర పిల్లలను గాయపరచడం

కోపం రావడం, సమస్యాత్మక భావాలు

చీవాట్లు పెట్టడం, గాయపరచడం, కోపంగాప్రవర్తించడం.

బిడ్డను అక్కడినుండి తీసుకువచ్చి వారి చేతిలో ఏమైనా గాయపరిచే వస్తువులు ఉంటే వాటిని బిడ్డకు దూరంగా ఉంచాలి. బిడ్డ సంతోషంగా ఆడుకునే ఏర్పాటు చేయాలి. కోపపడకుండా ప్రేమతో నచ్చచెప్పాలి.

2. వస్తువులను పగలగొట్టడం

అసూయ, ఆతురత, విసుగు, అత్యుత్సాహం

తిట్టడం, చీవాట్లు పెట్టడం, కేకలు వేయడం, శిక్షించడం.

పగిలే వస్తువులను దూరంగా ఉంచాలి. బిడ్డ ఆడుకోవడానికి అనువైన ప్రదేశం కల్పించాలి. బిడ్డను క్రొత్త ప్రదేశాలకు తీసుకెళ్ళాలి. బిడ్డ ఆడుకోవడానికి కొన్ని వస్తువులను ఏర్పాటు చేయాలి. మరియు ఎటువంటి పనులు చేయాలో చేయకూడదో చెప్పాలి.

3. చెడు మాటలు మాట్లాడటం

ఇతరులను అనుకరించడం, ఇతరుల(ఏకాగ్రత)దృష్టి తన మీద ఉండాలని ప్రయత్నించడం.

అసహనంతో ఉండటం, చికాకుగా ఉండటం, చీవాట్లు పెట్టడం, శిక్షించడం పదే పదే విసిగించడం.

పిల్లలు అన్న మాటలను అర్ధం చేసుకొని, అటువంటి మాటలు అనకూడదు అని నెమ్మదిగా చెప్పాలి. పిల్లలకు రైమింగ్ పదాలను, ప్రాసతో కూడిన పదాలను నేర్పించడం చేయాలి.(ఉదాహరణకు అల, వల, కల, పలక, అలక)

4. ఇతరులతో ఇచ్చి పుచ్చుకోని తత్వం(భాగ స్వామ్యం లేకపోవడం)

చిన్నప్రాయం అవ్వటం వల్ల ఇతరులకు ఇవ్వడం, తీసుకోవడం వంటివి తెలియకపోవడం.

చీవాట్లు పెట్టడం,గాయపరచడం,అతని దగ్గర నుండి బలవంతంగా తీసుకోవడం లేదా దొంగిలించడం

బిడ్డకు (ఇతరులతో పంచుకోవడం),ఇతరులకు ఇవ్వడం అంటే ఇష్టపడే విధంగా అర్ధమయ్యే విధంగా నచ్చచెప్పాలి. మరియు సొంత వస్తువులను గురించి తెలియజేయాలి. బిడ్డకు భద్రతా భావం కలుగచేయాలి.

5. బ్రొటన వేలు నోట్లో పెట్టుకోవడం

విసుగు చెందడం,ఆకలి వేయడం,బిడ్డ తన మీద ప్రేమ చూపాలనుకోవడం.

శిక్షించడం,చీవాట్లు పెట్టడం, వేళ్ళను కట్టి వేయడం, వేళ్ళకు చేదుగా ఉన్న పధార్ధం రాయడం

వేళ్ళు నోట్లో పెట్టుకున్నప్పుడు తనమీద శ్రద్ధ, ప్రేమ తగ్గిపోయిందని అభద్రతా భావం కలిగి ఉన్నాడని అర్ధం చేసుకుని తగినట్లు అతనికి ప్రేమ, వాత్సల్యం చూపాలి.

6. పక్కతడపడం

భయం, అభద్రతాభావం,బిడ్డకు మూత్ర విసర్జనలో శిక్షణ లేకపోవడం

చీవాట్లు పెట్టడం, పెద్దగా అరవడం, బలవంతంగా మూత్ర విసర్జనకు వచ్చినప్పుడు తెలియజేయాలని చెప్పడం

బిడ్డ ఎదిగిన కొద్దీ మూత్ర విసర్జనకు వెళ్ళడం అలవాటు చేసుకుంటుందని అర్ధం చేసుకోవాలి. బిడ్డకు తగినంత స్వేచ్చను ఇవ్వాలి. స్వతంత్రంగా పెరగడానికి పరిస్థితులు కల్పించాలి.

7. తనపై శ్రద్ధ చూపాలని డిమాండ్ చేయడం

విసుగు అభద్రతాభావం,తనమీద శ్రద్ధ చూపాలనుకోవడం,ప్రేమగా చూడాలనుకోవడం

చీవాట్లు పెట్టడం,తిట్టడం,అవమాన పడేటట్లుగా మాట్లాడటం,ఎగతాళి చేయడం,కావాలని నిర్లక్ష్యం చేయడం,మిగతావారినుండి వేరు చేయడం.

బిడ్డ పై శ్రద్ధ చూపడం, ఒక వ్యక్తిగా ఆసక్తి చూపడం, ఆసక్తికరమైన పనులు చేయడానికి ప్రోత్సహించడం, ఆటలలో పాలుపంచుకోవడం.

8. భయపడటం

గతంలో భాద కలిగించిన అనుభవాలు, ప్రేమగా చూడట్లేదనుకోవడం, తల్లిదండ్రులు దగ్గరగా ఉండాలనుకోవడం

బలవంతంగా ఎందుకు బయపడుతున్నాడో అని కారణాలు అడగడం, సిగ్గుపడేలా కించపరిచేలా మాట్లాడటం.

పిల్లలకు భరోసా ఇచ్చేలా మాట్లాడాలి. బిడ్డ భయపడే పరిస్థితి, సంఘటనలను సంతోషంగల సంఘటనలుగా మార్చండి. నిజమైన ప్రమాదకరమైన సంఘటనలు అంటే ఏమిటో దానికి కారణాలు భోదించండి, తనకు తాను ఎలా ధైర్యంగా ఉండాలో చెప్పండి.

9. దొంగిలించడం

అవసరాలు తీరకపోవడం, ఆకలి వేయడం, అనుకరించడం, తిరగపడటం.

చీవాట్లు పెట్టడం, ప్రేమగా చూడకపోవడం, ఇతరులముందు అవమానించడం, తిరస్కరించడం.

వారికి సొంత వస్తువులకు, ఇతర వస్తువులకు తేడాలు చెప్పడం వారి అవసరాలు తీర్చుకునే విధంగా సంపాదించుకునేలా చేయడం. బిడ్డ పట్ల కఠినంగా ఉండకుండా ప్రేమగా ఉండటం. వారికి ఆసక్తి ఉన్న సృజనాత్మక అలవాట్లు పెంపొందించుకునేలా చేయటం. మంచి స్నేహితులయ్యే విధంగా సహకరించటం.

10. అబద్ధాలు చెప్పడం

అనుకరించడం, గొప్పల కోసం, శిక్షకు (దండనకు)భయపడటం

చీవాట్లు పెట్టడం, తిట్టడం, తిరస్కరించడం, క్షమాపణ చెప్పమని అడగడం, చింతించే విధంగా చేయడం.

వారిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం.

11. ఇంట్లోనుండి పారిపోవడం

విసుగు, కోపం, స్వతంత్రంగా ఉండాలనుకోవడం, తిరగబడటం

ఏడిపించడం, దండించడం, పదే పదే ఇంట్లో నుండి ఎందుకు పారిపోయాడో అడగడం

అతడు ఎక్కడ ఉన్నాడో కనుగొని అతడు పారిపోవడానికి కారణాలు అడగండి, అతనికి ఇంట్లోని కొన్ని విషయాలపై బాధ్యత అప్పగించండి, అతన్ని ఆకర్షించే ప్రత్యామ్నాయాలు కనుగొనండి. క్రమేణ అతనిపై ఉన్న పరిమితులు(restrictions) కొన్ని తొలగించండి.

12. తినడానికి ఇష్టపడకపోవడం

ఆకలి లేకపోవడం, ఆహారం నచ్చకపోవడం, అస్వస్థతగా ఉండటం

బలవంతంగా తినిపించడం, పెద్ద సంఘటనగా చేయడం, తింటే ఏదైనా బహుమతి ఇస్తానని చెప్పడం.

మామూలుగా ప్రశాంతంగా ఉండటం, క్రొత్త క్రొత్త ఆహార పదార్ధాలను అలవాటు చేయడం, తనకు ఇష్టమైన ఆహార పదార్ధాలు ఇవ్వడం.

13. సమయంకు నిద్రపోకపోవడం
 

నిద్ర రాకపోవడం, తనపై శ్రద్ధ చూపాలని కోరుకోవడం,అసౌకర్యంగా ఉండటం, ఆసక్తి, కుతూహలం లేకపోవడం

చీవాట్లు పెట్టడం, తిట్టడం, భయపెట్టడం, ప్రతిఫలం ఇస్తానని చెప్పడం. 

బిడ్డను పడుకోబెట్టే ముందు అతనికి కొంత సమయం కేటాయించి, పడుకోబోయేముందు అతడు సరిగా తిన్నాడో, అతని అవసరాలు తీరాయో లేదో గమనించండి. ప్రేమగా అతన్ని బుజ్జగించి పడుకోపెట్టాలి.

 

 డాక్టర్ కె. మయూరి, ప్రొఫెసర్ & హెడ్, మానవ అభివృద్ధి & కుటుంబ అధ్యయన విభాగం.

Download File

Rating :2.69 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4