బాలలు అభివృద్ధి

తల్లి పాల ప్రాముఖ్యత

1. ఆకలి మరియు పేదరిక నిర్మూలన

మొదటి 6 నెలల కాలం కేవలం తల్లి పాలు ఇప్పించడం, అటు పిమ్మట 2 సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించడం వలన బిడ్డ ఎదుగుదలకు కావలసిన శక్తి మరియు విలువైన పోషకాలు లభిస్తాయి. దీనివలన పిల్లల ఆకలి తీరుతుంది మరియు కుపోషణ నివారించబడుతుంది. తల్లిపాలు ప్రకృతి సహజం. ప్రతి తల్లికీ సాధ్యం. పోతపాలు - పౌడర్ పాలు డబ్బుతో కూడుకున్నవి.

2. అందరికీ ప్రాథమిక విద్య

తల్లిపాలు మరియు పోషక విలువలతో కూడిన అదనపు ఆహారం వలన బిడ్డ శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుంది. చక్కటి మానసిక ఆరోగ్యంతో మేధోసంపత్తి పెరిగి పిల్లలు చక్కగా చదువుకోవడానికి, నేర్చుకోవడానికి దోహదపడి అందరికీ విద్య అనునది సునాయాసం అవుతుంది.

3. మహిళా సాధికారత మరియు లింగ సమానత్వం

ఆడపిల్లలకు ఆదరణ తగ్గుతున్న నేటి సమాజంలో తల్లిపాల ద్వారా మంచి పోషకాహారం ఎలాంటి లింగబేధం లేకుండా ఆడ/మగ పిల్లలకు సమానంగా అందుతుంది. కానీ ఇందులో కూడా దురదృష్టవశాత్తు అక్కడక్కడా ఆడపిల్లలకు తల్లిపాలు మరియు చక్కటి అదనపు ఆహారం ఇవ్వకపోవడం జరుగుతుంది. తల్లిపాలు అన్నది స్త్రీలకే సాధ్యం. అది వారి హక్కు కూడా. దీని ద్వారా మహిళలకు సాధికారత కలుగుతుంది. ఈ మహిళా హక్కును మరియు సాధికారతను ప్రభుత్వం మరియు సమాజం అన్నివిధాల ప్రోత్సహించవలసిన అవసరము ఎంతైనా ఉన్నది.

4. పిల్లల మరణాల తగ్గుదల

వివిధ అధ్యయనాల ప్రకారం బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించినట్లయితే నవజాత శిశువులకు ప్రాణాపాయమైన అంటు వ్యాధుల నుంచి రక్షణ, 6 నెలల కాలము కేవలము తల్లిపాలు ఇవ్వడం వలన సంవత్సరంలోపు పిల్లల మరణాలకు ప్రధానకారణమైన నీళ్ళ విరేచనాలు మరియు శ్వాసకోశ వ్యాధులనుండి రక్షణ కలుగును. 2008 వ సంవత్సరంలో వెలువడిన తల్లీ పిల్లల కుపోషణ పై జరిగిన ల్యాన్ సెట్ అధ్యయనం ప్రకారం కూడా మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు వలన పిల్లల ఆరోగ్యాభివృద్ధి జరుగుతుందని తెలియజేయబడుతుంది.

5. తల్లుల ఆరోగ్యం పెంపొందించుట

తల్లిపాలు ఇవ్వడం వలన ప్రసవానంతర రక్తస్రావం, రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్, ఎముకల బలహీనత మొదలగు జబ్బుల నుండి తల్లికి రక్షణ కలుగును. దీనితోపాటు కలిగే సహజ గర్భనిరోధక శక్తి వలన వెనువెంటనే గర్భం దాల్చకుండా కూడా తల్లులకు రక్షణ కలుగుతుంది.

6. హెచ్.ఐ.వి./ఎయిడ్స్, మలేరియా మొదలగు జబ్బుల నుండి రక్షణ

తల్లిపాల ద్వారా బిడ్డకు వ్యాధినిరోధక శక్తి సంక్రమించి వివిధ జబ్బులనుండి పిల్లలకు రక్షణ కలుగును. హెచ్.ఐ.వి. మందులు వాడుకుంటూ పిల్లలకు కూడా హెచ్.ఐ.వి. మందులు ఇప్పిస్తూ మొదటి 6 నెలల కాలం కేవలం తల్లిపాలు ఇచ్చినట్లయితే తల్లి నుంచి బిడ్డకు హెచ్.ఐ.వి. సంక్రమణ కూడా తగ్గుతుంది.

7. పర్యావరణ పరిరక్షణ.

ప్రకృతి సహజమైన తల్లిపాలవలన వాతావరణ కాలుష్య సమస్యే లేదు. తల్లిపాల ప్రత్యామ్నాయాలైన పోతపాలు, పాలపౌడర్ పరిశ్రమల ద్వారా పలువిధాలుగా వాతావరణ కాలుష్యం జరుగుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే.

8. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల పరస్పర సహకార అభివృద్ధి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి పోషకాహార పద్ధతులు (GSIYCF- Global Strategy for Infant and Young Child Feeding)అవలంభించుట ద్వారా వివిధ దేశాలు పలు రంగాలలో సహకరించుకొని అభివృద్ధి సాధించే అవకాశం ఉన్నది. దీనితోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1981వ సంవత్సరం తీసుకు వచ్చిన అంతర్జాతీయ తల్లిపాల ప్రత్యామ్నాయ చట్టాన్ని పలు దేశాలలోని పాల పౌడరు, ఇతర శిశు ఆహారముల పరిశ్రమ వారు విధిగా ఆచరించవలసిన అవసరం ఏర్పడుతుంది.  

 

డాక్టర్ కె. కేశవులు,
సి సి సి మెంబర్ - బి పి ఎన్ ఐ
బి పి ఎన్ ఐ ఎపి స్టేట్ రిప్రజెంటేటివ్.    
 

Download File

Rating :3.37 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4