బాలలు అభివృద్ధి

పిల్లల అభివృధ్ధిలో తల్లిదండ్రుల పాత్ర

ఈరోజుల్లో చాలా ఇళ్ళలో తల్లిదండ్రులు ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉద్యోగానికో, పనికో వెళ్ళి తీరికలేని సమయం గడుపుతున్నారు. సాయంత్రం ఇంటికి చేరిన తర్వాత మిగిలిన సమయాన్నిఇంటిపనులకూ, టీ.వీ. చూడడానికీ వెచ్చిస్తున్నారు. అలాగే ప్రొద్దున్నే బడికి వెళ్ళి సాయంత్రం ఇంటికి చేరిన పిల్లలు కూడా టీ.వీ. చూస్తూనో, సెల్ ఫోనుల్తో ఆడుకొంటూనో సమయాన్ని గడిపేస్తున్నారు.  దీనివలన తల్లిదండ్రులకూ పిల్లలకూ మద్య కొంత 'దూరం' ఏర్పడుతుంది. ఈదూరం భౌతికమైనదికాదు, శారీరకమైనది, మానసికమైనది. పక్కపక్కనే ఉంటూ, ఒకరినొకరు చూసుకొంటూ స్పందించని వస్తువులతో గడపడం వలన ఏర్పడుతుంది.

ఈ దూరంవలన

 • తల్లిదండ్రులూ, బిడ్డలూ తమ మద్య ప్రేమను అనుభవించడం లేదు. 
 • క్రమేణా 'నేనుఒంటరిని’ అనే భావన బిడ్డలలో కలుగుతుంది. అది అభద్రతా భావనకు దారి తీస్తుంది.

 • తల్లిదండ్రులు తమ బిడ్డలలో జరుగుతున్నపెరుగుదలను గ్రహించలేరు, అవసరాలను గుర్తించలేరు.
 • బాల్యం యొక్క తీయదనాన్ని, అనుభవాలనూ ఇరువురూ ఆనందించలేరు.
 • పిల్లలు తాము పగటి సమయంలో అనుభవించిన భావోద్వేగాలు అంటే - ఆనందం, దుఃఖం, భయం మొదలైనవి వ్యక్తపరచలేకపోవడం వలన అవి గుప్తంగా ఉండిపోయి భవిష్యత్తులో ప్రవర్తనా సమస్యలుగా మారవచ్చు. ఉదాహరణ: గోళ్లుకొరకడం, నోట్లో వేలు పెట్టుకొని చీకడం, పక్క తడపడం, కొట్టడం, అబద్దాలు చెప్పడం, దొంగతనం చేయడం, మొండితనం మొదలైనవి.
 • భార్య, భర్తా, పిల్లల మద్య అప్యాయతానురాగాలు క్రమేణా క్షీణించి యాంత్రికమైన జీవితం గడుపుతారు.    

 

తల్లిదండ్రులు తమ తమ పనులు చేసుకొంటూనే, వారి పిల్లలతో నాణ్యమైన సమయాన్ని ఎలా గడపవచ్చు? ఇలా గడపడం వలన అది వారి పిల్లల “సంపూర్ణాభివృద్ధి”కి ఎలా ఉపయోగపడుతుంది?

సంపూర్ణాభివృద్ధి అంటే పిల్లలలో శారీరకాభివృద్ధి (కండరాల సమన్వయం),  మానసికాభివృద్ధి (తెలివితేటలు),  సాంఘికాభివృద్ధి (సామాజిక అభివృద్ధి),  భాషాభివృద్ధి (భాషపై పట్టు),  నైతికవిలువలు (మంచిచెడులు),  సృజనాత్మకత – వీటన్నిటినీ పెంపొందించడం. 

మనిషి పుట్టినప్పటి నుండీ చనిపోయే వరకూ జరిగే మెదడు అభివృద్ధిలో ఎనభైశాతం అభివృద్ధి  దాదాపుగా  ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే జరుగుతుంది.  కనుక బాల్యంలో ఆహ్లాదకరమైన,  ఆరోగ్యవంతమైన పరిసరాలు, అనుభవాలూ ఎంతో ముఖ్యము. సంపూర్ణవికాసానికి అటు కుటుంబం మరియు పాఠశాల  రెండూ ప్రధాన పాత్ర వహించాలి.  ఏ కుటుంబంలో అయితే తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడుపుతూ వారి అభివృద్ధికి ఉత్ప్రేరణ కలిగిస్తారో అటువంటి కుటుంబాలలో పిల్లలు భద్రతా భావంతో పెరుగుతారనీ, భవిష్యత్తులో మంచి విజయాలు సాధిస్తారనీ చాలా పరిశోధనలలో తేలింది . 

ఎలాంటి కార్యక్రమాలు, ఆటలు ద్వారా పిల్లలకు సంపూర్ణవికాసాన్ని కలిగించవచ్చు?

A. శారీరక అభివృద్ధి అంటే శరీరంలో చిన్న,  పెద్ద కండరాల అబివృధ్ధి, కంటికీ చేతికీ మద్య సమన్వయం ఏర్పరచే కొన్ని ఆటలు,  పనులు చేయించడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు.  వారి పనులు వారు స్వతంత్రంగా చేసుకోవడానికీ, ఆటలు,  క్రీడల పోటీల్లో విజేతలవడానికీ శారీరకంగా అబివృధ్ధి చెందడం ఎంతో అవసరం.  అందుకోసం

 1. పిల్లలు రోజూ కొంతసేపైనా అన్నదమ్ములూ, అక్కచెల్లెల్లతో కానీ, ఒక్కరే ఉంటే చుట్టుప్రక్కల పిల్లలతో కానీ ఆడుకొనేలా  చూడాలి.

   
 2. శిశువులకు నడక వచ్చేటపుడు తోపుడు బండి, చక్రాల బండి వంటివి నడక నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి.
 3. నడక వచ్చిన పిల్లలకు పెద్దలు దగ్గర ఉండి మెట్లు ఎక్కడం దిగడం నేర్పించవచ్చు.
 4. ఫరిగెత్తడం, కుంటడం, గెంతడం వంటి పనులు పెద్దకండరాల అభివృద్ధికి ఉపయోగపడతాయి. 
 5. 3 సంవత్సరాల పిల్లలు మూడు చక్రాల  సైకిల్ తొక్కగలుగుతారు. ఇది వారి ఎముకలు, కండరాల అభివృద్ధికి మంచిది.

   
 6. చిన్న కండరాల అబివృద్ధికి కాగితాలు చింపడం, కత్తిరించడం,  బొమ్మలు వేయించడం వంటి పనులు చేయించవచ్చు. పిండితో బొమ్మలు చేయించవచ్చు – తల్లులు రొట్టెలు, చపాతీలు చేస్తున్నపుడు కొంత పిండి పిల్లలకు ఇచ్చి వారినీ చేయమనవచ్చు.    

B. సామాజిక అభివృద్ధి కోసం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. కాని ఇప్పుడు సంపాదన కోసం, నిత్యం పెరిగే ధరలను తట్టుకోవడం కోసం చాలామంది వారి ఉమ్మడి కుటుంబాలను విడిచి దూరంగా ఉంటున్నారు.  ఉమ్మడి కుటుంబాలలో పెరిగే పిల్లలు వాళ్ళ అమ్మ,  నాన్న,  నాన్నమ్మ,  తాతయ్య,  అత్తలూ, మావయ్యలూ,  వారి పిల్లలతో కలిసి పెరిగేవారు.  అలా పెరిగే పిల్లలకు సహజంగానే సామాజిక అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది.  వారికి పంచుకోవడం,  ఇతరులతో కలసి పనులు చేయడం వంటి లక్షణాలు అలవడతాయి. మరి చిన్నకుటుంబాలలో పెరిగే పిల్లలు వారిదే ప్రపంచంగా పెరుగుతున్నారు.  వారి వస్తువుల్ని కానీ, బొమ్మలను కానీ ఇతరులను తాకనివ్వరు.  ఇటువంటి పిల్లలకు

 1. చుట్టుపక్కల పిల్లలతో కలిసి తరచుగా ఆడుకొనేలా అవకాశాలు కల్పించాలి.
 2. వారి వస్తువుల్ని, బొమ్మల్ని వేరే పిల్లలతో ఇచ్చి పుచ్చుకొనేలా అవకాశాలను ఏర్పరచాలి.
 3. పిల్లలను బంధువుల ఇళ్ళలో జరిగే శుభకార్యాలకూ, కార్యక్రమాలకూ తరచుగా తీసుకెళ్ళి అక్కడ అందరితో కలుసుకొనేలా చూడాలి.
 4. వారి వయస్సున్న పిల్లలను ఇంటికి ఆహ్వానించి వారితో ఆడుకొనేలా చూడాలి.

C. మానసికాభివృధ్ధి అంటే తెలివితేటల్ని పెంపొందించడం.  దీనికోసం

 1. చిన్న పిల్లలకు చుట్టుప్రక్కల జరిగే విషయాలపై చాలా కుతూహలం ఉంటుంది, దీని వలన తరచుగా ప్రశ్నలు అడుగుతుంటారు.  తల్లిదండ్రులు వారి సందేహాలను ఓపిగ్గా తీర్చాలి.  దీని వలన వారి తెలివితేటలు పెంచవచ్చు. అలా కాకుండా పిల్లలు ప్రశ్నలడుగుతున్నపుడు విసుక్కొంటే కొన్నాళ్ళకు వారు ప్రశ్నలడగడం ఆపేస్తారు, వారిలో కుతూహలం పోతుంది.
 2. బడికి వెళ్ళే పిల్లలకు పుస్తకాల్లో,  శీర్షికల్లో వచ్చే తేడాలు కనిపెట్టండి, దారి చూపింఛండి,  పజిల్స్,  సూడోకో వంటివి కత్తిరించి వారితో చేయిస్తుండాలి.
 3. ఖాళీ సమయాల్లో లేదా వంట చేసుకొంటూనో,  గిన్నెలు తోముకొంటూనో పిల్లలతో సంభాషిస్తుండాలి. మెదడుకు పదును పెట్టే పొడుపుకథలూ,  ప్రశ్నలడగడం వంటివి చేయవచ్చు. ఇవి వారి తెలివితేటలు మరియు భాషాభివృధ్ధికి ఎంతగానో సహాయపడతాయి.  
 4. ఇంట్లో ఉండే కొన్ని వస్తువుల్ని కలిపి, ఉదాహరణకు కొన్నిరకాల పప్పులు, చింతగింజలు, బటన్స్, నాణాలు, చిన్న గులకరాళ్ళూ వంటివి కలిపి వాటిని వేరు చేయమనడం, జతపరచడం, పరిమాణాన్ని బట్టి అమర్చడం, కళ్ళుమూసుకొని కొన్ని వస్తువుల పేర్లు తిరిగి చెప్పమనడం వంటి పనులు తల్లిదండ్రులు వారి వారి పనులు చేసుకొంటూనే చేయించవచ్చు.  దీనివలన పిల్లల తెలివితేటలూ,  జ్ఞాపకశక్తీ మెరుగవుతాయి.

పిల్లలలో నైతిక విలువలను పెంపొందించడానికి

 1. పిల్లలకు చిన్న వయసులోనే మంచి చెడులపై అవగాహన కలిగించాలి.
 2. తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు చేసే ప్రతీ పనీ వారి తల్లిదండ్రులను చూసి అనుకరిస్తుంటారు. కనుక తల్లిదండ్రులు మంచి నడవడిక, ప్రవర్తన కలిగి ఉంటే పిల్లలు తప్పకుండా మంచి విలువలను నేర్చుకొంటారని ఎన్నో పరిశోధనలు తెలియచేసాయి.
 3. పురాణ కథలు, నీతి కథలను చెప్పడం ద్వారా, పిల్లలకు తమ అనుభవాల నుండి ఉదాహరణలివ్వడం ద్వారా మంచి చెడులకు గల తేడాలను తెలియచేయవచ్చు.
 4. చిన్న పిల్లల కథల పుస్తకాలు కొని, రాత్రి పడుకొనే ముందు రోజూ ఒక మంచి కథ చెప్పవచ్చు. ఇలా చేయడం వలన పిల్లలకు భాషాభివృధ్ధి,  నైతిక విలువలూ మరియు భద్రతా భావం కలిగించవచ్చు. 

అలాగే రాత్రి భోజన సమయాన్ని కూడా చక్కగా గడపవచ్చు.  సాద్యమైనంత వరకూ అందరూ కలసి భోజనం చేసేలా చూడాలి.  టీ.వీ.  చూస్తూ భోజనం చేయడం మంచిది కాదు, దీనికి బదులు ఆరోజు జరిగిన విశేషాలను కుటుంబంలో అందరూ కలిసి పంచుకొంటూ భోజన సమయాన్ని గడపవచ్చు. పిల్లలను వారి స్కూల్లో ఆరోజు జరిగిన విశేషాలను మాట్లాడమని ప్రోత్సహించవచ్చు.  క్రింద పడకుండా శుభ్రంగా భోజనం చేయడం,  భోజనం ముందూ, తరువాతా శుభ్రంగా చేతులు కడుక్కోవడం వంటి మంచి అలవాట్లు నేర్పించాలి.

పిల్లల వ్యక్తిగత అభిరుచులూ, ఆసక్తిని కూడా తల్లిదండ్రులు గమనించాలి. ఆయా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రోత్సహించాలి.  ఉదాహరణకు పిల్లలకు బొమ్మలు వేయడం, రంగులు వేయడం ఇష్టమైతే బజారులో దొరికే కొత్తరకాల రంగులూ,  బొమ్మల పుస్తకాల వంటివి కొని వారిని ప్రోత్సహించవచ్చు. బొమ్మల పోటీలు నిర్వహించే ప్రదేశాలకు వారిని తీసుకెళ్ళి వాటిలో పాల్గొనేలా  ప్రోత్సహించాలి. అలాగే మన అభిరుచులను వారిపైకి రుద్దకుండా స్వతహాగా వారిలో ఉండే ఆసక్తులను గమనించి ప్రోత్సహించాలి.  దీనివలన పిల్లలలో సృజనాత్మకత మెరుగవుతుంది. రకరకాల పోటీలలో పాల్గొని ముందుండే పిల్లలు చదువులో కూడా ముందుంటారు.    

ఈవిధంగా మనకు తెలియకుండానే తీరిక లేకుండా గడచిపోయే మన దైనందిన జీవితంలో కొంత విలువైన సమయం పిల్లల సంపూర్ణాభివృధ్ధికి కేటాయించాలి.  మరి అదే సమయం పిల్లలు సెల్ ఫోనుల్తో, కార్టూన్ ఛానల్స్ తో గడపడం వలన వచ్చేవి - తలనొప్పి, కంటి చూపు మందగించడం, ఊబకాయం,  అలసట,  హింసాత్మక ప్రవర్తన, మొండిగా ఉండడం, అభద్రతా భావం వంటివి వస్తాయి. కనుక తల్లిదండ్రులు పిల్లల్ని అశ్రధ్ధ చేయకుండా తమపనులు చేసుకొంటూనే వారితో మాట్లాడుతూ,  చిన్న చిన్న పనులను చేయిస్తూ వారి అభివృద్ధికి ఆసరాగా ఉండాలి.

ఎం. లక్ష్మీ సౌమ్య, టీచింగ్ అసోసియేట్, మానవాభివృద్ధి కుటుంబ అధ్యయనా విభాగం.

Download File

Rating :3.32 1   1   1   1  
veeru    2015-04-15 17:19:04
చాల బాగా చెప్పారు సౌమ్య గారు. పిల్లల అభ్యున్నతికి మీరు చేస్తున్న ఈ కృషి అజరామరం .
...............................................
ravi    2015-04-17 12:27:39
నేటి సమాజానికి మీ స్ఫూర్తి క్చేమdaaయం గుడ్ మేస్సేji స్వామ్య garu
...............................................
kavitha    2015-09-05 10:28:37
its a very important to the parents f
...............................................
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4