బాలలు అభివృద్ధి

ఆటిజం

ఆటిజం (Autism), తెలుగు పరిభాషలో మూగవ్యాధి అంటారు-ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ అనుకొనేవారం. ఇప్పుడు మన దేశంలోనూ ఉంది.  ఇదేం జబ్బు కాదు; ఇదొక వలయం! అందులో బందీలు పిల్లలు. ఖచ్చితంగా వీళ్ళు ఇలాగే ఉంటారు అని చెప్పలేని స్థితి.  అందరూ ఒకేలా అనిపించరు, ఇతమిద్దంగా ఇవే లక్షణాలు అని కూడా చెప్పలేం. అలాగని దీనిని గుర్తించడం కష్టమేం కాదు. ఫైగా ఎంత ముందుగా గుర్తిస్తే అంతగా నివారణ సాధ్యమౌతుంది.  కొందరు పిల్లలు ఎవరితోనూ కలవకపోవటం, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుండటం, సరిగా మాట్లాడలేకపోతుండటం వంటి భిన్న లక్షణాలను గమనించి.. 'లియో కానర్' అనే మానసిక విశ్లేషకుడు తొలిగా దీనికి 'ఆటిజం' అని పేరు పెట్టారు.

 ఆటిజం అంటే....
మామూలుగా పిల్లలు పెరుగుదల ఒక క్రమంలో ఉంటుంది- బోర్లాపడటం, పాకడం, కూర్చోవడం, పట్టుకొని నిల్చోవడం, నడవడం ఇలా ప్రతిమార్పు వయస్సును బట్టి వస్తుంటుంది. ఇదే పెరుగుదల! శాస్త్రీయంగా వీటిని అభివృద్ధి మైలురాళ్ళుగా నిర్వచించారు. వాటితో పోల్చుకొని బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకుంటాం.
అయితే ఆటిజం మాత్రం వివిధ అంశాలకు సంబంధించిన ఎదుగదల సమస్య. శాస్త్రవేత్తలు దీనిని పర్వేసివ్ డెవలెప్ మెంటల్ డిజార్డర్ అంటారు. ముఖ్యంగా మూడు అంశాలను ప్రత్యేకంగా గమనించొచ్చు.
ఇతరులతో కలవలేరు: వీరు తోటి పిల్లలతో ఆడుకోవటానికి అంతగా ఇష్టపడరు. ఒంటరిగా ఆడుకోవటం, ఒంటరిగా గడపటమే ఎక్కువ.
భావప్రసారంలో లోపం: మాటలు ఆలస్యంగా వస్తాయ్, వచ్చిన తర్వాతకూడా పూర్తిస్థాయిలో ఉంటాయని చెప్పలేము. ఏదైనా చెప్పాలంటే వేలుపట్టుకుని అక్కడి కి తీసుకువెళ్ళి చూపిస్తుంటారు.
ప్రవర్తన: ఒకేపనిని మళ్లీ మళ్లీ చేస్తుంటారు, ఆపనిని ఎప్పుడు చేసినా తిరిగి అట్టగే చెయ్యాలని చూస్తారు.
ఉదాహరణకు, ఏ కంచంలో తింటారో అదే ప్రతి రోజు కావాలంటారు; మారిస్తే ఒప్పుకోరు.రోజూ తాము వాడే టాయ్ లెట్నే వాడతామంటారు. రెండోదానిలోకి వెళ్లనని మొరాయిస్తుంటారు. కొందరు సంతోషం కలిగితే చేతులను కాళ్లను పైకీ కిందికీ అదేపనిగా ఆడిస్తారు. మరి కొందరు సూదులు, గుండుపిన్నుల వంటి ఒకే రకం వస్తువులను సేకరిస్తుంటారు..... ఆటిజమ్ పిల్లల్లో సాధారణంగా ఈ మూడు లక్షణాలూ ఉంటాయి. కొందరిలో ఒకట్రెండు మాత్రమే ఎక్కువగా కనబడినా అన్ని లక్షణాలూ ఏదో ఒక స్థాయిలో కనబడతాయి.
ఈ లక్షణాలు ఆరంభమైన వయస్సు, ప్రభావం, విజృంభణ  తదితర అంశాలను బట్టి  దీన్ని ఆటిస్టిక్ డిజార్డర్, రట్స్ డిజార్డర్, ఆస్పర్జెర్స్ డిజార్డర్, చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్,  బుద్ధిమాంద్యం కానిది  ఆటిజమ్ అని 5 రకాలుగా విభజించారు.

ఆటిస్టిక్ డిజార్డర్ ఎక్కువగా కనబడే ఆటిజం సమస్య ఇదే. దీన్ని 'చైల్డ్‌హుడ్ ఆటిజమ్' అంటారు. ఇది ఆడ పిల్లల్లో కన్నా మగపిల్లల్లో ఎక్కువ.

 రట్స్ డిజార్డర్ అరుదు, కాని ఆడపిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది.  పుట్టిన ఏడాది వరకూ పిల్లలు బాగానే ఉంటారు గానీ తర్వాత లక్షణాలు కనబడటం మొదలవుతుంది. ఇవి రెండు మూడేళ్లలోనే వేగంగా తీవ్రమవుతాయి. అప్పటికి వచ్చిన ఒకట్రెండు మాటలు కూడా తిరిగి వెనక్కి వెళ్లిపోతాయి. ఇది ముదిరే రకం కావటం వల్ల కొంతకాలానికి నాడీ సంబంధ సమస్యలూ ఆరంభమవుతాయి. సరిగా నడుము నిలపలేకపోతుండటం వంటివాటితో మొదలై మెల్లగా 'ఫిట్స్' కూడా వస్తాయి. సాధారణంగా వయసుతో పాటు పెరగాల్సిన తల వీరిలో చిన్నదవుతుంటుంది. చొంగ కారటం, చేతులుకాళ్లు ఒకే రకంగా ఆడిస్తుండటం, చేతులతో చప్పుళ్లు చేయటం వంటివి కనబడతాయి. యుక్తవయసుకు ముందే సమస్యలు బాగా ముదిరి వీరు బ్రతకటం కూడా కష్టమవుతుంది.

ఆస్పర్జెర్స్ డిజార్డర్ మగ పిల్లల్లో ఎక్కువ. సాధారణంగా ఆటిజమ్ పిల్లల్లో మాటలు ఆలస్యంగా వస్తుంటాయి. కానీ ఈ రకంలో మాటలు మామూలుగానే ఉంటాయి. నలుగురిలోకి వెళ్లటం, తెలివి తేటలు కూడా బాగానే ఉంటాయి. కానీ తక్కువగా మాట్లాడతారు. అడిగిన దానికి సమాధానం చెప్పేసి ఆపేస్తారు. శరీరాకృతి భిన్నంగా ఉంటుంది. పొడుగ్గా ఉంటారు. పొడవైన ముఖంతో పాటు చెవులూ భిన్నంగా ఉంటాయి. మిగతా ఆటిజమ్ పిల్లలతో పోలిస్తే ఇతరులతో బాగానే కలుస్తారు కాబట్టి వీరిలో భాషా నైపుణ్యాలు కాస్త ఎక్కువగానే అలవడతాయి. కొంతవరకూ బాగానే చదువుతారు. కొన్ని పనుల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అందువల్ల ఆయా అంశాల్లో నైపుణ్యం సాధిస్తారు. అందువల్ల మిగతా ఆటిజమ్ పిల్లలతో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉంటారు. కానీ వీరిలో ప్రవర్తనా సమస్యలు ఎక్కువ. కోపోద్రేకాలు కూడా మితిమీరి ఉంటాయి.

చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది చాలా తీవ్రమైన సమస్య. వీళ్లు పుట్టినపుడు బాగానే ఉంటారు. ఒకటి రెండేళ్ల వరకూ ఎదుగుదల కూడా బాగానే ఉంటుంది. పాకటం, నిలబడటం, మాట్లాడటం అన్నీ మామూలుగానే వస్తాయి. ఆ తర్వాత ఎదుగుదల వెనక్కి మళ్లటం మొదలవుతుంది. అదీ చాలా వేగంగా. ముఖం ముదరినట్టుండటం, తలకట్టు కిందికి ఉండటం, పొట్టిగా, లావుగా ఉండటం వంటివి కనబడతాయి. నాడీ సంబంధ లోపాలూ ఆరంభమై, ఫిట్స్ వచ్చి నెమ్మదిగా మంచానికే పరిమితమవుతారు, బతికి బట్టకట్టే అవకాశాలూ తగ్గుతాయి.
బుద్ధిమాంద్యం కానిది  ఆటిజమ్- బుద్ధిమాంద్యం ఉన్నవారు ఇతరులతో కలవకుండా, తమ లోకంలో తాముంటారు కాబట్టి మొదట్లో దీన్ని అంతా 'బుద్ధిమాంద్యం'గానే భావించేవారు. కానీ 'ఆటిజమ్' పిల్లలు బుద్ధిమాంద్యం పిల్లల్లా స్తబ్ధుగా ఉండరు. హుషారుగా, పరిసరాలను గమనిస్తూనే ఉంటారు. కాబట్టి ఇది బుద్ధిమాంద్యం కాదు. పైగా ఆటిజమ్ పిల్లలు కొన్నింట్లో చాలా చురుకుగా ఉంటారు. కొందరు ఏదైనా ఒకసారి దారిని చూస్తే మరచిపోరు. మరికొందరు అంకెలు, సంఖ్యలు టకటకా చెప్పేస్తారు. పద్యాలు, గేయాలను ఒకసారి వినగానే తిరిగి అప్పజెప్పేస్తారు. చుట్టుపక్కల పరిసరాలను అంతగా చూడనట్టు ప్రవర్తించినా వీరిలో కొన్ని అసాధారణ సామర్థ్యాలుంటాయి. ఈ ప్రత్యేకతలన్నింటి దృష్ట్యా ఇది బుద్ధిమాంద్యం కాదని తేల్చారు. అయితే ఆటిజమ్ పిల్లలు పెద్దయ్యాక కొందరిలో బుద్ధిమాంద్యం లక్షణాలు కనిపించొచ్చు. ఇతరులతో కలివిడిగా ఉండకపోవటం, నేర్చుకోకపోవటం వంటివి దీనికి దారితీయొచ్చు.
కారణాలు
ఆటిజంకు ఇదమిత్థమైన కారణమిదీ అని చెప్పటం కష్టం
మెదడు ఎదుగుదలకు తోడ్పడే కొన్ని జన్యువులు, క్రోమోజోములు కూడా ఆటిజంకు దోహదం చేస్తున్నట్టు భావిస్తున్నారు. మెదడులో సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయన మార్పులు కూడా సమస్యకు మూలం అని అంటున్నారు.
గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్ల బారినపడినా, లేదా కాన్పు సమయంలో బిడ్డ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవటం వంటి సమస్యలు తలెత్తినా ఆటిజం బారిన పడచ్చని భావిస్తున్నారు.
కొన్ని వృత్తుల్లోని తల్లి తండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోవటం, పని గంటలు అస్తవ్యస్తంగా ఉండటం, పరిసరాల నుంచి సరైన ప్రేరణ లేకపోవటం వలన్ అనె వాదనకూడా ఉంది.
రేడియేషన్ ప్రభావం వంటివి కూడా కారణాలంటున్నారు.
ఇలా చాలా రకాల ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలు న్నా, ఎది పూర్తిగా నిరూపణ కాలేదు. ఆటిజం గురించడం
చిన్న పిల్లలలో

 • అకారణంగా ఎప్పుడు ఏడ్వటం
 • గంటల తరబడి స్తబ్ధుగా ఉండటం
 • తల్లిదండ్రులు దగ్గరకు తీసుకుంటున్నా ఉలుకుపలుకు లేకుండా ఉండటం
 • తెలిసిన వారిని చూసికూడా నవ్వక పోవటం

పెద్ద  పిల్లలలో

 • పిల్లలతో కలవిడిగా ఉండలేకపోవడం.
 • పిలిస్తే పలకకపోవడం.
 • పెరిగే కొద్దీ ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుండటం
 • మనుషుల కంటే బొమ్మలు, వస్తువుల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండటం
 • ఎవరైనా పలకరించినా వెంటనే సమాధానం ఇవ్వకపోవటం
 • కళ్లలో కళ్లు పెట్టి చూడకపోతుండటం
 • ముఖంలో భావోద్వేగాలేవీ చూపించకపోతుండటం
 • మాటలు సరిగా రాకపోతుండటం, సరిగా మాట్లాడలేకపోతుండటం
 • గుంపులో ఉన్నా మిగతా పిల్లలతో కలివిడిగా ఉండలేకపోతుండటం, తమ బొమ్మలు తాము పెట్టుకు ఆడుకుంటుండటం
 • ఎదుటి వారికి దెబ్బలు, గాయాల వంటివి తగిలినా పట్టనట్టుగా ఉండిపోతుండటం, వెంటనే స్పందించకపోతుండటం
 • తమకు దెబ్బలు తగిలినా నొప్పి, బాధ పట్టనట్టు ఉండిపోవటం
 • నడక మొదలుపెట్టినప్పుడు మునివేళ్ల మీద నడుస్తుండటం
 • వయసుకు తగినట్లు భాషా పాటవం వృద్ధి చెందకపోవటం
 • పలకరించినా రెండు మాటలు మాట్లాడి వెళ్లిపోవటం, సంభాషణను కొనసాగించే శక్తి కొరవడటం
 • ఎదుటి వాళ్ళు ఏమంటే తిరిగి మళ్లీ అనటం. దీనినే ఎకోలాలియా అంటారు. - ఉదాహరణకు 'నీ పేరేమిటి?' అని అడిగితే, సమాధానం చెప్పటానికి బదులు తను కూడా 'నీ పేరేమిటి?' అనటం.
 • మనం ఎప్పుడో అడిగిన ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పకుండా, ఎప్పుడో మళ్లీ అదే ప్రశ్నను అడుగుతుండటం
 • కొన్నిసార్లు అసందర్భంగా మాట్లాడుతుండటం.
 • ఏదైనా ఒక వస్తువు లేదా బొమ్మ పట్ల విపరీతమైన వ్యామోహం పెంచుకోవటం. ఎప్పుడూ యావంతా దాని మీదే ఉండటం, దాన్ని తీసేస్తే విపరీతంగా కోపం రావటం
 • చేతులు, కాళ్లు లేదా వేళ్లు కాస్త అసహజంగా ఒకే తీరులో కదలిస్తుండటం
 • అడిగినవి ఇవ్వకపోతే అరవటం, గట్టిగా గీపెట్టటం,  కొంతమందిలో ప్రతి దానికీ భయపడటం
 • గాలికి తీగలాంటిదేదన్నా కదులుతున్నా కూడా భయపడిపోవటం, చీమలాంటిది కనబడినా భయపడటం, చిన్న చిన్న శబ్దాలకు కూడా గట్టిగా చెవులు మూసుకోవటం, శబ్దాలు భరించలేకపోవటం వంటి భావోద్వేగపరమైన అంశాలు కూడా ఉంటాయి.
 • కొందరు విపరీతంగా చురుకుగా ఉంటుంటారు. ఎప్పుడూ కదులుతూ, అటూ ఇటూ తిరుగుతూ ఉండటం చాలామందిలో కనబడుతుంది.
 • కొందరికి మేధస్సు సగటు స్థాయిలోనే ఉన్నా. కొందరిలో మాత్రం కొన్నికొన్ని విషయాల్లో అపారమైన ప్రజ్ఞ కనబడుతుంటుంది.
 • ఫిట్స్, మరికొన్ని రకాల మెదడు, నాడీ సంబంధ సమస్యల 30% మందిలో కనబడుతుంటాయి.
 • కొద్దిమందిలో మానసిక ఎదుగుదల కూడా కుంటుపడొచ్చు.

చికిత్స
చికిత్స లక్షణాల ఆధారంగా ఉంటుంది. వైద్యులు 'ఆటిజం రేటింగ్ స్కేల్స్' ఆధారంగా పిల్లల ప్రవర్తన, లక్షణాలన్నింటినీ గమనిస్తారు. అవసరమైతే 'ఐక్యూ' పరీక్షలూ చేస్తారు. దీనిలో- మోస్తరు, మధ్యస్తం, తీవ్రం- స్థాయులు నిర్ధారించి దాన్ని బట్టి దీన్ని ఎలా ఎదుర్కొనాలన్నది నిర్ధారిస్తారు. చికిత్స లో మూడు భాగాలుంటాయి- 1. వైద్యుల సూచనల మేరకు మందులు వాడటం, 2. కౌన్స్లింగు & శిక్షణ ద్వారా మానసిక స్థితిని సవరించడం , 3. గ్లూటిన్ రహిత, కెసిన్ రహిత ఆహారం ఇవ్వడం. 
ఇక్కడ కౌన్స్లింగు & శిక్షణ ద్వారా మానసిక స్థితిని సవరించడం, గ్లూటిన్ రహిత, కెసిన్ రహిత ఆహారం ఇవ్వడం పై వివరాలను పొందుపరస్తున్నాము.
ఆటిజం పిల్లలకు ముఖ్యమైనది మానసిక స్థితిని చక్కదిద్దే శిక్షణనివ్వడం. తల్లిదండ్రులు  నిరాశ చెందకుండా, ఆటిజంను గుర్తించిన వెటనే వారికి చికిత్స మొదలుపెట్టాలి. అందుకు నిపుణులను సంప్రదించాలి, వారి పర్యవేక్షణలొ పిల్లలకు శిక్షణను ఇప్పిస్తూ, తాము కూడా భాగస్వాములవ్వాలి. చిన్నతనంలోనే ప్రేరణ ఇవ్వటం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.
ముఖ్యంగా
ఒక పద్ధతి ప్రకారం ఉదయం నుంచీ రాత్రి వరకూ పిల్లలతో మాట్లాడుతుండటం, సంభాషణా సామర్థ్యం పెరిగేలా చూడటానికి, కళ్లలో కళ్లు పెట్టి చూడటాన్ని అలవాటు చేసేందుకు,  మలమూత్ర విసర్జన కోసం శిక్షణనిస్తారు.
శిక్షణ స్థాయిని క్రమేపీ పెంచుకుంటూ వెళతారు. దీంతో మెదడులో లోపం క్రమేపీ సర్దుకుంటుంటుంది. 
ప్రవర్తనను గమనిస్తూ తల్లి తండ్రులు పిల్లలను చక్కదిద్దాలి. పిల్లలకు ఏదైతే బాగా ఇష్టమో దాన్ని వెంటనే ఇవ్వకుండా, మనం చెప్పిన పని చేస్తే అప్పుడు ఇవ్వటం, మంచి అలవాట్లు ఏర్పరుచుకునేలా చూడాలి. 
వేరే పిల్లలతో గొడవలు పడటం వంటివి చేస్తుంటే సైకో థెరపీ వంటివీ ఇస్తారు.
మరీ చిన్నపిల్లల కంటితో చూసి ఎక్కువ నేర్చుకోరు కాబట్టి ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా స్పర్శ, ధ్వని వంటి వాటి ద్వారా వారికి కావాల్సినవి నేర్పిస్తారు.
పిల్లలు కనబరిచే ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి వాటికి మెరుగుపెట్టడం ముఖ్యం. ఎందుకంటే వాటిలో బాగా రాణిస్తారు. ఆందుకు నిపుణులు ఆక్యుపేషనల్ థెరపీ, మ్యూజిక్ థెరపీ వంటి వాటిని సూచిస్తారు.
ముందే గుర్తించి సవరించడం మొదలు పెడ్తే ఆటిజం పిల్లలు చాలా వరకూ సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంటుంది. ఇతరత్రా లోపాలేమీ లేకుండా మేధస్సు సాధారణ స్థాయిలో ఉండి, మాటలు-సంభాషణ బాగానే ఉన్న వారికి మొదటి నుంచీ చికిత్స ఇస్తే చాలా మెరుగయ్యే పరిస్థితి ఉంటుంది.
పథ్యం
ఆహారంలో పడని వస్తువుల వల్ల ఆటిజం తరహా మెదడు సమస్యలు వస్తున్నాయన్న భావన కూడా ఉంది. ముఖ్యంగా గోధుమల్లో ఉండే గ్లూటెన్ అనే ప్రోటీను, పాలలో ఉండే కెసీన్ అనేవి వీరికి అలర్జీ కలిగిస్తాయని, అందు చేత  వీరికి ఇవి లేకుండా ఆహారం ఇవ్వటం వల్ల ఉపయోగం ఉంటుందన్న వాదన ప్రాచుర్యంలోకి వచ్చింది. దీన్నే గ్లూటెన్ రహిత, కెసిన్ రహిత (Gluten Free Casein Free-GFCF) ఆహారం అంటారు.
అయితే దీన్ని ఖచ్చితంగా పాటించటం కొంచం కష్టమే. అయినా కాని 2, 3 నెలల పాటు ఇలా ఇచ్చి చూసి ఫలితం ఉంటే కొనసాగించటం లేకపోతే సాధారణ ఆహారానికి మారటం మంచిది.
ఆటిజంకు గురైన పిల్లలలో గ్లూటెన్, కెసీన్ ల పట్ల అలెర్జీ ఉంటుందని శాస్త్రీయంగాచెప్పబడింది. దీని ప్రకారం ఆటిజం గల పిల్లలలో గ్లూటెన్, కెసీన్ లనుండి పెప్టైడ్లు, ప్రోటీన్లను తయారు చేసుకొనే తత్వం శరీరంలో  ఉంటుందని, అటువంటి అసాధారణ పద్థతి వలన  పిల్లల ప్రవర్తన అసాధారణంగా ఉంటుందనేది సిద్థాంతం. ఆవిధంగా తయారయ్యే పద్థతిలో విడుదలయ్యే రసాయన పదార్థాలు మెదడును అతిగా ప్రేరింపించి విపరీత ధోరణిని ప్రదర్శించేట్లు చేస్తుంది. ఈ స్థితిని అధిగమించాలంటే  గ్లూటెన్,  కెసీన్ గల ఆహారాన్ని నియంత్రించాలని  అద్యయనాలు తెలియ చేస్తున్నాయి. 

గ్లూటెన్ ఎక్కువగా గోధుమలో, బార్లీ గింజలలో ఉంటుంది. మన దేశంలో బార్లి వాడకం ఎక్కువకాదుగాని, గోధుమ మాత్రం వాడతారు. పాలు, పాల సంబంధిత పదార్థాలలో కేసిన్ ఉంటుంది. కనుక వాటిని పూర్తిగా మానేయ్యలి. సాధారణంగా ఈరెంటిని పిల్లలు ఎక్కువగా తీసుకుంటారు. అట్లాంటి వాటిని పూర్తిగా వదిలేస్తున్నప్పుడు, ప్రత్యమ్నాయంగా వేటిని తీసుకోవాలనే ప్రశ్న ఉద్భవిస్తుంది. 
ఆటిజం ఉన్న పిల్లలకు మందులు, మానసిక చికిత్స ఎంత ముఖ్యమో పత్య చికిత్స కూడా అంతే ముఖ్యం. ఆహారంలో మార్పులు మందులకంటే మెరుగ్గా పనిచేస్తాయని శాస్త్రీయంగా నిరూపించబడింది. సాదారణంగా అందరూ తినే గోధుమ, పాలు మరియు సోయా వంటకాలు ఆటిజం పిల్లలకు ఇవ్వడం మంచిది కాదు. గోధుమలో ఉండే గ్లూటెన్, పాలల్లో ఉండే కేసిన్, ఇంకా సోయా ప్రోటీన్లు ప్రకృతి సిద్ధంగా అవి మాంసకృత్తులు అనే విభాగానికి చెందిన పోషకాలు. ఈ మాంసకృత్తులు ఆటిజం పిల్లల్లో ఉత్ప్రేరకాలుగా పనిచేసి పిల్లలను (రాత్రిపూట సరిగ్గా కూడా) నిద్ర పోకుండాను, ఒంటిమీద జాగ్రత్త లేకుండా దెబ్బలు తగుల్చుకోవడం, ఫిట్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అల్లర్జీ ఏమీ ఉండదుకాని శరీరంలో దీనికి తట్టుకునే గుణం ఉండదు. అందువల్ల ఆటిజం పిల్లలకు తప్పనిసరిగా ఆహారంలో గోధుమ, పాలు, సోయా పదార్థాలు లేకుండా చూసుకోవాలి. రోజూ గోధుమ, పాల పదార్థాలకు ప్రత్యామ్నాయంగా ఇతర ఆహారాలను ఎంపిక చేసుకోవడం తల్లిదండ్రులకు చాలా క్లిష్టమైన పరీక్షే.
ముందుగా గోధుమ ఉత్పత్తులు, పాల ఉత్పత్తుల గురించి క్షుణ్ణంగా అవగాహన పెంచుకోవాలి. (సోయా వాడకం మనకు తక్కువే అయినా సోయా మీల్ మేకర్, సోయా గ్రాన్యుల్స్/చంకీస్, సోయా పిండి, సోయా ఉన్న మల్టీ గ్రైన్ అట్టా లాంటివి ఆటిజం పిల్లలకు ఇవ్వకూడదు.) గోధుమ/మైదా పిండితో చేసిన చపాతీ, పూరీ, నంకీన్లు, చక్కర్ పారా, బిస్కెట్స్, కేక్స్, కుక్కీస్ మొదలైనవి. ఇంకా గోధుమ ఉత్పత్తులైన గోధుమ రవ్వ, సేమియా, నూడిల్స్, పాస్తా మొదలైన వాటితో చేసిన ఉప్మా, కేసరి, కీర్, హల్వా, పాయసం, రవ్వ ఇడ్లీ, రవ్వ దోశ వంటివి, అంతే కాకుండా పాలల్లో కలుపుకునే హార్లిక్స్, బివరేజ్ మిక్షెస్ ల వాడకం నిలిపి వేయాలి. ఇలాంటి వాటిలో గ్లూటెన్ అధికంగా ఉండి బార్లీ/రై పిండి కూడా ఉండి ఆటిజం పిల్లల్లో లక్షణాలను ఉధృతం చేస్తాయి.
ఇక కేసిన్ అధికంగా ఉండే పాల ఉత్పత్తులు అంటే తల్లి పాల దగ్గర నుండి ఆవు, గేదె, మేక పాలు, పెరుగు, కోవా, పన్నీరు, పాలపొడి కలిపిన బెవరేజ్ మిక్సెస్, చంటి పిల్లలకు తయారుచేసిన కొన్ని అనుబంధ ఆహార మిశ్రమాలు, పాలతో తయారుచేసిన పాయసం, రసగుల్లా, గులాబ్ జామూన్ మొదలైనవన్నీ నిలిపి వేయాలి.
సాదారణంగా రోజూ వాడే ఇన్నిరకాల వంటకాలు ఆటిజం పిల్లలకు పనికిరావు, కాబట్టి వాటి స్థానంలో ఇతర ఆహారం చేర్చాలి.
గోధుమ వాడే వారు బియ్యం, జొన్న, కొర్ర, రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలనూన్నానికి టిఫిన్లకు వాడాలి. ప్రొద్దున్నే ఇచ్చే పాల బదులు రాగి జావ ఇవ్వడంవల్ల పాలల్లో ఉన్నంత కాల్షియం, మాంసకృత్తులు, శక్తి ఈ అంబలి ద్వారా ఇవ్వవచ్చును.
రాగులను నానబెట్టి రుబ్బు రాగి పాలు తయారుచేసి కూడా ఇవ్వవచ్చు. అలాగే చపాతీ బదులు జొన్న రొట్టె, సజ్జ రొట్టె, రాగి దోస, వీటితో పప్పు కలిపి చేసిన పొంగలి, బియ్యపు అటుకులతో ఉప్మా, జొన్న/కొర్రలతో ఉప్మా, నీళ్ళలో ఉడికించి పాయసం, కేసరి ఇలా మనం గోధుమ/పాలతో చేసే ప్రతి వంటకం ఇతర ధాన్యాలతో, తయారు చేసి ఆటిజం పిల్లలకు పెట్టవచ్చు.
ఆటిజం పిల్లలు ఎక్కువగా లైట్ కలర్, వాసన్, రంగు తక్కువగా ఉన్న బ్రేడ్, పాలు మొదలైనవి ఇష్టపడతారు, అందువల్ల ఇతర ధాన్యాలు, పొట్టు తీసిన పప్పు దినుసులు మొదలైనవి ఉపయోగించి పిల్లలు ఇష్టపడేటట్లు తయారు చేయాలి.
ఆహారంలో ఇలాంటి మార్పులు చేయడంవల్ల ఆటిజం లక్షణాల తీవ్రత తగ్గి ఆ పిల్లలలో మాట్లాడటం, తెలివిగా ప్రవర్తించడం, ఏ పని తర్వాత ఏ పని చేయాలో ఆ క్రమంలో చేయగలగడం, నలుగురిలో ఉండడానికి ఇష్టం పెంచుకోవడం, ప్రవర్తనాసరళిలో మెరుగుదల రావడం, ప్రశాంతంగా నిద్రపోవడం మొదలైన మార్పులు 3/4 నెలల్లోనే కనిపిస్తాయి. మానసిక నిపుణుల సలహా మేరకు ఈ అలవాట్లన్నిటినీ పటిష్టపరచి, మరింతగా మెరుగు పరిస్తే ఆటిజం తో బాధపడే పిల్లలకు కుటుంబంలో మంచి చేయూతనిచ్చి వారి పనులు వారు చేసుకునేటట్లు తీర్చిదిద్దొచ్చు.

డాక్టర్. నస్రీన్ భాను, సీనియర్ శాస్త్రవేత్త.
డాక్టర్ కె. ఉమాదేవి, ప్రొఫెసర్, ఆహారం & పోషణ విభాగం.
డాక్టర్. పి. అమల కుమారి, ప్రొఫెసర్, విస్తరణ మరియు ప్రసార నిర్వహణ విభాగం.

Download File

Rating :3.25 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4