బాలలు అభివృద్ధి

పిల్లలను వద్దని వారించడం ఎలా?

  • వద్దన్నానా?! లే అక్కడ్నుంచి
  • చెయ్యొద్దంటే వినవేంటి?
  • ఒక్కసారి వద్దంటే ఎప్పుడూ వినవు కదా?
  • చెయ్యొద్దన్న పనే చేస్తానంటావు; ఎప్పుడు నేర్చుకుంటావు మాట వినడం?
  • ఇపుడు నేను ఏది ఇవ్వను, రేపు చూద్దాం !
  • పెట్టింది తిను, చెప్పింది చెయ్యి - అది కావాలి, ఇది కావాలి అంటే ఎక్కడ్నుంచి వస్తుంది?
  • ఇప్పుడు కాదు రేపు వెళ్దాం?

ఇవన్నీ చదువుతుంటే ఏమన్నా గుర్తొస్తుందా?
కొందరికి వచ్చి ఉంటుందిలే!
ఇవన్నీ తల్లిదండ్రులు పిల్లలు ఏదన్నా అడిగినప్పుడు, అల్లరి చేస్తున్నప్పుడు, మారాం చేస్తున్నప్పుడు అరుస్తూ, కోప్పడుతూ, అనే మాటలు.
అన్ని మాటల్లో ' వద్దు ' అనే సంకేతం పిల్లలకు కనిపిస్తుంది.
ఆ సంకేతం పిల్లలకు అస్సలు ఇష్టం ఉండదు; నిగ్రహాన్ని కోల్పోయి, కోప ప్రకోపాలను చూపుతారు.
తల్లిదండ్రుల నోట్లోనుంచేమో వద్దు అనే మాట చాలా సులువుగా వస్తుంది.
పిల్లల ప్రవర్తనను విశ్లేషించే మానసిక శాస్త్రవేత్తలేమంటారంటే, “తల్లిదండ్రులు వద్దు అనే పదాన్ని వాడుతూంటే, ఆ పదం యొక్క పరమార్ధాన్ని గ్రహించే సున్నితత్వం పిల్లలలో నశించిపోతుంది”  అని. ఆ పదాన్ని పిల్లల విషయంలో ఎంత పొదుపుగా వాడాలంటే ఆ మాట చెప్తే తప్ప పిల్లలు సమస్య నుంచి లేదా నష్టం కలిగించే పరిస్థితి నుంచి బయటపడరు అనుకునే సంధర్బంలోనే, మరొక ప్రత్యామ్నాయ మార్గం లేదనుకున్నప్పుడే వాడాలి.
ఇది చదవగానే చాలమంది తల్లితండ్రులు మా పిల్లల సంగతి ఈ రాసిన వాళ్ళకేం తెలుసు, ఒక గడియ వాడితో గడిపితే తెలుస్తుందని అనుకుంటూండవచ్చు.
బయట బజారుకు తీసుకెళ్తే బొమ్మల దగ్గర ఆగిపోతారు, కొనివ్వమని గొడవ చేస్తారు. కిందపడి దొర్లుతారు, పోని కొనిచ్చామా !? దాంతో ఆడుకోరు. మళ్ళీ ఇంకో బొమ్మ, ఇంకో బొమ్మ, ఇలా ఎన్నో బొమ్మలతో ఇల్లు నిండిపోతుంది. మరి వద్దు అనకుండా ఉండటమెలా  ????. 
ఎవరింటికైనా తీసుకెళ్తే వాళ్ళ పిల్లల బొమ్మలో, పుస్తకాలో మరేదో కావాలని మారాం చేస్తారు. వద్దంటే ఏడుస్తారు. అది ఇద్దరికీ సమస్యే!


“పెన్సిలు పారేస్తే రేపు మరొకటి కొనిపెట్టను”  అని చెప్పి పంపుతారు, తప్పకుండా పారేసుకొస్తారు. పారేసుకొచ్చాక మళ్ళీ పాతపాటే.
కాస్త అటు ఇటుగా ఏ తల్లిదండ్రులను కదిలించినా ఏకరువు పెట్టే విషయాలివే.
వాళ్ళు పిల్లలు  !ఏది మంచో, ఏది చెడో వాళ్ళకు తెలియదు. అందరూ ఆ స్థితిలో ప్రయాణించి, దాటి తల్లిదండ్రుల దశకు చేరుకునేవారే.
వాళ్ళు పెద్ద వాళ్ళు లాగా ఎలా ఉండగలరు? ఉండగలిగితే వాళ్ళు పిల్లలు కారు పెద్దలౌతారు.
వద్దని చెప్పకుండానే పిల్లలలో మంచి అలవాట్లు పెంపొందించడానికి తల్లిదండ్రులు ఏమి చేయాలి?
ప్రత్యామ్నాయాలని, పరిష్కారాలను చూపించండి.
ఇప్పుడు నువ్వు ఆ పని మానేస్తే నీకు నేను ఐస్ క్రీం, చాక్లెట్లు కొనిస్తాను, పార్కుకు తీసుకెళ్తాను అని చెప్పి చూడండి. చెప్పింది మాత్రం తప్పక చేయండి.
ఇంకా, ఐస్ క్రీం కావాలా, చాక్లెట్లు కావాలా, బొమ్మ కావాలా, సినిమాకెళ్ళాలా, పార్కుకెళ్ళాలా అంటూ చాలా ప్రత్యామ్నాయాలను చూపి, ఏం కావాలో కోరుకోమనండి. దాంతో కొంతవరకు అదుపులోకి వస్తారు. అంతే కాని వద్దు అనే పదం వాడకండి. అది పిల్లలను అనుకూల దిశలో అలోచించనివ్వదు.
వాళ్ళకు మంచి, చెడు ప్రవర్తన పట్ల వ్యత్యాసం అంతగా తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ప్రవర్తించడం. పిల్లలు ఎలా ఉండాలని అందరూ కోరుకుంటారో, పిల్లలు ఎలా ఉంటే అందరూ ఇష్ట పడతారో  పిల్లలకు బోధపరచండి. పిల్లలతో కూర్చుని ఎందుకు చేయకూడదో వివరించండి. అపుడు మీ బిడ్డ కూడా తన భావాలను మీతో పంచుకుంటాడు. ఇదిగో ఇక్కడే ప్రతికూల ప్రవర్తన, ఆలోచనలు మారి, అనుకూలంగా మారడానికి బీజం పడుతుంది.
పిల్లలు ఏడుస్తూనో, అరుస్తూనో తమ ప్రకోపాన్ని వెల్లడిస్తున్నపుడు అడ్డు తగలకండి! అలాంటి సమయంలో మీరు ఏమి మాట్లాడినా పిల్లలు వ్యతిరేక భావంతోనే అర్ధం చేసుకుంటారు. ఆ కోపపు తుఫాను ఆగి, బిడ్డ మామూలు అయ్యేంత వరకూ ఆగండి; ఈ లోపల మీరు బిడ్డతో ఎలా మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో ఆలోచించుకోండి. ప్రశాంతంగా ఉండే ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ బిడ్డతో మాట్లాడండి, తన ఉద్వేగం నుండి వెలుపలికి రావడానికి సహాయం చేయండి.
పిల్లలు సాదారణంగా ఉక్రోషాన్ని కోపాన్ని ప్రదర్శించే సందర్భాలు, ఎలాంటి సమయాలలో వీటిని ప్రదర్శిస్తారో మీకు అనుభవం ఉండే ఉంటుంది. సాధారణంగా ఆకలి వేసినపుడు, అలసిపోయినప్పుడు, విసుగు వచ్చినప్పుడు అలా చేస్తుంటారు.. కనుక ముందుగానే జాగ్రత్తపడి ఆకలేస్తే ఇవ్వడానికి తినుబండారాలు, అలసట, విసుగు కలిగినపుడు వారి దృష్టి మళ్ళించే కొత్త ప్రయత్నాలు, మార్గాలు ఆలోచించుకుని సిద్ధంగా ఉండాలి.
పిల్లల మీద చెయ్యెత్తడం, కొట్టడం అస్సలు పరిష్కార మార్గాలు కావు. వీటి వలన లాభం కాదు కదా నష్టమే ఎక్కువ. అలా చేస్తే పిల్లలు చివరకు నేర్చుకునేది ఏమిటంటే తమకు కోపం వచ్చిన సందర్భాలలో అలాగే దాడి చేయడమే సబబైన మార్గమని. కాబట్టి పిల్లలను కొట్టడమనేది వారిని చెడగొట్టడమే అవుతుంది.
నిశ్శబ్దంగా ఉండండి పిల్లలు విసిగిస్తున్నప్పుడు కొందరు తల్లిదండ్రులు పళ్ళు నూరడం, అరవడం, పూర్తిగా వాళ్ళతో మాట్లాడడం మానివేయడం చేస్తుంటారు. వెంటనే వీటిని ఆపివేయండి. ప్రత్యామ్నాయంగా నిశ్శబ్దంగా ఉండండి. ఇలా ఉండడం చాలా కష్టం; కాని పిల్లల మేలు కోసం మానుకోవాలి. పరిస్థితి చల్లబడ్డాక వారితో మాట్లాడండి.
మంచి ప్రవర్తనకు బహుమానాలు, అభినందనలు ఇచ్చినట్లుగా చెడు ప్రవర్తనకు కొన్ని పర్యవసానాలుంటాయని పిల్లలకు తెలియజేయాలి. ఉదాహరణకు ఇంకొంచం ఎక్కువసేపు ఆడుకుంటామంటే, ఆడుకో కాని ఎంత ఎక్కువ సేపు ఆడుకుంటే అంతసేపు టి. వి. చూడకూడదని, లేదంటే అంతసేపు అదనంగా చదువుకోవాలని చెప్పడం వంటివి. మీరు ఏమి సూచిస్తారో అది తప్పకుండాఅమలు చేయండి. లేకపోతే అమ్మ, నాన్న ఎన్ని చెప్తారో కాని ఏది చెయ్యరు, ఒట్టొట్టి మాటలే అనే భావన పిల్లలలో కలుగుతుంది.
పిల్లలకు సంకేతాలు పంపిస్తూ ఉండండి. మరొక ఐదు నిమిషాలలో ఆటలు ఆపేసి వచ్చేయాలి, ఈ కార్యక్రమం అయ్యాక టి. వి ఇక ఆపేయాలి, ఇంకొక పది నిమిషాలలో మనం ఇంటికి బయలుదేరాలి అని చెప్తుండాలి. అందువలన పిల్లలు తాము చేస్తున్న దానిని ముగింపు చేస్తారు.
పిల్లలనుండి వస్తువులు లాక్కోకండి. ఒక్కోసారి పిల్లలు తాము ఆడుకోకూడని వస్తువులతో ఆడుకుంటుంటారు. ఉదాహరణకు సెంటు సీసాలు, మందు సీసాలు, పదునుగా ఉండే వస్తువులు మొదలైనవి. అలాంటప్పుడు ఒక్కసారిగా వాళ్ళ దగ్గర్నుంచి వాటిని లాక్కోకూడదు. అలా లాక్కుంటే వాళ్ళకు కోపం వస్తుంది. ఉక్రోషాన్ని ప్రదర్శిస్తారు. ఇందుకొక మంచి మార్గమేమంటే, వారితో ఆ వస్తువుకు బై బై చెప్పించి ఒక ముద్దు పెట్టించి, మళ్ళీ రేపు ఆడుకుంటానని దానికి చెప్పించి, ఎక్కడ్నుంచి తీశారో అక్కడ పెట్టించడం. ఇంతచేసినా పిల్లలు వాటితోనే ఆడుకుంటామని గొడవ పెడ్తుంటే మరొక వస్తువు వైపు దృష్టి మరల్చాలి.
పొదుపు అలవాటు చేయండి. కొందరు పిల్లలు బయటకు వెళ్ళినపుడల్లా ఏదొక బొమ్మ కొనిపెట్టమని గొడవచేస్తారు. షాపులో కిందపడి దొర్లుతుంటారు కూడా. ముందుగానే పిల్లలకు బొమ్మలు కొనుక్కోడానికి డబ్బు పొదుపు చేయడం నేర్పించండి. కిడ్డీ బ్యాంకులో డబ్బుంటే దాంతో కొనుక్కోవడం నెమ్మదిగా అలవాటు చేయాలి.

సదుపాయాలు, వినోదాలనుండి వారిని దూరం చేయకండి. బయటకు తీసుకువెళ్ళినపుడు పిల్లలు అల్లరి చేస్తున్నారని కొందరు తల్లిదండ్రులు వారిని బయటకు తీసుకెళ్ళడం మానేస్తారు. అది అస్సలు మంచి పద్దతి కాదు. బయటకు వెళ్ళినపుడు ఎలా ఉండాలో పదే పదే చెప్పడం ద్వారా పిల్లలు తప్పకుండా అర్ధం చేసుకుంటారు. మొదట్లో కొన్ని సార్లు ఇబ్బందైనా రాను రాను తప్పకుండా నేర్చుకుంటారు, వాళ్ళు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం ఆచరిస్తారు.

డాక్టర్. పి. అమల కుమారి, ప్రొఫెసర్, విస్తరణ మరియు ప్రసార నిర్వహణ విభాగం.

Download File

Rating :3.38 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4