బాలలు అభివృద్ధి

పిల్లల పెంపకం

పిల్లల పెంపకం అన్నది ఒక కళ, తల్లి దండ్రుల పెంపక విధానాలను బట్టి పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. మొక్కై వంగనిది మానై వంగునా అన్న సామెత ఆధారంగా పిల్లలను చిన్న వయస్సు నుంచే సక్రమంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులది. అలా అని పిల్లలను ప్రతీ చిన్న విషయానికి కఠినంగా శిక్షించకూడదు. ప్రేమ ఆప్యాయతతో వారి మనస్సులలో మార్పుతీసుకురావాలి. చిన్నప్పటి తల్లిదండ్రుల పెంపక విధానాలపైనే పిల్లల భావి జీవిత పునాది ఏర్పడుతుంది.

పిల్లల పెంపకం గురించి పరిశోధకులు వెలువరించిన సత్యాలు

 • తల్లి తండ్రులు పిల్లలతో ఆడుతూ, పాడుతూ ఉంటే, అట్టి పిల్లలు సమాజ మెప్పును పొందుతారు.  సమాజపరంగా ఎన్నో విజయాలను సాధిస్తారు.
 • పసికందుల పై ప్రతికూల ప్రవర్తనను తల్లితండ్రులు చూపించినట్లైతే, అటువంటి పిల్లలు బడిలో చేరినప్పుడే కలహాలకు పోయేవారిగా గుర్తించబడతారు. 5 సంవత్సరాల లోపు వయస్సులోనే ఇటువంటి తత్వం ఉంటే, వారు జీవిత పర్యంతం అలాగే ఉంటారు.
 • తల్లితండ్రులు కరుణ దయ గల స్వభావులైతే, పిల్లలు కూడా అటువంటి వ్యక్తిత్వాన్నే అలవరుచుకుంటారు. తల్లితండ్రులకూ ఈ గుణం ఉండటం చాలా అవసరం. పెంపకంలో ఉండే ప్రతి సమస్యను ఈ ధ్రక్పథంతొనే ఎదుర్కోవాలి.
 • పిల్లల పట్ల స్నేహపూర్వకంగా ఉండే తల్లితండ్రులకు, సాధారణంగా యుక్తవయస్కులైన పిల్లలనుండి వచ్చే సమస్యలు ఎదురుకావని పరిశోధకులు చెప్తున్నారు. ఆంతేకాదు స్నేహపూరక వాతావరణం ఆరోగ్యానికి కూడా మంచిది.
 • యుక్తవయస్సు వచ్చాక పిల్లలు స్వేచ్చగా, స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. తమ కార్యకలాపాలలో తల్లితండ్రులు జోక్యం చేసుకోవడం చాలమంది పిల్లలు ఇష్టపడరు. ఫరస్పరం స్నేహపూర్వకంగా ఉంటే తల్లితండ్రులకు పిల్లలపట్ల విశ్వాసం ఉంటుంది, పిల్లలు వారితో బాహాటంగా, నిష్కపటంగాఉంటారు.
 • అస్తవ్యస్తమైన వైవాహిక జీవితం గల వారి పిల్లలకు నిద్రకు సంబంధమైన సమస్యలు చిన్నవయస్సులోనే ప్రారంభమౌతాయి. కంటినిండానిద్రపోకపోతే వారిలో అలసట, చిరాకు, విసుగు, ఏకాగ్రత లేకపోవడం, చదువులో, అభ్యసనలో రాణించలేకపోవడం మొదలైన సమస్యలు వస్తాయి. బిడ్డలకోసమైన తల్లితండ్రులు ఒకరిపట్ల మరొకరు సహనవంతులై ఉండాలి.
 • తీవ్రమైన ఆందోళన, వత్తిడి సమస్యతో సతమతయ్యే తల్లులకు పెంపకం ఒక సవాలే. వారు పసిబిడ్డలు ఏడుస్తున్నా స్థబ్దుగా ఉండిపోతారు. ఫ్రతికూల పెంపకం అలవాట్లుగల తల్లులవలన పిల్లలోకూడా వత్తిడి మొదలౌతుంది.
 • తల్లితో భద్రతతోకూడిన అనుబంధంగల పిల్లలు అన్నివిధాలుగా అమోదం పొందుతారు. వారికి ఎటువంటి సమస్య వచ్చినా తల్లి దగ్గరకు పరిగెడ్తారు, ప్రవర్తనా సమస్యలనుకూడా అధిగమించగలుగుతారు. దీని ప్రభావం ఆడపిల్లలకంటే ఎక్కువగా మగ పిల్లల్లో కనిపిస్తుంది.
 • యుక్తవయస్కులు  తమ కాళ్ళమీద తామునిలబడాలనుకోడం అత్యాశకాదు. కానివారికి తల్లితండ్రుల సహాయ సహకరాలు చాలా అవసరం. ముఖ్యంగా తల్లులు అటువంటి చేయూతనిస్తే ఇంట్లోనే కాదు స్నేహితుల మధ్యకూడా వారు బాగా గుర్తించబడతారు.
 • తమ పిల్లలు అన్నివిధాలుగా పరిపూర్ణంగా ఉండాలనుకోవడం, ఒకవైపు పిల్లలకు, మరొక వైపు తల్లితండ్రులకు హింసే. పిల్లలను చాలా చక్కగా పెంచాలి, లేకపోతే సమాజం తమను చిన్నచూపు చూస్తుంది అనుకొనే తల్లి తండ్రులకు ఇంకా దారుణమైన హింస. ఎవరివైపునుండి కాకుండా తాము, తమ కుటుంబ వైపునుండి పిల్లలను చూడాలి.
 • తమకన్ని తెలుసు, తాము అనుకున్న విధంగా పిల్లలను పెంచుతాము అనుకుంటే అది పొరపాటు. ముందుగా పిల్లలను అర్థం చేసుకోవాలి. కఠినంగా ప్రవర్తించే తల్లితండ్రుల పిల్లలకంటే, మృదు స్వభావం కలిగిన వారి పిల్లలకు చింతా, వ్యాకులత, ఆందోళన పరమైన సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు.

 

తల్లిదండ్రుల పెంపక విధానాలలో లోపం ఉన్నట్లైతే వాటి పర్యవసానాలు, దుష్పరిణామాలు పిల్లలు అనుభవించవలసి ఉంటుంది. కనుక ప్రతీ తల్లిదండ్రులకు పెంపక విధానాల గురించి, వాటి పరిణామాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

పిల్లల పెంపక విధానాలు- పరిణామాలు

 • విమర్శలతో పెంచబడిన బిడ్డ తనను తాను దోషిగా తలుస్తాడు.
 • కోపతాపాలతో పెంచబడిన బిడ్డ కయ్యాలకు కాలు దువ్వుతాడు.
 • పరిహాసాలతో పెంచబడిన బిడ్డ పిరికివానిగా తయారవుతాడు.
 • అవమానాలతో పెంచబడిన బిడ్డ అభద్రతా భావానికి గురవుతాడు.
 • సహనంతో పెంచబడిన బిడ్డ క్షమాగుణాన్ని అలవరచుకుంటాడు.
 • ప్రోత్సహించి పెంచబడిన బిడ్డ ఆత్మ విశ్వాసంతో పెరుగుతాడు.
 • అభినందనలతో పెంచబడిన బిడ్డ ఎదుటివారిని గౌరవించి, విలువనివ్వటం నేర్చుకుంటాడు.
 • రక్షణాభావంతో పెంచబడిన బిడ్డ జీవితంపై దృఢమైన నమ్మకం పెంచుకుంటాడు.
 • నిష్పక్షపాతంగా పెంచబడిన బిడ్డ నీతిగా పెరగటం నేర్చుకుంటాడు.
 • స్నేహభావంతో పెంచబడిన బిడ్డ ఇతరుల ఎడల ప్రేమ భావాన్ని పెంచుకుంటాడు.

ప్రతి ఒక్క తల్లి తండ్రికి పై విధానాలను, వాటి పరిణామాల్ను గురించి తెలుసుకుని, తమ పెంపక విధానాలలోని లోటు పాట్లను సరిదిద్దుకోవలసిన అవసరం, బాధ్యత ఎంతైనా ఉంది. అప్పుడే వారు పిల్లల భావి జీవితానికి బంగారు బాట వేయగలుగుతారు.

పిల్లల పెంపకం - తల్లితండ్రులకు సూచనలు

పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు కొన్ని సూచనలను పాటించినట్లయితే పెంపకం చాలా సులభమవుతుంది. పిల్లల వయస్సులను బట్టి వారి శారీరక అవసరాలు, మానసిక అవసరాలు, ప్రవర్తన, అభిరుచులు మారుతూ ఉంటాయి. వాటిని పెద్దలు సరిగా అర్ధం చేసుకోకపోవటం వల్లనే అసలు సమస్యలు మొదలవుతాయి. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికీ చిన్నవారిలాగానే చూస్తారు. వారిలో వయస్సుతో వచ్చిన మార్పులను అర్ధంచేసుకోక వారి ప్రవర్తన చాలా మారిపోయిందనుకుంటారు. కనుక తల్లితండ్రులకు పిల్లల పెరుగుదలపై సరైన అవగాహన ఉండాలి.

 • పిల్లల ప్రాధమిక అవసరాలను తీర్చటం తల్లితండ్రుల బాధ్యత.
 • పిల్లలకు వారి పనులు వారే స్వతహాగా చేసుకోవటం అలవాటు చేయాలి.
 • ప్రతిరోజూ పిల్లలతో కొంత సమయాన్ని గడిపి, వారు చెప్పేది విని, వారి ఆలోచనలను, అంతరంగాలను అర్ధం చేసుకోవాలి.
 • పిల్లలలో సృజనాత్మక శక్తిని గుర్తించి ప్రోత్సహించాలి.
 • పిల్లలందరిని సమానంగా చూడాలి, పక్షపాత వైఖరిని చూపకూడదు, ఇతర పిల్లలతో పోల్చి, కించపరిచితే వారు ఆత్మన్యూనతకు గురి అవుతారు.
 • ప్రతి విషయంలొ లోపాలను ఎత్తిచూపి, మందలించకూడదు. అలా చేస్తే వారు మొండిగా తయారవుతారు. వారికి మెల్లగా అర్ధం అయ్యేట్లు నచ్చజెప్పి మార్పును తీసుకురావాలి.
 • పిల్లలకు స్వేచ్ఛ, క్రమశిక్షణ, సరైన పాళ్ళలో ఉండాలి.
 • పిల్లలకు చదువు ఎంత అవసరమో, ఆటలు కూడా అంతే అవసరం. ఆటలు పిల్లల శారీరక మరియు మానసిక వృద్ధికి దోహదం చేస్తాయి.
 • పిల్లలలో తలెత్తే ప్రవర్తనా సమస్యలను తల్లిదండ్రులు సహృదయంతో అర్ధం చేసుకుని, వాటికి నివారణోపాయం ఆలోచించి పరిష్కరించాలి.
 • పిల్లల స్నేహితుల గురించి తెలుసుకోవాలి, వారి స్నేహాలను గౌరవించాలి.
 • యుక్తవయస్కులైన పిల్లలను తల్లిదండ్రులు స్నేహితులుగా చూడాలి. వారి అభిప్రాయాలను, అభిరుచులను మన్నించి గౌరవించాలి.

ఈ సూచనలను పాటించినట్లయితే తల్లిదండ్రులకు, పిల్లలకు సరైన అవగాహన ఏర్పడి, పిల్లల పెంపకం ఆనందదాయకమవుతుంది.

పిల్లల చదువు - తల్లిదండ్రుల బాధ్యత

పిల్లల చదువుల విషయంలో పూర్వం తల్లిదండ్రుల పాత్ర తక్కువగానూ, ఉపాధ్యాయుల పాత్ర ఎక్కువగానూ ఉండేది. కానీ ఇంతకుముందుకు, ఇప్పటికీ పిల్లల చదువుల్లో ఎంతో మార్పు వచ్చింది. అందువలన తల్లిదండ్రులకు, పిల్లల చిన్న వయస్సునుండే ఎక్కువ బాధ్యత తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, కొంచం శ్రద్ధ వహించాలి. పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించి, వారిచేత చదివించటం, హోంవర్కు చేయించటం చేయాలి. అంతేకాని దగ్గరుండి ప్రతీదీ మీరే చేయకూడదు. దానివలన పిల్లలకు లాభంకంటే నష్టం ఎక్కువ.

 • పిల్లలు ఏకాగ్రతగా చదువుకోవటానికి ఇంటివాతావరణం దోహదం చేసేట్లుగా చూడాలి.
 • కొంతమంది పిల్లలు కొన్ని పాఠ్యాంశాలు చదవటానికి కష్టపడుతుంటారు. వారికి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి, తగిన శిక్షణ ఇవ్వాలి. అంతేకాని వారిని కించపరిచి, హేళన చేయకూడదు. అలా చేస్తే వారు నూన్యతాభావానికి గురవుతారు.
 • చిన్నప్పటినుంచి పిల్లలకు పాఠ్యాంశాలే కాక, లోక జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలను చదివే అలవాటు చేయాలి, వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్ళాలి.
 • పిల్లల పాఠశాలలకు వెళ్ళి, వారి ఉపాధ్యాయులను కలిసి, వారి అభిప్రాయాలను తెలుసుకుని చర్చించాలి.
 • పిల్లలు ఏదైనా ఒక విషయంలో విశేషమైన ప్రతిభ కనబరిచినపుడు వారిని తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలి. అప్పుడు వారికి శక్తి సామర్థ్యాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.
 • పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు లింగబేధాలను, పక్షపాత వైఖరిని చూపకూడదు, అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చదివించాలి.
 • తల్లిదండ్రులు పిల్లల చదువుల విషయంలో వారి శక్తి సామర్థ్యాలను మించిన ఫలితాలను ఆశించకూడదు.
 • చదువుతోపాటు పిల్లలకు ఆటలు, వ్యాయామం కూడా అవసరమే. ఆటల వలన పిల్లల దేహాభివృద్ధి, మానసికాభివృద్ధి పెంపొందుతాయి.
 • మన చేతివేళ్ళన్నీ ఒకలాగే ఉండనట్లే, మన పిల్లలంతా ఒకలాగే ఉండరు, అయినా తల్లిదండ్రులు సమానంగా చూస్తూ చదివించినట్లయితే పిల్లలు చక్కగా చదివి, మంచి పేరు తెచ్చుకుంటారు. " నేటి బాలలే రేపటి పౌరులు " అన్న విషయం అందరికీ తెలిసిందే.

కనుక చిన్నతనంలో పిల్లలకు ఇచ్చే శిక్షణపైనే వారి భావి జీవితం ఆధారపడి ఉంటుందన్న విషయం తల్లిదండ్రులు గ్రహించాలి. పిల్లల పెంపక విషయంలో ఈ సూచనలన్నీ పాటిస్తే వాళ్ళు చాలా చక్కగా పెరుగుతారు అలాగే పిల్లలు వాళ్ళ యొక్క భవిష్యత్తును అందంగా మార్చుకుంటారు.  

డాక్టర్ మయూరి, విశ్రాంత ప్రొఫెసర్ & హెడ్, మానవ అభివృద్ధి & కుటుంబ అధ్యయన విభాగం.

Download File

Rating :3.03 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4