బాలలు అభివృద్ధి

చంటి బిడ్డలు- అభివృద్ధి మైలురాళ్ళు

మొదటి నెల-జ్ఞానాలలో పెరుగుదల:
కొత్త వాతావరణాన్ని చూస్తూ వింటూ స్పర్శతొ వాసనతొ గమనిస్తూ ఉంటారు. సన్నగా నవ్వుతూ ఉంటారు. మొదటి 2 వారాలు దాదాపుగా 23 గంటలపాటు నిద్రపోతుంటారు. 3వ వారంలొ నిద్ర తగ్గుతుంది మామూలు కంటే ఎక్కువగా ఎడుస్తుంటారు. మెడ కండరాలు బలపడే కొద్దీ,కొద్దిగా తలను పైకి ఎత్తుతుంటారు కళ్ళకు ఒక జానెడు దూరంలో ఉన్న వస్తువులను గమనిస్తూ ఉంటారు. నలుపు తెలుపు రంగులను మాత్రమే గుర్తుపట్టగలుగుతారు ఒక్కసారిగా వెలుతురు చూడగానే కళ్ళను చిక్కిలిస్తుంటారు పరిచయమైన శబ్దాలను, గొంతులను గుర్తుపట్టి ఆ వైపుకు తల తిప్పుతారు. బిడ్డ అరచేతిని రుద్దుతున్నపుడు వేలు పట్టుకోవాలని చూస్తారు. తల్లి పాల వాసనను గుర్తుపట్టగలుగుతారు.

రెండవ నెల-అప్రమత్తత అవగాహన:
పెద్ద శబ్దాలు విన్నపుడు ఒక్కసారిగా నిశ్శబ్దమై తరువాత గట్టిగా ఏడుస్తారు లేదా ఉలిక్కిపడ్డట్టుగా నటిస్తారు. కు కు కు శబ్దాలు చేస్తారు ఊ ఆ అని ఎక్కువగా అంటుంటారు బోర్లా పడుకోపెట్టినపుడు తల, ఛాతీ బాగాన్ని చేతుల ఆదారంతో పైకెత్తుతారు.చిన్న వస్తువులపై దృష్టి కేంద్రీకరించి కదలికలను బట్టి చూపును కూడా తిప్పుతారు.

మూడవ నెల-నమ్మకం పెంపొందించుకోవడం:
దగ్గరలో ఉన్న వస్తువులను పట్టుకోవాలని చూస్తారు గుప్పెళ్ళు తెరుస్తూ మూస్తూ ఉంటారు. వేళ్ళను,వస్తువులను నోటిలో పెట్టుకుని చీకుతూ పరిసరాలను అన్వేషించే ప్రయత్నం చేస్తుంటారు. కళ్ళను విప్పార్చుకొని తల్లి కదలికలను చూస్తూ ఉంటారు.కంటి చూపు అభివ్రుద్ది చెందుతూ ఉంటుంది. ప్రాధమిక రంగులైన ఎరుపు, పసుపు, నీలి రంగులను గుర్తుపడతారు. చిన్న వస్తువులను గమనిస్తూ కదలికలను బట్టి చూపు తిప్పుతూ ఉంటారు. శబ్దాలను గుర్తించే శక్తి పెరిగేకొద్దీ తల్లి గొంతును ఇతర బాగా పరిచయమైన గొంతులను గుర్తుపడతారు.

నాల్గవ నెల-భావ ప్రసారాన్ని ప్రారంభించడం:
కీచుమని అరుస్తారు, ఆహ్లాదంగా నవ్వుతూ ఉంటారు. పెదాలతో చప్పరించే శబ్దాన్ని చేస్తుంటారు. కొత్త కొత్త శబ్దాలను ప్రయొగిస్తుంటారు. పిలిచినపుడు జవాబు పలికేవిదంగా శబ్దం చేస్తుంటారు. తల మెడ బలపడేకొద్దీ కదులుతున్న వస్తువులను చూస్తూ ఉంటారు. బోర్లా పడుకోపెట్టినపుడు చేతులు నిటారుగా పెట్టి తల పైకెత్తి మెడను కూడా కడుపుతూ చూస్తూ ఉంటారు బొమ్మలను ఇతర వస్తువులను చేరుకునే ప్రయత్నం చేస్తుంటారు రాత్రులు బాగా నిద్రపోతారు.

ఐదవ నెల-చేతిలో వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించుట:
కన్ను చేయి సమన్వయం పెరిగేకొద్దీ పెద్ద వస్తువులను అందుకోవటానికి ప్రయత్నం చేస్తారు. కండరాలు బలపడటం వల్ల మెడను పైకెత్తి చూస్తూ ఉంటారు.ఆదారంతో ఎక్కువసేపు కూర్చోగలుగుతారు. ఆదారం లేకుండా కొంచెంసేపు మాత్రమే కూర్చుంటారు. సొంతంగా బోర్లాపడటం వెల్లకిలా పడుకోవటం చేస్తుంటారు. చేతి కండరాలు బలపడేకొద్దీ బోర్లా పడుకున్నపుడు ఛాతీని బాగాపైకెత్తుతారు. అనుకరణ ద్వనులను, సంజ్ఞలను చేస్తూ ఉంటారు తల్లి దృష్టిని ఆకర్షించటానికి నోటితో ఉమ్ము బుడగలు చేస్తుంటారు. ఆ ఊ అంటూ చందోబద్దమైన శబ్దాలను చేస్తారు.ప్రతీ శబ్దానికీ రూఢిగా స్పందిస్తారు. ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క రకమైన శబ్దం చేస్తుంటారు.

ఆరవ నెల:
చిన్న కండరాల అభివృద్ధి జరగటం వలన చేతితో వస్తువును పట్టుకుని తిప్పి చూస్తుంటారు. ఆ,ఈ,ఊ అంటూ శబ్దాలు చేస్తారు. పేరు పెట్టి పిలిచినపుడు పలుకుతారు. కొన్ని పదాలను గుర్తించగల్గుతారు ఉదాహరణకు అమ్మ ఏది అంటే అమ్మ వైపు చూడటం. చేతిలోనుంచి వస్తువును తీసివేస్తే కోపగించుకుంటారు. వాళ్ళలో వాల్లే మాట్లాడుకుంటూ తమకు తాము పరిశోధించుకుంటారు. కాళ్ళు బలంగా తయారవుతాయి.తల్లి దగ్గరగా లేకపోతే తల్లిని చూడాలని తపిస్తూ ఉంటారు. దీనినే Separation anxiety అంటారు. ప్రతీది నోట్లో పెట్టుకోవడం ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే శరీరంలో అన్ని భాగాల కంటే కూడా నోటిలో నరాల కొసలు కేంద్రీకృతమై ఉంటాయి. అందుకే తమ నోటితో ఎక్కువగా ప్రపంచాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఒక స్థలం నుంచి మరొక స్థలానికి పొట్టతో పాకుతుంటారు.

ఏడవ నెల-కదలికలు:
మీరు వాళ్ళను ఎత్తుకున్నపుడు సాగుతూ పైకి క్రిందకు దుమకటం చేస్తుంటారు. ఒక చేత్తో బొమ్మను పట్టుకుంటారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంటుంది. చేతిలో బొమ్మను తీసేస్తే చాలా కోపం వస్తుంది. రకరకాల బొమ్మలతో రకరకాల ఆటలు ఆడుతుంటారు. తల్లి గొంతును బట్టి ఆమెలోని భావాలను తెలుసుకుంటారు. పాకుతూ లేదా జరుగుతూ చుట్టూ ప్రదేశమంతా కదులుతూ ఉంటారు. సన్నగాతరిగిన మెత్తటి ఆహారాన్ని తినగల్గుతారు.

ఎనిమిదవ నెల:
కండరాల సమన్వయం పెంపొందేకొద్డీ కుప్పగా చుట్టూ బొమ్మలను పోసుకుని వాటిలో నుంచి ఒక వస్తువును తీసుకుంటారు. చమత్కార భావన ఇప్పుడే పెంపొందుతుంది. చేతులను పైకెత్తి ఎత్తుకోమని అడుగుతుంటారు. అన్నం పెట్టేటపుడు నోటికి అందుకోవటానికి మొందుకు వంగుతుంటారు. ఆకలిగా లేనపుడు తల తిప్పేస్తుంటారు. ది,భ మ...అంటూ అప్పుడప్పుడూ శబ్ధాలు చేస్తారు. వద్దు అనటానికి అర్ధం ఇప్పుడే నేర్చుకుంటారు. దానికి సంబంధించిన సంజ్న చూపిస్తూ ఉంటారు. వేరే ఇతర పదాలు తెలిసినప్పటికీ వద్దు అనేదే ముఖ్యంగా అర్దమవుతుంది. వద్దు అన్నదానిని చూపించే క్రియను అంటే తల అడ్డంగా తిప్పడం చేతులు ఊపటం చేయగల్గుతారు. లోపల బయటకు తేడా తెలుస్తుంది. ఉదాహరణకు వస్తువులు ఒక బకెట్లో వేయడం బయటకు తీయటం. పద శబ్ధానికి అనుగుణంగా నాలుకను తిప్పుతుంటారు.

తొమ్మిదవ నెల:
బొమ్మ నాకిస్తావా, నాతో వస్తావా వంటి అభ్యర్ధనలకు బదులుగా స్పందిస్తుంటారు. కండరాలు వ్రుద్ది చెందటం వల్ల శరీరపు కదలికలు కూడా వ్రుద్ది చెందుతాయి. ఏదైనా బొమ్మను దాచిపెట్టి కనుక్కోమంటే కనుక్కుంటారు. శభ్ధాల ద్వారా తన భావాలను తెలియపరచవచ్చని నేర్చుకుంటారు. చిన్న చిన్న పదార్ధాలను(ఉదా:పప్పులు,అన్నం మెతుకులు)చూపుడు వేలు బొటనవేలు మద్య పట్టుకుని పరిశీలిస్తుంటారు. బొమ్మలను కింద పడేస్తూ అవి ఎలా పడుతున్నాయో ఎక్కడ పడ్డాయో గమనిస్తూ ఉంటారు. పాటలు సంగీతం విన్నపుడు అనుగుణంగా శరీరాన్ని కదిలిస్తారు. చూపుడు వేలును ఎక్కువగా ఉపయోగిస్తూ ఏదైనా ఒక వస్తువును చూపించటం, గుచ్చటం చేస్తుంటారు. కలలు రావటం వలన నిద్రలో ఎక్కువగా కదులుతుంటారు.

పదవ నెల:
ఆటల పట్ల ఆశక్తి పెరుగుతుంది. ఎవరితోనైనా కలిసి ఆడుకోవాలని ఆశక్తి చూపుతారు. ఇంట్లో ఇతరులను అనుకరిస్తూ ఉంటారు. తల్లిని విడిచిపెట్టడానికి అంగీకరించరు. నిద్రపోతున్నా ఆడుకుంటున్నా పక్కనే ఉండాలని చూస్తుంటారు. ఇష్టమైన పాటలు గుర్తుపెట్టుకుంటారు. అవి మరలా విన్నపుడు నవ్వుతుంటారు. వాళ్ళ అవసరాలను ఏడుపు ద్వారా కాకుండా సంజ్ఞల ద్వారా శబ్ధాల ద్వారా తెలియచేస్తారు. మధ్య మధ్యలో వింత శబ్ధాలు చేస్తుంటారు.

పదకొండవ నెల:
ఉద్వేగాభివృద్ధి జరిగినందువలన కోప్పడినప్పుడు ఏడుస్తుంటారు. ఏ ఆధారం లేకుండానే నిలబడటం, కూర్చోవడం చేయగల్గుతారు. శరీర భాగాలను గుర్తుపట్టగలుగుతారు. తల్లి దృష్టిని ఆకర్షించడానికి తనదైన బాషలో మాట్లాడటం నటించటం చేస్తుంటారు.

పన్నెండవ నెల:
ఏదైనా ఒక వస్తువు పట్ల ఎక్కువ మక్కువను చూపిస్తారు.అది పట్టుకుని తిరుగుతూ ఉంటారు. తల్లితండ్రుల తర్వాత సురక్షితమైన ఇతర వ్యక్తులకు ప్రదేశాలకు అలవాటుపడుతుంటారు. ఏ అధారం లేకుండా నడుస్తారు. బ్లాకులను ఒకదాని మీద ఒకటి పెట్టడం పేపర్ మీద గీయడం నేర్చుకుంటారు. పుస్తకంలో చెప్పిన బొమ్మను కరెక్టుగా చూపిస్తుంటారు. అమ్మ, మామ, తాత, అవ్వ...వంటి పదాలను నేర్చుకుంటారు. పరిసరాలలోని జంతువుల అరుపులను(కుక్క, పిల్లి)అనుకరిస్తూ ఉంటారు.

డాక్టర్. పి. అమల కుమారి, ప్రొఫెసర్, విస్తరణ మరియు ప్రసార నిర్వహణ విభాగం.

Download File

Rating :3.21 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4