ఆరోగ్యం

కీలక ఆరోగ్యాంశాలు (యాంటీ బయాటిక్ ప్రతిఘటన)

మారుతున్న జీవన శైలి కారణంగా మానవ ఆరోగ్యంలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. కొన్ని అంశాలపట్ల అవగాహన ఏర్పరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
యాంటీ బయాటిక్ ప్రతిఘటన
అసలు యాంటీబయాటిక్ అంటే ఏమిటి?
యాంటీబయాటిక్ అంటే శరీరంలో బాక్టీరియా వంటి సూక్ష్మ క్రిములు ప్రవేశించడం వలన వ్యాధి వ్యాపించినపుడు, ఆ పరిస్థితిని ఎదుర్కొనడానికి మందుల రూపంలో శరీరంలోనికి పంపే రసాయన పదార్థం. దీనికి సూక్ష్మ క్రిములను నశింపచేసే శక్తి ఉంటుంది.  ప్రపంచంలో మొట్టమొదటగా 1920 సంవత్సరంలో, అలెక్సాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ కనుకొన్నారు. కాని దాని వాడకం మాత్రం 1940 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇప్పటికే ఎన్నో యాంటీబయాటిక్సు కనుకొన్నా, మానవ ఆరోగ్య దృష్ట్యా ఈపరిశోధన కొనసాగుతూనే ఉన్నది. జంతువులకు, వృక్షాలకు, పంటలకు కూడా యాంటీబయాటిక్సు వాడతారు.

యాంటీబయాటిక్ ప్రతిఘటన/వ్యతిరేకత/ నిరోధకత అనేది శరీరంలో సంభవించే ఒక సహజదృశ్య పరిణామం. ప్రతిదానికి యాంటీబయాటిక్ ను వాడటం, అనవసరంగా వాడటం, ఎక్కువగ వాడటం జరిగినప్పుడు,  దానిని ఆకర్షించే బాక్టీరియా పరిమాణం తగ్గి, నిరోధించే బాక్టీరియా పరిమాణం పెరిగే అవకాశం ఎక్కువ అవుతుంది. అందువలన తీసుకున్న యాంటీబయాటిక్కు బాక్టీరియా పెరుగుదలను అరికట్టే సామర్థ్యం తగ్గిపోతుంది, దాంతోవ్యాధికారక బాక్టీరియా పరిమాణం పెరుతుంది. దీనినే యాంటీబయాటిక్ ప్రతిఘటన/వ్యతిరేకత/ నిరోధకత అంటారు. ఈ స్థితి వస్తుందని  యాంటీబయాటిక్ ను కనుకొన్నప్పుడే శాస్త్రవేత్తలు ఊహించారు, హెచ్చరించారు కూడా. కాని యాంటీబయాటిక్ గల స్వస్థత గుణమే  శరవేగంగా దాని ఉత్పత్తిని, వాడకాన్ని పెంచేసింది. ఈ ప్రక్రియ కొనసాగడంవలన ఇప్పటికే కొన్ని బాక్టీరియాల పట్ల నిరోధకత వచ్చేసింది. ప్రస్తుతం ఇది ప్రపంచ ప్రజారోగ్య సమస్యగా చూడబడుతున్నది.

యాంటీబయాటిక్ ప్రతిఘటనకు కారణాలు

 • స్వంత వైద్యం చేసుకోవడం.
   
 •  విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్ ను వాడటం

   
 • యాంటీబయాటిక్ ఎన్ని రోజులు తీసుకోవాలో అన్ని రోజులు తీసుకోకుండా అసంపూర్తిగా వదలివేయ్యడం. 
   
 • వ్యవసాయంలోకూడా విపరీతంగా యాంటీబయాటిక్స్ వాడటం. ఫ్రపంచంలో ఉత్పత్తి అయ్యే యాంటీబయాటిక్స్ లో 50% వ్యసాయంలోనే వాడుతున్నారని అంచనా.
   
 • జంతువులకు, మొక్కలకు యాంటీ బయాటిక్సు వాడటం వలన, వాటిని ఆహారంగా తీసుకునే మానవులలో యాంటీ బయాటిక్ ప్రతిఘటన పెరుగుతుంది.

యాంటీబయాటిక్ ప్రతిఘటన/వ్యతిరేకత/ నిరోధకత ఎలా సోకుతుంది?

అనవసరంగా యాంటీబయాటిక్సు వాడితే అది ప్రతిఘటన ను సృష్టిస్తుంది. ఇన్ ఫెక్షన్లను  తగ్గించడానికి మాత్రమే యాంటీబయాటిక్సు వాడాలి.
ఇప్పుడేమి చేయాలి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగు మార్గాలను సూచిస్తున్నది.

1. యాంటీబయాటిక్ ప్రతిఘటన మీద నిరంతరం నిఘాపెట్టుకొని ఉండడం. అవసరమైన వెంటనే స్పందించడం. 

2. యాంటీబయాటిక్ వాడకం పట్ల విచక్షణతో వ్యవహరించడం; దీని పట్ల ఆరోగ్య కార్యకర్తలకు, ప్రజలకు అవసరమైనంత అవగాహనను కల్పించడం

3.  వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేనిదే యాంటీబయాటిక్ లు అమ్మకుండా ప్రభుత్వం చట్టం తేవడం

4. హాస్పటళ్ళు, క్లీనిక్ లు, డిస్పెన్సరీలు మొదలైన ఆరోగ్య సంరక్షణ అందించే ప్రాంతాలలో పరిశుభ్రతను పాటించడం, చేతుల శుభ్రతను ఎక్కువగా వ్యాప్తి చేయడం.

ప్రతి ఒక్కరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. . .

 • వైరల్ ఇన్ ఫెక్షన్లకు యాంటీబయాటిక్ వాడవద్దు. (జలుబు, ముక్కుకారడం, గొంతు గర గర మొదలైనవి)
 • వైద్యుల సలహా మేరకే యాంటీబయాటిక్ ను వాడాలి.
 • ఎంతకాలం యాంటీబయాటిక్స్ ను వాడమన్నారో అంత కాలం పూర్తి మోతాదును వాడాలి
 • మిగిలిపోయిన మందులను ఎవరికి ఇవ్వద్దు, ఎవరి దగ్గర తెచ్చుకోవద్దు. వాడగా మిగిలినవి పారేయ్యాలి.
 • సబ్బుతో, నీళ్ళతో తరచూ చేతులు కడుక్కోవాలి. కడుక్కున్నప్పుడెల్లా 20 సెకండ్ల పాటు కడుక్కుంటే మంచిది.
 • దగ్గు, తుమ్ము వచ్చినప్పడు టిష్యూ పేపర్ వాడడం మంచిది.
 • వాంతులైనా, విరోచనాలవుతున్న తరచూ చేతులు కడుక్కోవాలి. ఆ సమయంలో వంట చేయకపోతే మంచిది. 
 • అపరిశుభ్ర పరిసరాలున్న చోట అస్సలు ఆహారం తీసుకోవద్దు. ముఖ్యంగా రోడ్ల పక్కన పాని పూరి, చాట్ మొదలైనవి వడ్డించేవాళ్ళు చేతులనే ఉపయోగించవలసి వస్తుంది. అలాంటి చోట్ల ఎంతవరకు పరిశుభ్రతను శాసించగలం? కనుక వాటికి దూరంగా ఉండడమే  శ్రేయస్కరం. ఆందువలన ఇన్ ఫెక్షన్లకు దూరంగా ఉండగలం.

డాక్టర్ కె. అపర్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆహారము మరియు పోషణ విభాగము
శ్రీమతి. పర్జన్య కర్నాటి, ఫార్మసిస్ట్.

Download File

Rating :3.22 1   1   1   1  
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Select Rating : 0 1 2 3 4